మాట్లాడుతున్న మంత్రి
-
ప్రభుత్వ కార్యాలయాలు మోడల్‌గా ఉండాలి
-
వారం రోజుల్లో లక్ష్యాలు పూర్తి చేయాలి
-
హరితహారం సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం జెడ్పీసెంటర్ : ప్రభుత్వ కార్యాలయాలన్నీ పచ్చని తోరణాలతో స్వాగతం పలకాలని, ఎటు చూసినా పచ్చని మొక్కలతో కళకళలాడుతూ మోడల్‌గా నిలవాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం టీటీడీసీ భవన్‌లో హరితహారంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న వారం రోజుల్లో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ రోడ్ల వెంట ట్రెంచ్ వేసి క్రమపద్ధతిలో మొక్కలు నాటాలని పేర్కొన్నారు. భవిష్యత్‌లో చెట్లను తొలగించే అవకాశం రాకుండా చూడాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో అన్ని సంస్థల్లో మొక్కలు నాటించాలని జేసీకి సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏ ద్వారా నియోజకవర్గానికి రెండు నర్సరీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మండల స్థాయిలో ప్రజలు అధిక సంఖ్యలో హరితహారంలో పాల్గొనేందుకు ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లకు జిల్లా కలెక్టర్ ద్వారా లేఖలు పంపాలన్నారు. మిషన్ కాకతీయ ద్వారా అబివృద్ధి చేసిన చెరువుగట్లపై ఈత, తాటి చెట్లను విరివిగా నాటాలని, మొక్కలు అందుబాటులో లేనిపక్షంలో విత్తనాలు నాటించాలని సూచించారు. ఎమ్మెల్యే అజయ్‌కుమార్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ రహదారుల పక్కన మొక్కలు నాటేందుకు అటవీశాఖాధికారులు చొరవచూపాలన్నారు. కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి రోజు 15 లక్షల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 25, 26 తేదీల్లో నాటిన మొక్కలను అధికారుల బృందం పరిశీలించనున్నట్లు చెప్పారు. కొబ్బరి, మామిడి మొక్కలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సోమవారం నాటికి ధరను నిర్ణయించే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఇల్లెందు ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, జేసీ దివ్య, అటవీశాఖాధికారి నర్సయ్య, డీసీసీబీ చైర్మన్ విజయబాబు, సీఈఓ నాగేశ్ పాల్గొన్నారు.