దేశవ్యాప్తంగా ఏకరూప పన్ను విధానం
-
కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేగ్‌వాల్
నెల్లూరు(బారకాసు):
జీఎస్‌టీ బిల్లుకు పార్లమెంట్ అమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా ఏకరూప పన్ను విధానం అమల్లోకి రానుందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేగ్‌వాల్ పేర్కొన్నారు. తిరంగయాత్రలో భాగంగా మంగళవారం ఆయన నెల్లూరు విచ్చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఒకే దేశం..ఒకే పన్ను విధానం వలన ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇది చాలా కీలకమైన మార్పుగా ఆయన అభివర్ణించారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు స్వాతంత్య్ర సమరయోధులకు ఘనమైన నివాళులర్పించేందుకే కేంద్ర ప్రభుత్వం తిరంగయాత్ర ప్రారంభించిందన్నారు. ముఖ్యంగా యువత దేశ చరిత్ర తెలుసుకుని దేశ భవిష్యత్ కోసం పనిచేయాలన్న ఉద్దేశంతో తిరంగయాత్ర ద్వారా ఆనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. అప్పట్లో సర్థార్‌వల్లభాయిపటేల్ దేశ ఐక్యత కోసం 560 సంస్థానాలను ఏకం చేశారన్నారు. నేడు ప్రధాని నరేంద్రమోదీ కూడా భారతదేశ అభివృద్ధి కోసం ఆదే బాటలో పయనిస్తున్నారని చెప్పారు.
ఏపీని కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుంది
రాష్ట్ర విభజన అనంతరం అంధ్రప్రదేశ్‌ను కేంద్రం అన్ని విధాల ఆదుకుంటుందని కేంద్ర ఆర్థిక సహాయక మంత్రి మేగ్‌వాల్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి అవసరమైన మేరకుఇప్పటికే నిధులు విడుదల చేసిందని, రానున్న రోజుల్లో మరిన్ని నిధులు విడుదల చేయనుందని తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తొలుత కేంద్ర, రాష్ట్ర మంత్రులు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఆత్మకూరు బస్టాండ్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రరెడ్డి, నేతలు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, తేలపల్లిరాఘవయ్య, కందుకూరి సత్యనారాయణ పాల్గొన్నారు.