గిరిరాజ్‌పై ఈసీ కొరడా | ec Giriraj a whip | Sakshi
Sakshi News home page

గిరిరాజ్‌పై ఈసీ కొరడా

Published Mon, Apr 21 2014 2:37 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

గిరిరాజ్‌పై ఈసీ కొరడా - Sakshi

గిరిరాజ్‌పై ఈసీ కొరడా

‘మోడీ-పాక్’ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో  ఎఫ్‌ఐఆర్
ఆయన్ను మందలించిన బీజేపీ అధిష్టానం
అయినా తన వ్యాఖ్యలను సమర్థించుకున్న గిరిరాజ్

 
 /న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వ్యతిరేకించే వారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలంటూ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ బీహార్ నేత, నవాడా లోక్‌సభ అభ్యర్థి గిరిరాజ్‌సింగ్‌పై ఎన్నికల కమిషన్ కొరడా ఝళిపించింది. ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న కాంగ్రెస్, జేడీయూ ఫిర్యాదుతో గిరిరాజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జార్ఖండ్ పోలీసులను ఆదివారం ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయనపై ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటు ప్రజాప్రతినిధ్య చట్టంలోని సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విదేశాలకు గొడ్డు మాంసాన్ని విక్రయించే వారికి సబ్సిడీ ఇచ్చిన కేంద్రం గోవుల పోషకులపై మాత్రం పన్ను విధించిందన్న ఆయన వ్యాఖ్యలనూ ఈసీ తీవ్రంగా పరిగణించడంతో ఈ ఎఫ్‌ఐఆర్‌లో బీహార్ పశు సంరక్షణ చట్టంలోని సెక్షన్లను కూడా పోలీసులు పొందుపరిచారు. మరోవైపు బీజేపీ అధిష్టానం నష్టనివారణ చర్యలు చేపట్టింది. తమ పార్టీ న్యాయం, మానవతా విలువలతో కూడిన రాజకీయాలనే విశ్వసిస్తుందని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొనగా గిరిరాజ్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ వివాదం పెద్దది కాకుండా చూసుకోవాలని గిరిరాజ్‌ను హెచ్చరించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
 
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: గిరిరాజ్

 తన వ్యాఖ్యలపై వివాదం రేగి, పార్టీలో ఒంటరైనప్పటికీ గిరిరాజ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పటికీ ఆ వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని స్పష్టంచేశారు. మోడీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేవారెవరికీ భారత్‌లో చోటులేదని, వారంతా పాకిస్థాన్ వెళ్లాల్సిందేనని ఆదివా రం పాట్నాలో ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవ ర్నైనా వ్యతిరేకించవచ్చు. ఆ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించకూడదు. అలా చేస్తే, మన దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టే’’ అని చెప్పారు. ‘‘చాలామంది పాక్ అనుకూల వ్యక్తులు నిరంతరాయంగా మోడీని వ్యతిరేకిస్తున్నారని ఇప్పటికీ చెబుతున్నాను. ఈ దేశం హృదయపూర్వకంగా భారతీయులకు చెందినదే. కానీ భారత వ్యతిరేకులను పాక్ ఎల్లప్పుడూ స్వాగతిస్తుంది’’ అని గిరిరాజ్ ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement