29వ రాష్ట్రంగా తెలంగాణ | Telangana is India's 29th state | Sakshi
Sakshi News home page

29వ రాష్ట్రంగా తెలంగాణ

Published Thu, Jun 5 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

29వ రాష్ట్రంగా తెలంగాణ

29వ రాష్ట్రంగా తెలంగాణ

జాతీయం
పద్మనాభ ఆలయ సంపద లెక్కింపు

కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని శ్రీపద్మనాభ స్వామి ఆలయ సంపద లెక్కింపును మే 28న ప్రారంభించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మాజీ కాగ్ వినోద్ రాయ్ నేతృత్వంలో నియమితులైన ప్రత్యేక బృందం లెక్కింపు పూర్తయ్యాక నివేదికను సుప్రీంకోర్టుకు అందిస్తారు.

ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డీఓ) ఒకేసారి మూడు ఆకాశ్ క్షిపణులను ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి మే 28న విజయవంతంగా పరీక్షించింది. ఇది అణు సామర్థ్యం గల ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే సూపర్ సోనిక్ క్షిపణి. సరిహద్దుల్లో తక్కువ ఎత్తులో ప్రయాణించే పెలైట్ రహిత శత్రు విమానాలను ఛేదించేందుకు డిఆర్‌డీఓ ఆకాశ్ క్షిపణిని అభివృద్ధి చేసింది. ఇది కేవలం ఐదు సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకోగలదు.

ఎన్‌ఎండీసీకి డీఅండ్ బీ అవార్డు
మైనింగ్ విభాగంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ ప్రతిష్టాత్మకమైన డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ -మణప్పురం 2014 అవార్డును కైవసం చేసుకొంది.

విజయవంతంగా పినాక పరీక్ష
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పినాక రాకెట్లను భారత్ మే 29న ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ప్రూఫ్ అండ్ ఎక్స్ పెరిమెంటల్ ఎస్టాబ్లిష్ మెంట్ వేదికగా మూడుసార్లు విజయవంతంగా ప్రయోగించింది. బహుళ బ్యారెల్ ప్రయోగ వ్యవస్థ ద్వారా ఈ పరీక్ష జరిగింది. పినాక రాకెట్లలో ఎలాంటి దిశా నిర్దేశం ఉండదు. ఆరు లాంచర్లతో కూడిన ఒక విభాగం ద్వారా 12 రాకెట్లను 44 సెకన్లలో ప్రయోగించవచ్చు. 3.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రదేశంలో ఉన్న శత్రువులను నాశనం చేయగలదు.

 ఉత్తమ ఎయిర్‌పోర్ట్‌గా ఆర్‌జీఐఏ
హైదరాబాద్, శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్‌జీఐఏ) ద్వితీయ ఉత్తమ ఎయిర్‌పోర్ట్ అవార్డ్ కైవసం చేసుకొంది. ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ (ఏసీఐ)-2014 సంవత్సరానికిగాను ఈ అవార్డు ప్రదానం చేసింది. మే 28న దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన కార్యక్రమంలో  ఈ పురస్కారాన్ని అందజేశారు.

నల్లధనం వెలికితీతకు ప్రత్యేక దర్యాప్తు బృందం
విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి, స్వదేశానికి తెచ్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మే 27న ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 29 లోపు సిట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు నిర్దేశాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బృందానికి చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి.షా, వైస్ చైర్మన్‌గా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరిజిత్ పసాయత్ వ్యవహరిస్తారు. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి, సీబీఐ, ఇంటెలిజన్స్ బ్యూరో, ఎన్ ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డెరైక్టర్‌తో పాటు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ చైర్మన్, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తారు.

తొలి పొగాకు రహిత గ్రామం గరిపెమ
దేశంలో తొలి పొగాకు రహిత గ్రామంగా నాగాలాండ్‌లోని గరిపెమా అనే పల్లె రికార్డులకెక్కింది. మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గరిపెమను పొగాకు రహిత గ్రామంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఊరిలో మద్యం, పొగాకు ఉత్పత్తుల విక్రయం, వినియోగం నిషేధిస్తూ గ్రామస్థులు నిర్ణయం తీసుకున్నారు.

