చట్టాల రూపకల్పనలోనూ, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ ప్రభుత్వాలకు సహేతుకత ప్రాతిపదిక కావాలి తప్ప భావోద్వేగాలు కాదు. జువెనైల్ జస్టిస్ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం తీసుకున్న నిర్ణయంలో భావోద్వేగాలదే పైచేయి అయినట్టు కనబడుతోంది. ఈ సవరణల ప్రకారం హేయమైన నేరాలకు పాల్పడిన 16-18 ఏళ్లలోపు పిల్లలను ఇకపై జువెనైల్ చట్టం కింద కాకుండా భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) నిబంధనల ప్రకారం విచారించి శిక్షిస్తారు. అయితే నిందితులు పాల్పడిన నేరం స్వభావం ఎలాంటిదో సమీక్షించి, ఏ చట్టంకింద విచారించాలో తేల్చే అధికారాన్ని జువెనైల్ బోర్డులకు అప్పగించారు. ఆ బోర్డులు సామాజిక శాస్త్రవేత్తలు, మనస్తత్వ నిపుణుల సాయంతో తుది నిర్ణయానికొస్తాయి. చూడటానికిది సమతౌల్య నిర్ణయంలా కనిపిస్తున్నా ఆచరణలో ఎదురుకాగల సమస్యలను ప్రభుత్వం సరిగా పరిగణనలోకి తీసుకోలేదనిపిస్తుంది.
దేశ రాజధాని నగరంలో రెండున్నరేళ్లక్రితం నిర్భయ ఉదంతం చోటు చేసుకున్నాక... హేయమైన నేరాలకు పాల్పడే చిన్న వయసువారిని కూడా సాధారణ నిందితులుగా పరిగణించి శిక్షించాలన్న డిమాండ్ బలంగా ముందుకొచ్చింది. ఆమెపై అత్యంత అమానుషంగా దాడిచేసిన నిందితుల్లో నలుగురికి ఉరిశిక్ష పడగా, అయిదో నిందితుణ్ణి బాలుడిగా పరిగణించి జువెనైల్ బోర్డు మూడేళ్ల శిక్ష విధించింది. అత్యంత క్రూరంగా ప్రవర్తించిన నేరస్తుడు కేవలం బాలుడన్న పేరుతో తక్కువ శిక్షతో సరిపెట్టడమేమిటని పలువురు ఆగ్రహోదగ్రులయ్యారు. అతన్ని కూడా ఉరికంబం ఎక్కించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైతే చట్టాన్ని మార్చాలన్నారు. ఇలాంటి డిమాండ్లు రావడంలో వింతేమీ లేదు. నేర తీవ్రత ఎక్కువగా ఉన్నదనిపించినప్పుడు సమాజం ఎంతో క్షోభపడుతుంది. తీవ్రంగానే స్పందిస్తుంది. నేరస్తులను బహిరంగంగా ఉరితీయాలని, కాల్చిచంపాలని అధిక సంఖ్యాకులు కోరుతారు.
ఇలా చేస్తే నేరం చేయదల్చుకున్నవారిలో భయం నెలకొంటుందని, నేరాలు తగ్గుముఖంపట్టి సమాజం ప్రశాంతంగా మనగలుగు తుందని వారి భావన. ప్రభుత్వాలు ఇలాంటి డిమాండ్ల విషయంలో పరిణతితో ఆలోచించాలి. అన్ని కోణాలనుంచీ పరిశీలించాలి. గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా జువెనైల్ చట్టానికి సవరణ తీసుకురావాలని సంకల్పించింది. వయో పరిమితిని 18 ఏళ్ల నుంచి 16కు తగ్గించాలని అప్పట్లో స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ప్రస్తుతం ఆ శాఖను చూస్తున్న మేనకాగాంధీ దాన్ని మరికాస్త ముందుకు తీసుకెళ్లారు. బిల్లు రూపకల్పనలో చురుగ్గా వ్యవహరించారు. బిల్లులోని నిబంధనలను పార్లమెంటరీ స్థాయీ సంఘం గత ఫిబ్రవరిలో తిరస్కరించింది. నేర తీవ్రతనుబట్టి నిందితుడు మైనరా, పెద్దవాడా అని నిర్ణయించడం రాజ్యాంగంలోని 14, 15(3) అధికరణలకు విరుద్ధమని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఉన్న జువెనైల్ వ్యవస్థ నేరస్తులను సంస్కరించేదిగా, వారికి పునరావాసం కల్పించేదిగా ఉన్నదని తేల్చింది. ‘చట్టవిరుద్ధంగా వ్యవహరించే పిల్లలనుద్దేశించి’ ఈ చట్టం చేశామనడాన్నే కమిటీ తప్పుబట్టింది. చట్టప్రకారం పద్దెనిమిదేళ్లు దాటనివారిని బాలలుగా పరిగణించినప్పుడు నేరాన్నిబట్టి వారిలో కొందరిని వేరేగా చూడటం రాజ్యాంగ విరుద్ధమవుతుందని తేల్చింది. అయితే, జువెనైల్ చట్ట సవరణల విషయంలో స్థాయీ సంఘం వ్యక్తంచేసిన అభిప్రాయాలను కేంద్ర కేబినెట్ పరిగణనలోకి తీసుకోలేదు.
ప్రతిపాదిత సవరణల ఉద్దేశం చిన్న వయసు పిల్లలు చేసే హత్యలను, ప్రత్యేకించి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడమేనని తెలుస్తూనే ఉంది. లైంగిక నేరాలకు పాల్పడేవారిలో సగంమంది పదహారేళ్ల లోపు పిల్లలేనని... తమకు కఠినశిక్ష వేసే అవకాశం లేదని తెలిసే వారు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పడంవల్ల ఈ బిల్లు కోసం వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని పనిచేశానని గతంలో మేనకాగాంధీ తెలిపారు. అయితే, జాతీయ క్రైం రికార్డుల బ్యూరో వెల్లడించిన గణాంకాల ప్రకారం లైంగిక నేరాలకు పాల్పడే పిల్లల సంఖ్య పెరగడం మాట వాస్తవమే అయినా మొత్తం అత్యాచారాల్లో వారి శాతం 6 కు మించడం లేదు. ఉదాహరణకు 2008లో 21,647 అత్యాచారాలు జరిగితే అందులో 776 ఉదంతాలు బాలనేరస్తులు చేసినవి. 2013కు వచ్చేసరికి మొత్తం అత్యాచారాలు 33,707 ఉంటే అందులో బాలనేరస్తుల వాటా 1,884. అయితే ఈ లెక్కల్లో కూడా మతలబు ఉన్నదని సామాజిక ఉద్యమకారుల వాదన. టీనేజ్ దాటని అబ్బాయి, అమ్మాయి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిన సందర్భాల్లో వారిని విడదీయడం కోసం అమ్మాయి తల్లిదండ్రులు బాలుడిపై అత్యాచారం కేసు పెడుతున్నారని వారు సోదాహరణంగా వివరిస్తున్నారు. కఠిన శిక్షలుంటాయన్న భయంవల్ల నేరాలు ఆగుతాయనడానికి కూడా శాస్త్రీయ నిర్ధారణలేమీ లేవు. మరణశిక్షను రద్దుచేసిన దేశాల్లో నేరాలు పెరిగిన దాఖలాలు లేవు. బహిరంగ ఉరి, కాల్చిచంపడంవంటి శిక్షలున్న దేశాల్లో తీవ్రమైన నేరాలు తగ్గుముఖం పట్టిన జాడ కూడా లేదు. మన దేశంలో నిజానికి జువెనైల్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. జువెనైల్ హోమ్‌లు బాలనేరస్తులను సంస్కరించేవిగా కాక వారిని నేరస్తులుగా మరింత రాటుదేల్చడానికి ఉపయోగపడుతున్నాయి.
దీనికి బదులు జువెనైల్ హోమ్‌లకు అనుబంధంగా పాఠశాలలు నెలకొల్పి నిపుణుల సాయంతో అందులోనివారిని సంస్కరించాల్సిన అవసరం ఉంది. మెదడులో స్థిర నిర్ణయం తీసుకోవడానికి దోహదపడే ఒక అమరిక 18 ఏళ్ల వయసు వరకూ పూర్తి రూపం సంతరించుకోదని వైద్యపరంగా నిర్ధారణ అయిన అంశం. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడానికి బదులు సమస్యను జువెనైల్ వ్యవస్థ నుంచి ఐపీసీకి బదిలీ చేయడం న్యాయం కాదు. కనీసం బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడైనా లోతైన చర్చ జరిగి మెరుగైన నిర్ణయం తీసుకోవాలని ఆశిద్దాం.
‘జువెనైల్’ నిర్ణయం!
Published Fri, Apr 24 2015 11:21 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement