వలసల వాయిదా ..! | What Is Job Progression? | Sakshi
Sakshi News home page

వలసల వాయిదా ..!

Published Sun, Jan 8 2017 4:25 AM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

వలసల వాయిదా ..!

వలసల వాయిదా ..!

కెరీర్‌ గమనంలో.. ఉన్నత శిఖరాలను వేగంగా అధిరోహించాలనే ఆతృత.. ఆ క్రమంలోనే ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడం, పదోన్నతులు పొందడం.. ఆపై మరో కంపెనీ మెట్లెక్కడం.. కార్పొరేట్‌ ప్రపంచంలో ముఖ్యంగా ఐటీ కంపెనీల్లోని కుర్రకారుతీరు ఇలానే ఉంటుంది! ఒకే కంపెనీకి ఏళ్ల తరబడి అతుక్కొని ఉండటం అనేది నేటి జనరేషన్‌ ఉద్యోగులకు అస్సలు నచ్చని ముచ్చట.  అయితే దేశంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం, అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక, రాజకీయ పరిణామాలు కొత్త సంవత్సరంలో కొత్త  కంపెనీలో చేరాలనుకునే వారికి శరాఘాతంగా మారాయి. వేరే కంపెనీల నుంచి ఆఫర్లు వస్తున్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ‘కాలు నిలవని కుర్రకారు’.. ప్రస్తుతం కొత్త కంపెనీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో చూద్దాం..

కంపెనీ మారడమా.. ఇప్పుడొద్దు బాసూ! అంటున్న యువ ఉద్యోగులు

నిన్న
‘‘ఫలానా కంపెనీ నుంచి మంచి ఆఫర్‌ వచ్చింది. ప్రస్తుత ఉద్యోగం కంటే రెట్టింపు శాలరీ.. ఎక్స్‌ట్రా బెనిఫిట్స్‌. అందుకే కంపెనీ మారుతున్నాను.’’ ‘‘ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో చేరి అయిదేళ్లు అయింది. కెరీర్‌ మొనాటనీగా మారింది. వేరే కంపెనీకి మారడం బెటర్‌ అనిపిస్తోంది. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను’’ – ఇప్పటి వరకు యువ ఉద్యోగుల నుంచి ఇలాంటి మాటలే వినిపించేవి!

నేడు
‘‘ఫలానా కంపెనీ నుంచి మంచి ఆఫర్‌ వచ్చింది. ప్రస్తుత ఉద్యోగం కంటే రెట్టింపు శాలరీ.. ఎక్స్‌ట్రా బెనిఫిట్స్‌. అందుకే కంపెనీ మారుతున్నాను.’’ ‘‘ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో చేరి అయిదేళ్లు అయింది. కెరీర్‌ మొనాటనీగా మారింది. వేరే కంపెనీకి మారడం బెటర్‌ అనిపిస్తోంది. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను’’ – ఇప్పటి వరకు యువ ఉద్యోగుల నుంచి ఇలాంటి మాటలే వినిపించేవి!

కంపెనీల్లో వలసలు గత అయిదేళ్లలో తొలిసారిగా భారీగా తగ్గనున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఏయాన్‌ హ్యుయట్‌ ఇండియా గణాంకాల ప్రకారం గతేడాది 16 శాతంగా నమోదైన అట్రిషన్‌ రేటు ఈ సంవత్సరం ఇంకా తగ్గనుంది. స్టాఫింగ్‌ అండ్‌ రిక్రూటింగ్‌ సంస్థ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంస్థ గణాంకాల ప్రకారం గతేడాది అట్రిషన్‌ రేటు 16.3 శాతం కాగా, ఈ ఏడాది ఇంకా భారీగా తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితి రావడం ఐదేళ్ల తర్వాత ఇదే తొలిసారి.

కాస్త ఆగుదాం..
కంపెనీలు మారాలనుకునే ఉద్యోగులు సోషల్‌ నెట్‌వర్క్, ఆయా సంస్థల్లో అప్పటికే పనిచేస్తున్న వారి ద్వారా రిఫరల్స్, జాబ్‌ సెర్చ్‌ ఇంజన్స్‌ ద్వారా ప్రయత్నాలు చేస్తారు. కానీ, ప్రస్తుతం ఈ మూడు మార్గాల్లోనూ జాబ్‌ చేంజ్‌ ఔత్సాహికుల సంఖ్య గతేడాదితో పోల్చితే తగ్గింది. మరోవైపు ఆయా సంస్థలు ఎంట్రీ లెవెల్‌లో చేపట్టే తాజా నియామకాల సంఖ్యను తగ్గించుకునేలా హైరింగ్‌ ప్లాన్స్‌ను సవరించుకుంటున్నాయి. ఎంట్రీ స్థాయిలోనే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు.. మిడిల్‌ లెవెల్‌లో కొత్త నియామకాల ఊసు కొన్ని నెలల పాటు కష్టమేనని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్‌ ఐటీ సర్వీసెస్‌ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌లోనే గతంతో పోల్చితే తక్కువ ప్యాకేజీలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మిడిల్, సీనియర్‌ లెవెల్‌లో భారీ ప్యాకేజీలతో వలసలను ప్రోత్సహించే పరిస్థితిలో కంపెనీలు లేవు. అంతేకాకుండా కంపెనీల్లో బాగా సీనియర్‌ హోదాల్లో  ఉండి, మరింత మంచి ఉద్యోగం కోసం కంపెనీలు మారే వారు సైతం ‘వెయిట్‌ అండ్‌ సీ’ దృక్పథంతో ఉన్నారు.

వ్యాపారాలపై ప్రభావం
కంపెనీ, ఉద్యోగం మారాలనుకునే వారిపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం చూపుతోంది. పరుగెత్తి పాలు తాగే కంటే.. నిలబడి నీళ్లు తాగడం బెటర్‌ అనే విధంగా ఔత్సాహికులు తమ ఆలోచన శైలిని మార్చుకుంటున్నారు. దాంతో ఈ ఏడాది కంపెనీల్లో ఉద్యోగుల వలసలు తక్కువగా ఉంటాయని నిపుణులు అంచనావేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన కరెన్సీ రద్దు నిర్ణయం అన్ని రంగాలు, అన్ని రకాల వ్యాపారాలపై ప్రభావం చూపింది. దీంతో కంపెనీలు కొత్త నియామకాలు చేపట్టడంపై పునరాలోచనలో పడ్డాయి. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పేర్కొన్న నియామక ప్రణాళికలతో పోల్చితే దాదాపు 30 నుంచి 40 శాతం మేర కొత్త నియామకాలు తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. దాంతో కంపెనీలు మారుదాం అనుకునే ఉద్యోగుల్లో సైతం మార్పు కనిపిస్తోంది.

ఆశాజనకంగాలేని ఆఫర్లు
కంపెనీల్లో ఆర్థిక సంవత్సరం మొదట్లో ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, వేతనాల్లో పెరుగుదల నిర్ణయాలు జరుగుతాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల పనితీరుపై సమీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మారుతున్న పరిణామాలతో భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో కొత్త కంపెనీల కోసం ప్రయత్నించడం అనవసరమని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రస్తుత కంపెనీలోనే కొనసాగి, మంచి పనితీరు కనబరిచి ఇంక్రిమెంట్ల పరంగా బెస్ట్‌ లెవల్స్‌ అందుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

హెచ్‌ఆర్‌ ఆలోచనల్లో మార్పు
సాధారణంగా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారే ఉద్యోగుల్లో..  కనీసం నాలుగైదేళ్ల అనుభవం కలిగిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్స్, మిడిల్‌ లెవెల్‌  మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఎక్కువగా ఉంటారు. ఇలాంటి వారు ఉన్నత హోదాల కోసం కంపెనీ మారడంపై దృష్టిసారిస్తారు. ఇప్పుడు ఈ స్థాయి అనుభవం ఉన్నవారిని చేజార్చుకుంటే అంతే స్థాయి నైపుణ్యాలున్న వారిని అన్వేషించి, నియమించుకోవడం హెచ్‌ఆర్‌ వర్గాలకు కష్టమే. అందుకే మానవ వనరుల విభాగాలు జాబ్‌ చేంజ్‌ ఆలోచనతో ఉన్న ఉద్యోగులపై అంతర్గతంగా ఆరా తీస్తూ.. వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి.

ఐటీ కంపెనీల్లో
ఐటీ.. కెరీర్‌ పరంగా రాకెట్‌లాంటి వేగానికి చిరునామాగా పేర్కొనే రంగం. అందుకే ఇందులో వలసల రేటు ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈసారి మాత్రం ఐటీలోనూ కంపెనీలు మారే రేటు తక్కువగానే నమోదు కానున్నట్లు సమాచారం. గత అక్టోబర్‌లో విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం– కరెన్సీ రద్దు నిర్ణయం కంటే ముందు దేశంలో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలుగా పేరొందిన టీసీఎస్‌లో 12.9 శాతం, విప్రోలో 17.2 శాతం, ఇన్ఫోసిస్‌లో 20 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లో 18.6 శాతం చొప్పున జూలై నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో అట్రిషన్‌ రేటు నమోదైంది. టీసీఎస్‌ ఈ ఏడాది ప్రారంభంలోనే అట్రిషన్‌ రేటు తగ్గింపు దిశగా దృష్టిసారించి, 90 రోజుల నోటీస్‌ పీరియడ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా జాబ్‌ మారాలనుకున్న వారి ఆలోచనలో ఆ సమయంలో మార్పు రావొచ్చనేది అభిప్రాయం. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఇతర కంపెనీలు కూడా ఇలాంటి చర్యలు చేపట్టే అవకాశాలు
కనిపిస్తున్నాయి.

నిలబడదాం..
మొత్తం మీద కరెన్సీ రద్దు ప్రభావంతో ఇటు ఉద్యోగులు, అటు కంపెనీల యాజమాన్యాల ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది రోజులు వేచి చూద్దాం.. అనే ధోరణితో ఉద్యోగులు ఉండగా.. కంపెనీలు ఉన్న ఉద్యోగులను కాపాడుకునేందుకు కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

ఉద్యోగుల వలసల రేటును అట్రిషన్‌ రేటుగా పేర్కొంటారు.

ఇది 2015–16లో 16 నుంచి 17 శాతం మధ్యలో నమోదైంది.

చీఫ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ స్థాయిలో అట్రిషన్‌ రేటు ఎక్కువగా ఉంటుంది.


కంపెనీల పరంగా చూస్తే అట్రిషన్‌ ఐటీ కంపెనీల్లో కొంత ఎక్కువ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement