అబొబ్బో బొగత | water falls in rainy season and torism place | Sakshi
Sakshi News home page

అబొబ్బో బొగత

Published Sun, Jul 17 2016 3:22 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

అబొబ్బో బొగత

అబొబ్బో బొగత

పర్యాటకులను ఆకర్షిస్తున్న జలపాతం
విదేశీయులు సైతం ముగ్దులవుతున్న వైనం
పర్యాటక కేంద్రంగా మలిచేందుకు యత్నాలు
ఇప్పటికే పలుమార్లు సర్వేలు..
పూసూరు బ్రిడ్జి నిర్మాణంతో ప్రాచుర్యం

గుట్టలు..కొండకోనల నడుమ అందాలను ఆరబోస్తోంది బొగత. ఆనందానుభూతులను పంచుతూ పర్యాటకులను ఆహ్వానిస్తోంది. జలపాతం సొబగులను వీక్షించేందుకు మూడేళ్లుగా వీక్షకులు భారీగా వస్తున్నారు. గోదావరిపై పూసూరు బ్రిడ్జి నిర్మాణంతో ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. విదేశీయులు సైతం అడవిలో ఉన్న ఈ జలపాతం రమణీయతను ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతున్నారంటే ఎంతటి ప్రాచుర్యం పొందిందో బొగత. ఫొటోలు.. సెల్ఫీలకు కావాల్సినంత ప్రకృతి సౌందర్యం ఇక్కడ ఎంతగానో ఉంది. ప్రభుత్వం దృష్టి సారిస్తే తెలంగాణలోనే ఇదో ప్రముఖ పర్యాటకేంద్రం అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ‘బొబ్బో.. బొబ్బో..’ అంటూ జలహోరుతో ఆకట్టుకుంటున్న బొగతపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. - వాజేడు

పర్యాటకాభివృద్ధి కోసం..
బొగత జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం కసరత్తు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటకశాఖ అధికారులు ఇప్పటికే పలుమార్లు దీన్ని పరిశీలించారు. అటవీశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, కిందిస్థాయి అధికారులు పలుమార్లు దీన్ని సందర్శించి ఉన్నతాధికారులకు నివేదికలు సైతం ఇచ్చారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పర్యాటకశాఖ కమిషనర్‌ను కలిసి బొగతను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు. రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జలపాతాన్ని పరిశీలించి రావాల్సిందిగా జిల్లా పర్యాటక అధికారి సుమన్‌చక్రవర్తిని ఇటీవల ఇక్కడికి పంపించారు.

వాజేడు: చీకుపల్లి అటవీప్రాంతంలో బొగత జలపాతం పర్యాటకులకు ఆహ్లాదం పంచుతోంది. గుట్టలు, కొండకోనల నడుమ నుంచి ప్రవాహంగా వస్తూ రాళ్ల మీదుగా జాలువారుతున్న ఈ జలపాతాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తున్నారు. విదేశీయులు సైతం దీన్ని చూసి ముగ్దులవుతున్నారు. మూడేళ్లుగా ఇక్కడికి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తున్నారు. పూసూరు వద్ద గోదావరి బ్రిడ్జిపై వంతెన నిర్మాణంతో జలపాతాన్ని సందర్శించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

పూసూరు బ్రిడ్జి నిర్మాణంతో ప్రాచుర్యం
గోదావరి నదిపై పూసురు వద్ద బ్రిడ్జి నిర్మించడంతో బొగతకు పర్యాటకుల తాకిడి పెరిగింది. జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీసంఖ్యలో వస్తున్నారు.

బొగత ఎలా పుట్టింది?
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ గుట్టల మధ్యనున్న దండకారణ్యంలో సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లందేవి గుట్ట వద్ద బొగత పుట్టింది. అక్కడి నుంచి గుట్టల మీదుగా ప్రవహిస్తూ మండలంలోని పెనుగోలు వద్దకు రాగానే ఈ వాగు పాలవాగుగా మారింది. పెనుగోలు ఊరు దాటిన తర్వాత ఆల్బర్ట్ వాగు అయింది. వాజేడు మండల ఇన్‌చార్జి ఎంపీడీఓ ఆల్బర్ట్ పెనుగోలు వెళ్లినప్పుడు జారి పడటంతో చెయ్యి విరిగింది. అక్కడకు వచ్చిన తొలి అధికారి కూడా ఆల్బర్టే కావడంతో ఈ వాగుకు ‘ఆల్బర్ట్ వాగు’గా నామకరణం చేశారు. అక్కడి నుంచి జలపాతం సమీపానికి 6 కిలోమీటర్ల దూరంలోని గుట్టలు దిగి వచ్చిన వాగు చీకుపల్లికి సుమారు అర కిలో మీటరు దూరంలో బండలపై నుంచి జాలు వారి బొగతగా మారింది. గతంలో దీనిని బంధల వాగు అనే వారు. ఏడు మంచాలకు సరిపడా నులక వేస్తే అందనంత లోతుగా ఈ జలపాతం ఉంటుందని ఇప్పటికీ చెప్పుకుంటారు. జలపాతం ఈ ప్రాంతంలోని వారికి చాలాకాలంగా తెలుసు కానీ ఎవ్వరూ అక్కడికి వెళ్లే వారు కాదు. జలపాతం లోపల దేవతామూర్తులు ఉంటారనే నమ్మకంతో దీనిని పవిత్రంగా చూసేవారు. దీనిని బండల వాగు అని కూడా పిలిచేవారు. గుట్టలపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు ‘బొబ్బో..బొబ్బో..’ అని శబ్దం చేస్తుంది.. అందుకే ఇది బొగతగా మారిందని స్థానికులు చెబుతుంటారు.

 హైడల్ విద్యుత్ ప్రాజెక్టునిర్మాణానికి యత్నం
బొగత జలపాతాన్ని 1976లో జలగం వెంగళరావు, సీపీఎం సీనియర్ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య సందర్శించారు. హైడల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మించాలని ప్రయత్నించారు. సర్వేలూ చేశారు. మాజీ మంత్రి జలగం ప్రసాదరావు సైతం హైడల్ ప్రాజెక్టు కోసం సర్వేలు చేయించారు. ఇక్కడ విద్యుత్ ప్రాజెక్టు నిర్మించితే భద్రాచలం డివిజన్‌కు నిరంతరాయంగా ఏడాదికి ఆరు నెలలపాటు విద్యుత్ సరఫరా అవుతుందని అప్పట్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కానీ అది రూపుదాల్చలేదు. నేటి ప్రభుత్వాలైనా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

జూన్ నుంచి నవంబర్ దాకా..
వర్షాకాలంలో జూన్ 20 నుంచి బొగత జలపాతం అందాలు కురిపిస్తుంది. ఇలా నవంబర్ నెల చివరి వరకు తన అందచందాలతో పర్యాటకులకు ఆహ్లాదం పంచుతుంది. అప్పుడు కూడా వర్షాలు కురిస్తే మరో నెల వరకు జలపాతం అందాలను వీక్షించవచ్చు.

ఎంతెంత దూరం..
వాజేడు నుంచి కేవలం మూడున్నర కిలోమీటర్లు ప్రయాణిస్తే బొగత జలపాతాన్ని చేరుకోవచ్చు. భద్రాచలం నుంచి నేరుగా జలపాతాన్ని చేరాలంటే 123 కి.మీ ప్రయాణించాలి. ఖమ్మం నుంచి 243 కి.మీ, వరంగల్ నుంచి 123 కి.మీ ప్రయాణిస్తే బొగత జలపాతం వద్దకు చేరుకోవచ్చు.

జలపాతం సమీపంలో చూడదగ్గ ప్రదేశాలు
బొగత జలపాతానికి సమీపంలోని కొప్పుసూరు అటవీప్రాంతం లో ఉన్న గుండ్లవాగు ప్రాజెక్టు మండలంలో చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటి. మండల శివారు గ్రామం తేకులగూడేనికి ఆరు కి.మీ దూరంలోని లొట్టపిట్ట గండి వద్ద వెలిసిన బీరమయ్య క్షేత్రాన్నీ దర్శించుకోవచ్చు. అక్కడున్న గోదావరిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. బొగత సమీపంలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్నీ దర్శించుకోవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement