నీరు చెట్టు అంతా కనికట్టు
నీరు చెట్టు అంతా కనికట్టు
Published Wed, Jul 27 2016 1:43 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
కార్యకర్తలే కాంట్రాక్టర్లు
‘నీరు–చెట్టు’ పథకంతో నిలువుదోపిడీ
పనులన్నీ పచ్చ చొక్కాలకే
నిబంధనలకు నీళ్లొదిలి మట్టిపనులు
నిఘా లోపంతో తూతూ మంత్రంగా ముగింపు
వర్షాలొచ్చి నీరు చేరినా ఆగని ‘పచ్చ’ తమ్ముళ్లు
రూ.కోట్లలో నిధులు దోచుకుంటున్న వైనం
సాక్షి ప్రతినిధి:
శ్రీకాకుళం/పీఎన్ కాలనీ: ‘నీరు–చెట్టు’ పథకం పేరు చెబితే ఈ రెండు నియోజకవర్గాల్లోనే కాదు జిల్లాలో దాదాపు అన్నిచోట్లా ఇంచుమిం చు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చెరువుల్లో పూడిక తీయడం, వాటి గట్లు పటిష్టం చేయడం, అవసరమైన చోట చప్టాలు, కాలువలు ఏర్పాటు చేసుకోవడం ఈ పథకం లక్ష్యాలు. కానీ చాలాచోట్ల ఇందుకు విరుద్ధంగా పనులు జరిగా యి. జిల్లాలో ఈ పథకం కింద రూ.349.47 కోట్లు అంచనా వ్యయంతో 5,084 పనులకు జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిలో 4,997 పనులకు రూ.331.90 కోట్లతో ఆమోదం లభించింది. వాటిలో ఇప్పటివరకూ 2,250 పనులు పూర్తి అయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 1,263 పనులు జరుగుతున్నాయి.
నిబంధనలకు ‘గండి’
వాస్తవానికి ఈ పథకం కింద చెరువుల్లో నిర్ణీత క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తీయాల్సి ఉంటుంది. ఆ మట్టితో గట్లు పటిష్టం చేయాల్సి ఉన్నప్పటికీ దాన్ని కూడా టీడీపీ కార్యకర్తలు సొమ్ము చేసుకున్నారు. చెరువుల్లో తవ్విన మట్టిని గట్లకు వేయకుండా ఇటుక బట్టీలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వెంచర్లలో స్థలాలను చదును చేయడానికి అమ్ముకొని రూ.కోట్లలోనే లాభం గడించారు. దీనివల్ల చెరువు అభివృద్ధి పనుల ద్వారా వచ్చే నిధుల కన్నా ఈ అక్రమ వ్యవహారం వల్లే ఎక్కువ కావడం గమనార్హం. వర్షాలు ప్రారంభమైన తర్వాత కూడా చాలా పనులు చేపట్టిన తెలుగు తమ్ముళ్లు తూతూమంత్రంగా పూర్తి చేసి చేతులు దులుపుకుంటున్నారు.
అరకొర పనులకు తార్కాణాలు
టెక్కలి నియోజకవర్గంలో పాత జాతీయ రహదారికి పక్కనే ఉన్న రాచబంద చెరువును అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.7 లక్షల నిధులతో ‘నీరు–చెట్టు’ పథకం కింద పనులు చేస్తున్నారు. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభం కావడంతో చెరువులో నీరు చేరింది. అయినా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని చేపట్టింది అధికార పార్టీ కార్యకర్త కాబట్టి ఎవ్వరూ అడగట్లేదు. ∙పాతపట్నం మండలంలో 34 పంచాయతీల పరిధిలో 98 పనులకు రూ. 6.50 కోట్లు విడుదలయ్యాయి. నామినేటెడ్ విధానంలో మొదటి విడతలో 45 పనులు, రెండో విడతలో మరో 53 పనులు మంజూరయ్యాయి. ఈ రెండు విడతల్లో కలిపి మొత్తం 50 పనులు మాత్రమే జరిగాయి. గుమ్మాగెడ్డలో రూ.50 లక్షలతో చేపట్టిన పనుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. బడ్డుమర్రి చెరువు గట్టు పనులు 15 శాతం కూడా చేయలేదు. ఈ మండలం మొత్తం మీద పనులు 20 శాతం మించకపోయినా బిల్లులు మాత్రం 80 శాతం మేర చెల్లించాలని అధికార పార్టీ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి.
కొత్తూరు మండలంలో 68 చెరువుల అభివృద్ధి పనులకు రూ.3.80 కోట్లు మంజూరయ్యా యి. ఇంతవరకు కారిగూడ, ఇరపాడు, కడు ము, మదనాపురం, ఆకులతంపర, మాతల, సిరుసువాడ గ్రామాల్లో నామమాత్రంగా జరిగాయి. ఎల్.ఎన్.పేట మండలంలోని చెరువుల్లో కొన్నేళ్లుగా ఉపాధిహామీ పథకం తవ్విన బంటాల్లోనే ఇప్పుడు నీరు–చెట్టు పథకం కింద కాస్త మెరుగులు దిద్ది బిల్లులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 19 పంచాయతీల్లో మొదటి విడతలో 80 పనులకు రూ.7.35 కోట్లు మంజూరయ్యాయి. రెండో విడతలో 15 పనులకు రూ.కోటి మంజూరైంది. హిరమండలంలో వంశధార అధికారులు 13 పనుల కోసం రూ.కోటి మంజూరైంది. పనుల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దకొల్లివలస ఊర చెరువులో పనులే దీనికి ప్రత్యక్ష నిదర్శనం.
ఆమదాలవలస మండలంలో 134 చెరువులు, 38 కాలువల్లో పనులు చేపట్టారు. సరుబుజ్జిలి మండలంలో 98 చెరువులకు రూ. 5.24 కోట్లతో ప్రతిపాదనలు పెట్టగా ఈ ఏడాది 54 చెరువుల్లో అరకొరగానే పనులు జరిగాయి. యంత్రాలతో తూతూ మంత్రంగానే చేసి గట్టెక్కేశారు. జి.సిగడాంలో స్థానిక ఎమ్మెల్యే బంధువొకరు బినామీల పేరుతో పనులు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగులవలస, పెంట, సీతంపేట, గేదెలపేట, మర్రివలస ప్రాంతాల్లో జరిగిన పనుల్లో కనీస నాణ్యత లేకున్నా బిల్లులు చెల్లించేశారు. లావేరు మండలంలో మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు తాళ్లవలస, చిగురుకొత్తపల్లి గ్రామాల్లో చేపట్టిన పనుల్లో కనీసం నాణ్యత లేదు. ఎచ్చెర్ల మండలంలోని ఎస్‌ఎం పురం పెద్దచెరువలో జిల్లా పరిషత్తులో ముఖ్యనేత కుమారుడు, స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో చేపట్టిన మట్టిపనుల్లో కనీసం నాణ్యత లేదని ఆరోపణలు ఉన్నాయి. కుప్పిలి, ముద్దాడ గ్రామాల్లోనూ అదే పరిస్థితి. రణస్థలం మండలంలో టీyీ పీ నాయకులు చేసిన పనుల్లో కనీసం నాణ్యత ప్రమాణాలు పాటించలేదు.
నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలంలో అవసరం లేనిచోట నీరు–చెట్టు పనులు చేశారు. రూ.7.40 కోట్లతో తలపెట్టిన 95 పనులు టీడీపీ నాయకులకు, కార్యకర్తలకే కేటాయించారు. మిగతా మూడు మండలాల్లోనూ తూతూమంత్రంగానే పనులు చేసి, బిల్లుల కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
కరువు మండలమైన భామినిలో రూ.4.94 కోట్లతో 61 పనులు మంజూరయ్యాయి. చాలా చెరువుల్లో తూతూమంత్రంగానే పనులు చేసిన అధికార పార్టీ కార్యకర్తలు బిల్లుల మంజూరు కోసం పరుగులు పెడుతున్నారు. పాలకొండ మండలంలో రూ.7 కోట్లతో 92 పనులు మూడు నెలలు క్రితం చేపట్టినా 25 శాతం మాత్రమే పనులు పూర్తి అయ్యాయి. పనుల్లో నాణ్యతా లోపాలున్నా అధికారుల పర్యవేక్షణ కొరవడింది. పలాస మండలంలో మొత్తం 19 పనులకు రూ. 1.20 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికి 9 మాత్రమే చేపట్టారు. వర్షాలు పడడంతో అసంపూర్తిగా ఉంటుండగానే పూర్తి చేసినట్లు చూపించి బిల్లులు చేయించుకుంటున్నారు. దీనికి నిదర్శనం పలాస మున్సిపాలిటీ 2వ వార్డులోని జయరామచంద్రపురం కుంకుమసాగరం. మందస మండలంలో మఖరజోల సంకుజోడు చెరువు, బాలిగాం కారిచెరువుల పరిస్థితి అంతే.
రాజాం మండలంలో రూ.7 కోట్లతో 135 పనులు కేటాయించారు. వాటిలో చాలాచోట్ల పచ్చతమ్ముళ్లు హడావుడిగా పనులు ముగించేశారు. సంతకవిటి మండలం రామారాయపురం పంచాయతీ చింతలపేట గ్రామంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న అచ్చెమ్మకోనేరు చెరువుకు ఆయకట్టు లేకున్నా జన్మభూమి కమిటీ సభ్యులు రూ. 3.93 లక్షలను తూతూ మంత్రంగా పనులు చేసి ఎగనామం పెట్టారు. వంగర మండలం గీతనాపల్లిలో గణపతిరాజు చెరువు ఆయకట్టు భూములు మడ్డువలస రిజర్వాయర్‌లో మునిగిపోగా ఆ చెరువు పేరుతో రూ.4.80 లక్షలు మంజూరు చేయించడం విశేషం. శివ్వాం మంగళవాని, బాగెంపేట కొండోడు చెరువు ఇలా పదుల సంఖ్యలో ఆయకట్టులేని చెరువులకు నిధులు కాజేసేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. రేగిడి మండలంలో చాలాచోట్ల ఉపయోగం లేకున్నా రూ.9 లక్షలు చొప్పున ఖర్చుచేసి చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తున్నారు.
ఉపాధికి గండి
వలసలను నివారించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ఇన్నాళ్లూ అమలు చేశారు. దీంతో ప్రతి గ్రామంలో ఏటా చెరువు పనులు చేయడం వల్ల స్థానిక వేతనదారులకు ఉపాధి లభించేంది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ‘నీరు–చెట్టు’ పథకం ద్వారా లక్ష్యానికి గండిపడనుంది. ఈ పథకం కింద మట్టిపని చేపట్టిన ఏ చెరువులోనైనా తదుపరి ఐదేళ్ల వరకూ ఉపాధి పథకం కింద పనులు చేపట్టడానికి వీల్లేదు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కో చెరువును పంచేసుకొని ‘నీరు–చెట్టు’ పథకం కింద పనులు చేసేస్తున్నారు. తమ స్వలాభం కోసం తూతూమంత్రంగా పనులు చేస్తున్నారు. దీనివల్ల ఇటు చెరువులు బాగుపడక రైతులు... భవిష్యత్తులో ఆ చెరువుల్లో ఉపాధి పనులు లేక వేతనదారులు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మళ్లీ జిల్లా నుంచి వలసలు మొదలయ్యాయి.
నిద్రపోతున్న నిఘా
నీరు–చెట్టు పనులను జలవనరుల శాఖతో పాటు డ్వామా, విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాగే మండలస్థాయిలో రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు కూడా చేయవచ్చు. ఇంతమంది పర్యవేక్షణ ఉన్నా టీడీపీ కార్యకర్తలు, నాయకులు మాత్రం తమకు నచ్చినట్లు పనులు చేసుకుపోతున్నారు. దీనికి కారణం స్థానిక ప్రజలకు ‘నీరు–చెట్టు’ పథకం నిబంధనలపై అవగాహన లేకపోవడం ఒక కారణమైతే... ఇవి తెలిసిన అధికారులు అధికార పార్టీ నాయకులకు తలొగ్గడం ప్రధాన కారణం.
Advertisement