అదే జీవితం కాదు | Alia Bhatt On sister Shaheen Bhatt Depression Its Impossible To Not Get Emotional | Sakshi
Sakshi News home page

అదే జీవితం కాదు

Published Sat, Dec 14 2019 1:37 AM | Last Updated on Sat, Dec 14 2019 1:37 AM

Alia Bhatt On sister Shaheen Bhatt Depression Its Impossible To Not Get Emotional - Sakshi

‘‘దిగులుగా ఉంది చాలా..! అమ్మా, నాన్న, అక్క.. ఫ్యామిలి అంతా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు నన్ను. అయినా సంతోషంగా లేను. ఎందుకో తెలియదు. దీని మీదే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో రాయాలనుకున్నా. అందుకు తగిన ఫొటోలకోసం చూస్తుంటే... అన్నీ హ్యాపీ ఫీల్‌తో ఉన్నవే. అరే.. దిగులుతో సగమవుతూ సంతోషంగా ఉన్న ఫొటోలు ఎందుకు చూస్తున్నాను? అనిపించింది. ఆ ఆలోచన, నాకు నేను వేసుకున్న ప్రశ్నే ''I' ve Never Been (Un)Happier'' పుస్తకంగా మీ ముందుకు వచ్చింది.’’ ఈ మాటను పంచుకున్న వ్యక్తి షహీన్‌ భట్‌. ‘ఐ హావ్‌ నెవర్‌ బీన్‌ (అన్‌) హ్యాపియర్‌’ రచయిత్రి. నిజానికి షహీన్‌కూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పదమూడో యేట నుంచే రచనావ్యాసంగంలో ఉంది ఆమె. కాని.. మరింత వివరంగా తెలియాలంటే ఆమె అలియాభట్‌ సోదరి అని చెప్పక తప్పడం లేదు. ఈ పుస్తకంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది షహీన్‌. రచయితగా ఆమె పరిచయం, ఆ పుస్తకాన్ని ఆమె తను అనుభవించిన డిప్రెషన్‌ మీద రాయడం.. ఈ రెండూ సంచలనం రేపాయి.

షహీన్‌ డిప్రెషన్‌తో బాధపడ్తున్నట్టు ఆమె పద్దెనిమిదో యేట మానసిక వైద్యనిర్థారణలో వెల్లడైంది. అప్పటికే అయిదేళ్ల నుంచి దాని తాలూకు లక్షణాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె అందులోంచి బయటపడ్డానికి తల్లి సోనీ రాజ్దాన్, తండ్రి మహేశ్‌ భట్, అక్క అలియా ఎంతో సహకరించారు. ‘‘క్షణం తీరికలేని బిజీ షెడ్యూల్‌లో ఉన్నా నా కోసం టైమ్‌ కేటాయించేది అలియా. నేను మామూలు మరిషి అవడానికి ఎంత హెల్ప్‌ చేసిందో! నేను ఈ కుటుంబంలో పుట్టడం.. అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉండడం, చేయి వదలని తోబుట్టువు దొరకడం నిజంగా అదృష్టం’’ అంటుంది షహీన్‌ ఆ రోజులను గుర్తుచేసుకుంటూ! ‘ఐ హావ్‌ నెవర్‌ బీన్‌ (అన్‌)హ్యాపియర్‌’ పుస్తకం రాయడానికి దాదాపు యేడాది పట్టిందట.

ముందసలు తన దిగులు, వ్యాకులత గురించి బయటకుఎందుకు చెప్పుకోవాలి? తన బాధను పుస్తక రూపంలో అలా బయటపెట్టడం సాహసమే. అంత ధైర్యం తనకు ఉందా అని ఎంతో మానసిక సంఘర్షణ అనుభవించాకే  పుస్తకం రాసిందట షహీన్‌. ‘‘అమ్మానాన్న ఇద్దరూ ధైర్యవంతులే. దాపరికం అస్సలు ఉండదు వాళ్లకు. ఉన్నదున్నట్టు నిజాయితీగా మాట్లాడేస్తారు. వాళ్ల నుంచి నాకూ ఆ నిజాయితీ గుణం వచ్చింది. కాని ధైర్యం లేదు. నిజాయితీ, ధైర్యం ఈ రెండు వేర్వేరు విషయాలు. తర్జనభర్జన తర్వాత డిసైడ్‌ అయ్యా.. నేను పడ్డ బాధను నిజాయితీగా పుస్తక రూపంలో పంచుకోవాలనుకున్నా. అదే చేశా. మన దగ్గర దీని మీద సరైన అవగాహన లేదు. ఫలానా ఆమె మెంటల్‌ అనో.. పిచ్చిదనో.. ముద్రవేసేస్తారు. ఈ పుస్తకం ద్వారా డిప్రెషన్‌ మీద కొంత అవగాహన కూడా వస్తుందని ఆశ’’ అని చెప్తుంది షహీన్‌. ఆమె అనుకున్నట్టుగానే ఆ పుస్తకం రాసినందుకు షహీన్‌ మీద కామెంట్లు వచ్చాయి. దానికి ఆమె ఘాటుగానే స్పందించింది.. ‘‘డిప్రెషన్‌తో స్ట్రగుల్‌ నా జీవితంలో ఒక భాగం మాత్రమే. అదే నా జీవితం కాదు’’ అని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement