దేవాలయాలు ధర్మ రక్షణ నిలయాలు
కడప కల్చరల్ :
హిందూ ధర్మ పరిరక్షణకు దేవాలయాలు ముఖ్య కేంద్రాలుగా నిలువాలని హిందూ ధర్మ రక్షణ సమితి చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీఆర్‌కే ప్రసాద్ సూచించారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి జిల్లా కార్యవర్గం నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాని సోమవారం కడప నగరం మున్సిపల్ మైదానంలోగల శ్రీ రాజరాజేశ్వరి ఆలయ ధ్యాన మండపంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ధర్మ రక్షణ చేయాల్సిన పీఠాలు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయాయని, టీటీడీ, రాష్ట్ర దేవాదాయశాఖలు మాత్రమే హిందూ ధర్మ రక్షణకు నడుం బిగించగలిగాయని తెలిపారు.
హిందూ ధర్మ పరిరక్షణ బాధ్యత హిందువులందరిపై ఉందన్నారు. సంస్థ కార్యదర్శి చిలకపాటి విజయ రాఘవాచార్యులు మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణ కోసమే రాష్ట్ర దేవాదాయశాఖకు అనుబంధంగా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి పేరిట అంకితభావంతో పనిచేస్తామన్న వారితో కమిటీని నియమించామన్నారు. జిల్లా దేవాదాయశాఖ ఏసీ శంకర్‌బాలాజీ కూడా సభలో మాట్లాడారు. కార్యక్రమంలో బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి, అచలానంద ఆశ్రమం పీఠాధిపతి స్వామి విరజానంద, బ్రహ్మంగారిమఠం ప్రముఖులు జీవీ సుబ్బారెడ్డి, వీహెచ్‌పీ రాష్ట్ర నాయకులు బైరెడ్డి రామకృష్ణారెడ్డి, తంబి సుబ్బరామయ్య తదితరులు మాట్లాడారు.
నూతన కమిటీ
ఈ సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఆలయ ఈఓ శ్రీధర్ పర్యవేక్షణలో తంబి సుబ్బరామయ్య జిల్లా కో ఆర్డినేటర్‌గా, వీరభోగ వెంకటేశ్వరస్వామి, విరజానందస్వామి, జీవీ సుబ్బారెడ్డిలను కో ఆప్షన్ సభ్యులుగా ప్రకటించారు. 12 మంది కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యుల్లో స్థానికులు రామమహేష్, న్యాయవాది భారవి, పాణి, భూపతిరాయల్, విజయ్‌స్వామి తదితరులు ఉన్నారు.