‘నోటా’కు ఓటేస్తాం.. మా సత్తా చూపుతాం!
కోల్‌కతా: ప్రస్తుత ఎన్నికల్లో నోటా (నాన్ ఆఫ్ ది అబౌ)’ ఆప్షన్ కు ప్రజాదరణ పెరుగుతుందనడానికి ఇదో చక్కటి ఉదాహరణ. ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అకస్మాత్తుగా తమ గుడిసెలను కూల్చేసి తమను వీధుల పాలు చేసినందుకు ఇక్కడి తొప్సియా ప్రాంతంలోని మురికి వాడల ప్రజలు ఈ ఎన్నికల్లో నోటాతో నిరసన తెలపాలనుకుంటున్నారు. ప్రత్యామ్నాయ పునరావాసం చూపించకుండా ఇలా వ్యవహరించినందుకు వారు మండిపడుతున్నారు. 2012 నవంబర్‌లోనే వారిని అక్కడినుంచి పంపించేసినా.. ఆ పాత అడ్రస్‌తోనే వారికి ఎన్నికల గుర్తింపు కార్డులున్నాయి. తొప్సియా మురికివాడలో దాదాపు 380కు పైగా కుటుంబాలున్నా దాదాపు వారంతా రిక్షా కార్మికులుగా, రోజువారీ కూలీలుగా, రోడ్లపై చెత్త ఏరుకునేవారిగా బతికేవారే. వారి ఇళ్లను కూల్చేసే సమయంలో వారిలో కొందరికి రూ. 12 వేలు, మరికొందరికి రూ. 10 వేలు పరిహారంగా ఇచ్చి అక్కడి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది.
చాలామందికి ఆ కొద్ది మొత్తం పరిహారం కూడా అందలేదు. అప్పటినుంచి వారంతా రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్నారు. వారి పిల్లలు చదువుకు దూరమయ్యారు. దాంతోపాటు ఎలాంటి రక్షణ లేకపోవడంతో చాలామంది పిల్లలు అపహరణకు గురయ్యారు. ఎన్నోసార్లు ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు మొర పెట్టుకున్నా వారికి ఎలాంటి ఫలితం లభించలేదు. దాంతో ఈ సారి ఓటుహక్కును ఆయుధంగా చేసుకుంటామని, నోటాను ఉపయోగించుకుంటామని వారు చెబుతున్నారు. అడ్రస్‌తో కూడిన ఫొటో గుర్తింపు కార్డులున్న వారిని ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించకుండా వారి ఇళ్లను కూల్చేయడంతో వారు నోటాను ఎంచుకుని నేతలకు తగిన బుద్ధి చెబుతామంటున్నారు.