‘సార్వత్రికం’ తర్వాతే మున్సిపల్ ఫలితాలు
* హైకోర్టు ఉత్తర్వుకు సుప్రీంకోర్టు బ్రేక్
* రాష్ర్ట ఎన్నికల సంఘానికి ఆదేశాలు
* ‘ఫలితాలు’ సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని వ్యాఖ్య
* ఈసీ అభ్యంతరాల్లో సహేతుకత లేదన్న ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: మున్సిపల్ ఎన్నికల ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది. సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఈ ప్రక్రియను చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ర్ట ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించింది. ఈ నెల 9న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడించాలన్న రాష్ర్ట హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ జ్ఞానసుధామిశ్రా, జస్టిస్ గోపాలగౌడతో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం విచారించింది.
మున్సిపల్ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని, అందువల్ల ఫలితాల వెల్లడిని వాయిదా వేయాలన్న పిటిషనర్ వి.వెంకటేశ్వరరావు ఇప్పటికే వాదన వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై తన అభ్యంతరాలను తెలియజేస్తూ రాష్ర్ట ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా దాదాపు 20 నిమిషాల పాటు వాదనలు జరిగాయి. తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాదులు కె.రామకృష్ణారెడ్డి, ఎం.ఎన్.రావులు తమ వాదనలు వినిపించారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను సార్వత్రిక ఎన్నికల తర్వాతే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశాలిచ్చిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలకూ అవే ఆదేశాలను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మనోజ్ సక్సేనా అభ్యంతరం తెలిపారు. ఫలితాలను ఏప్రిల్ 9నే విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఇందుకు న్యాయమూర్తి జ్ఞానసుధామిశ్రా స్పందిస్తూ.. ‘పంచాయతీ(ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికలకు ఒకరకంగా ఇప్పుడొక రకంగా ఎలా మాట్లాడతారు?’ అని ప్రశ్నించారు.
‘ఈ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయి కదా?’ అని జస్టిస్ గోపాలగౌడ సైతం ప్రశ్నించారు. అయితే ఈ ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపబోవని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. జస్టిస్ జ్ఞానసుధామిశ్రా జోక్యం చేసుకుంటూ ‘పరిషత్ ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికల తర్వాతే ప్రకటించాలని ఆదేశించినప్పుడు మీరు సరే అన్నారు. ఇప్పుడు వద్దంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. జస్టిస్ గోపాలగౌడ కూడా స్పందిస్తూ.. ‘ఫ్రీ అండ్ ఫెయిర్ విధానంలో ఎన్నికలు జరపాలని రాజ్యాంగం సూచిస్తోంది. గతంలో అనేక కేసుల్లో కూడా తీర్పులున్నాయి’ అని పేర్కొన్నారు.
ఈసీ వైఖరిపై అసంతృప్తి
ఈసీ తరఫు న్యాయవాది తిరిగి తన వాదనలు వినిపిస్తూ ‘ఈవీఎంలను మేం 30 రోజులకంటే ఎక్కువ కాలం భద్రపరచలేం.దాదాపు 10 వేల ఈవీఎంలను భద్రపరచడం తేలికైన పనికాదు. పైగా మేం వాటిని ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నాం. వాటిని తిరిగి ఇవ్వాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. దీనికి జస్టిస్ గోపాలగౌడ స్పందిస్తూ.. ‘ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం ఏముంది.. మీ వాదనలు మీ అభ్యంతరాలను బలపరిచేవిగా లేవు. ఈ ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై తప్పనిసరిగా ప్రభావం చూపుతాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు ప్రభావం చూపినప్పుడు.. ఇవెందుకు ప్రభావం చూపవు? ఎన్నికల సంఘం వైఖరి చూస్తుంటే ఏదో తప్పు కనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.
ఇంతలో జస్టిస్ జ్ఞానసుధామిశ్రా ఈ కేసును శుక్రవారం వింటామని, అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించబోయారు. ఈలోగా పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని ఇప్పటికే అఫిడవిట్‌ను ఈసీ దాఖలు చేసిందని తెలిపారు. ధర్మాసనం ఆదేశం మేరకు ఈసీ తరఫు న్యాయవాది దానిని చదివారు. ‘మేం ఈవీఎంలను భద్రపరచలేం. పరిషత్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో నిర్వహించినందున వాటిని భద్రపరచడంలో పెద్ద సమస్య ఉండదు. కానీ మున్సిపల్ ఎన్నికలకు ఈవీఎంలను వాడాం. వాటిని భద్రపరచడం తేలిక కాదు. షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరిగే అవకాశముంది’ అని చెప్పారు. జస్టిస్ గోపాలగౌడ జోక్యం చేసుకుని ‘మీరు చాలా ఊహించుకుంటున్నారు..’ అని వ్యాఖ్యానించారు.
జస్టిస్ జ్ఞానసుధామిశ్రా జోక్యం చేసుకుని ‘ఇంకా నయం.. మీరు భూకంపాలు కూడా వస్తాయేమోనని అనుమానాలు వ్యక్తం చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎంలు భద్రపరిచేందుకు స్థలమే లేదని కూడా చెప్పేట్టున్నారు! పరిషత్ ఎన్నికల్లో మీరు ఫలితాల వాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు ఇలా చెబుతున్నారు. ఆనాడు అభ్యంతరం చెప్పి ఉంటే ఫలితాలు విడుదల చేయమని ఆదేశించి ఉండేవాళ్లం’ అని వ్యాఖ్యానించారు. వాదనలు పూర్తయ్యాక ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.
‘రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల వాయిదాపై అభ్యంతరం చెప్పలేదు. కానీ ఈ కేసులో అభ్యంతరం వ్యక్తంచేసింది. అయితే సహేతుక కారణాలు చూపలేకపోయింది. సార్వత్రిక ఎన్నికలపై మున్సిపల్ ఫలితాలు ప్రభావం చూపుతాయన్న పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తూ.. మున్సిపల్ ఫలితాలను సార్వత్రిక ఎన్నికల అనంతరం విడుదల చేయాల్సిందిగా ఆదేశించడమైంది’ అని తీర్పునిచ్చింది. దీంతో మే 7న తుది దశ పోలింగ్ ముగిసిన తర్వాతే పరిషత్‌లతో పాటు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.