ఫోర్బ్స్ శక్తివంత మహిళల జాబితా
ప్రపంచంలోని అత్యంత శక్తివంతులైన 100 మంది మహిళల జాబితాలో ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ చందా కొచర్‌లకు స్థానం లభించింది. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో ఉన్న ఈ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలకు చోటుదక్కింది. భట్టాచార్యకు 36వ ర్యాంకు, కొచర్‌కు 43వ ర్యాంకు లభించాయి. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్‌షా 92వ స్థానంలో నిలిచారు. పెప్సీకో చీఫ్ ఇంద్రా నూయి 13వ స్థానంలో, సిస్కో చీఫ్ టెక్నాలజీ, స్ట్రాటజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్ 71వ స్థానంలో ఉన్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జానెట్ ఎల్లెన్ (రెండో స్థానం), మానవతావాది మెలిండా గేట్స్ (3), హిల్లరీ క్లింటన్ (6), జనరల్ మోటార్స్ తొలి మహిళా సీఈఓ మేరీ బారా (7), అమెరికా తొలి మహిళ మిషెల్ ఒబామా, ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ శాండ్‌బెర్గ్(9) తొలి పది స్థానాలో ఉన్నారు.

రాష్ట్రీయం
29వ రాష్ట్రంగా తెలంగాణ

2014 జూన్ 2న దేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అదే రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ నరసింహన్ కేసీఆర్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. అలాగే ఆయనతోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.


తెలంగాణ తొలి ఉన్నతాధికార్లు:
    {పభుత్వ ప్రధాన కార్యదర్శి: రాజీవ్‌శర్మ
    డీజీపీ: అనురాగ్‌శర్మ

తెలంగాణ భౌగోళిక స్వరూపం:
    విస్తీర్ణం: 1.14 లక్షల చదరపు కిలోమీటర్లు
    జనాభా: 3.50 కోట్లు (సుమారుగా)
    జిల్లాలు: 10, మండలాలు: 459

గ్రామాలు: 8,400
    లోక్‌సభ స్థానాలు: 17
    రాజ్యసభ స్థానాలు: 7
    అసెంబ్లీ స్థానాలు: 119
    జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలు (జెడ్పీటీసీ): 443
    మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ): 6,525

ఆంధ్ర, తెలంగాణలకు ఉమ్మడి హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటిదాకా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న పేరును హైకోర్టు ఆఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్‌గా మార్చినట్లు హైకోర్టు రిజిస్ట్రార్ మే 30న ప్రకటించారు. జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా పరిగణిస్తారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా సూచన మేరకు హైకోర్టు ఆఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు.

పోలవరం ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం
పోలవరం ప్రాజెక్ట్ వల్ల ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి మే 29న ఆమోదించారు. ఇందుకు సంబంధించి గత యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌కు ఎన్‌డీఏ ప్రభుత్వం ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలవనున్నాయి. ఈ ఏడు మండలాల్లో 211 గ్రామాలు ఉన్నాయి. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలకు సహాయ, పునరావాస కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టడానికి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించాలని కేంద్రం నిర్ణయించింది. పోలవరంగా పిలిచే ఇందిరాసాగర్ ప్రాజెక్ట్‌ను బహుళ ప్రయోజనార్థం గోదావరి నదిపై పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం వద్ద నిర్మిస్తున్నారు. 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు , 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి దీని లక్ష్యం. విశాఖపట్నం, ఇతర కొన్ని ప్రాంతాలకు 25 టీఎంసీల తాగునీటి సౌకర్యం కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల కలుగుతుంది. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానంతో 80 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా డెల్టాకు కల్పిస్తారు.

క్రీడలు
ఐపీఎల్ విజేత కోల్‌కత నైట్‌ైరె డర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-7  క్రికెట్ టోర్నమెంట్ విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిలిచింది. జూన్ 1న బెంగళూరలో జరిగిన ఫైనల్లో కింగ్‌‌స ఎలెవన్ పంజాబ్‌ను ఓడించి రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది (2012లో జరిగిన ఐపీఎల్-5 టైటిల్‌నూ కోల్‌కతా గెలుపొందింది). తద్వారా రూ. 15 కోట్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన పంజాబ్‌కు రూ.10 కోట్లు లభించింది. ఐపీఎల్-7 విశేషాలు మ్యాన్ ఆఫ్ ద ఫైనల్: మనీష్ పాండే (కోల్‌కత); అత్యంత విలువైన ఆటగాడు: మాక్స్‌వెల్ (పంజాబ్); ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు): ఉతప్ప (కోల్‌కత); పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు): మోహిత్‌శర్మ (చెన్నై); ఎమర్జింగ్ క్రికెటర్: అక్షర్ పటేల్ (పంజాబ్); ఫెయిర్ ప్లే అవార్డు: చెన్నైసూపర్ కింగ్స్.

సియట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా కోహ్లి
2014 సంవత్సరానికి సియట్ క్రికెట్ అవార్డులను జూన్ 2న ముంబైలో ప్రదానం చేశారు. వివరాలు... క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: విరాట్ కోహ్లి (2010-11లోనూ ఈ అవార్డును కోహ్లియే అందుకున్నాడు); వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్: శిఖర్ ధావన్ (భారత్); ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్: రవి చంద్రన్ అశ్విన్; ఉత్తమ అంతర్జాతీయ టెస్ట్ క్రికెటర్: మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా); టి20 క్రికెటర్: షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్). పాపులర్ వాయిస్ అవార్డు: గ్లెన్ మ్యాక్స్ వెల్ (ఆస్ట్రేలియా); యంగ్ ప్లేయర్ అవార్డు: విజయ్‌జోల్ (మహారాష్ట్ర); లైఫ్ టైం అఛీవ్‌మెంట్ అవార్డు: సయ్యద్ కిర్మానీ (భారత్).


వార్తల్లో వ్యక్తులు
భారత నూతన అటార్నీ
జనరల్‌గా ముకుల్ రోహత్గి
భారత నూతన అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిని కేంద్ర ప్రభుత్వం మే 28న ఎంపిక చేసింది. 14వ అటార్నీ జనరల్‌గా నియమించిన రోహత్గి ప్రస్తుత అటార్నీ జనరల్ జి.ఇ. వాహనవతి స్థానంలో బాధ్యతలు చేపడతారు.

సొలిసిటర్ జనరల్‌గా రంజిత్‌కుమార్
భారత సొలిసిటర్ జనరల్‌గా మోహన్ పరాశరన్ స్థానంలో సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్‌ను నియమించాలని కేంద్రం మే 28న నిర్ణయించింది.

తెలంగాణ గవర్నర్‌గా
నరసింహన్‌కు అదనపు బాధ్యతలు
తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇకనుంచి నరసింహన్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తారు. ై ఈ మేరకు తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్ జూన్ 2న బాధ్యతలు స్వీకరించారు.

జాతీయ భద్రతా
సలహాదారుగా అజిత్‌దోవల్
కేంద్ర ఇంటెలిజన్స్ బ్యూరో మాజీ అధిపతి అజిత్‌దోవల్ (69) శివశంకర్‌మీనన్ స్థానంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) గా మే 30న నియమితులయ్యారు.

స్పెల్ బీ విజేతలు.. శ్రీరామ్, సుజోయ్
ప్రతిష్టాత్మక స్పెల్ బీ చాంపియన్‌షిప్‌లో మరోసారి భారత సంతతి విద్యార్థులు సత్తా చాటారు. స్క్రిప్స్ నేషనల్ స్పెల్ బీ కాంటెస్ట్‌లో న్యూయార్క్‌కు చెందిన శ్రీరామ్ హత్వర్ (14), టెక్సాస్‌కు చెందిన అన్‌సన్ సుజోయ్ (13) సంయుక్త విజేతలుగా నిలిచి చరిత్ర సృష్టించారు. స్పెల్ బీ పోటీల చరిత్రలో ఇలా ఇద్దరు సంయుక్త విజేతలుగా నిలవడం ఇది నాలుగోసారి మాత్రమే. 1962లో చివరిసారిగా ఇద్దరు సంయుక్త విజేతలుగా నిలిస్తే.. మళ్లీ 52 ఏళ్ల తర్వాత ఇప్పుడు శ్రీరామ్, సుజోయ్ ఆ ఘనత సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement