చంద్రబాబు నాయుడు
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఎన్నికల సభలలో తెగ తడబడుతున్నారు. ఒక మాట మాట్లాడబోయి వ్యతిరేకార్ధం వచ్చే విధంగా మరో మాట మాట్లాడుతున్నారు. వారిద్దరితోపాటు హిందూపురం నుంచి పోటీ చేస్తున్న బాలకృష్ణ, వారికి మద్దతు పలికే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అదేవిధంగా తడబడుతూ మాట్లాడుతున్నారు.
* పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ఎన్నికల ప్రచార సభలో ఈరోజు చంద్రబాబు మాట్లాడుతూ తడబడ్డారు. బిజెపి లోక్సభ అభ్యర్థి గోకరాజు గంగరాజుకు ఓటు వేస్తే నరేంద్ర మోడీ మోడీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఆ తరువాత ఆయన తన మాటను సవరించుకున్నారు.
* అంతకు ముందు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థి విషయంలో కూడా తడబడ్డారు. వేదికపై ఉన్నది బీజేపీ అభ్యర్ధా, టీడీపీ అభ్యర్ధా అనే విషయం కూడా ఆయనకు తెలియలేదు. వీర్రాజుకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాణిక్యాలరావు బిత్తరపోయారు. వెంటనే ఆయన చంద్రబాబుకు విషయం తెలియజెప్పారు.
* ఇదిలా ఉంటే, ఆయన తనయుడు లోకేష్ అయితే మరీ దారణంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఆయన తిరుపతిలో మాట్లాడుతూ 'సైకిల్ గుర్తుకు ఓటేస్తే.. మనకు మనం ఉరేసుకున్నట్లే' అని చెప్పారు. మతపిచ్చి, కులపిచ్చి, అవినీతి, బంధుప్రీతి.. ఇవన్నీ ఉన్న పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీయే అని చెప్పింది గాక, అవునా, కాదా? కూడా కార్యకర్తలను ప్రశ్నించారు. లోకేష్ బాబు మాటలకు తెల్లమొఖాలు వేసుకొని చూడటం వారి వంతైంది.
* బాలకృష్ణ అయితే శ్రీకాకుళంలో మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. అది విన్న కార్యకర్తలు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు.
* పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బహిరంగ సభలో టిడిపి-బిజెపిలకు మద్దతు ఇచ్చే పవన్ కళ్యాణ్ మాట్లడుతూ మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో అవినీతి హెచ్చుమీరందన్నారు.
ఈ విధంగా వీరందరూ ఒకరి తరువాత ఒకరు ఎందుకు తడబడుతున్నారో ఎవరికీ అర్ధం కావడంలేదు. ఈ ఎన్నికలలో గెలవలేం అనే భయం ఏమైనా వారిని వెంటాడుతోందా? అన్న అనుమానం వస్తోంది. లేకపోతే అందరూ ఆ విధంగా తడబటం ఏమిటి? అదీ గాక 'సైకిల్ గుర్తుకు ఓటేస్తే.. మనకు మనం ఉరేసుకున్నట్లే', 'కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్' వంటి మాటలు మాట్లాడటం ఏమిటని అందరూ అనుకుంటున్నారు.