సబ్సిడీపై కందిపప్పు
♦ త్వరలో ఉల్లి తరహాలో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం: ఈటల
♦ రూ.135కు కిలో చొప్పున కేంద్రం నుంచి కొనుగోలుకు సంప్రదింపులు
సాక్షి, హైదరాబాద్: కందిపప్పును కిలోకు రూ.135 చొప్పున సరఫరా చేసేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసిందని, విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి సబ్సిడీ ధరలపై విక్ర యిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఉల్లిగడ్డ విక్రయ కేంద్రాల తరహాలో మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో కేంద్రాలు చేర్పాటు చేస్తామని చెప్పారు. సోమవారం కందిపప్పు ధరల నియంత్రణ, ధాన్యం కొనుగోలు, సన్నబియ్యం అక్రమాల నివారణ తదితర అంశాలపై జిల్లాల జాయింట్ కలెక్టర్‌లు, డీఎస్‌వో, డీఎంసీలతో సచివాలయంలో మంత్రి సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
‘కందిపప్పును ఇంతకుముందు కేంద్రం నుంచి కిలో రూ.125కి కొనుగోలు చేసి రేషన్‌పై పేదలకు రూ.50కే అందించడం జరిగింది. ప్రస్తుతం ధర రూ.200కు చేరినా రూ.50కే అందిస్తున్నాం. కేంద్రం కందిపప్పును కిలో రూ.135కే సరఫరా చేస్తే ప్రతి కుటుంబానికి రెండు కిలోల చొప్పున అందిస్తాం..’’ అని ఈటల చెప్పారు. కందిపప్పు దళారులు, అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా విసృ్తతంగా దాడులు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే 1967 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇక హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరాలో ఎలాంటి అక్రమాలు జరిగినా ఉపేక్షించేది లేదని మంత్రి చెప్పారు. దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ నేతృత్వంలో కమిటీని నియమిస్తామని, అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాఖలో ఇంటిదొంగలుగా మారిన కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నామని, మెదక్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు అధికారులపై త్వరలోనే వేటు వేయనున్నామని తెలిపారు.
కనీస మద్దతు ధరే కష్టం!
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు విసృ్తత ఏర్పాట్లు చేశామని, ఎన్ని అవసరమైతే అన్ని కేంద్రాలు తెరవాలని అధికారులకు సూచించామని ఈటల చెప్పారు. రైతులను ఆదుకునేందుకు మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇచ్చే అంశాన్ని ప్రస్తావించగా... ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కనీస మద్దతు ధరను ఇప్పించడమే కష్టంగా ఉంది. పత్తికి కనీస మద్దతు ధర రూ.4వేలకు పైగా నిర్ణయించినా ఎక్కడా రూ.3,500కు మించి రావడం లేదు. ఈ పరిస్థితిని నియంత్రించి కనీస మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ కనీస మద్దతు ధర సరిపోతుందని మేం భావించడం లేదు. ఆ ధర కూడా రాకుండా అడ్డుకుంటున్న బ్రోకర్ల నుంచి రైతులను కాపాడుతున్నాం..’’ అని మంత్రి పేర్కొన్నారు.