ఆనంద దర్శనం
జెన్ పథం
దీపాలు వేర్వేరు రూపాలలో ఉండొచ్చు. కానీ వెలుగు ఒక్కటే. జ్ఞాని వెలుగు ఒక్కటే చూస్తాడు. అంతే తప్ప అతను దీపాల రూపాలలోని తేడాను చూడడు. కానీ అజ్ఞాని అలాకాదు. దీపాల రూపాలలో ఉన్న తేడాను మాత్రమే చూస్తాడు. వాటి రూపాలను పొగుడుతాడు. అందులోనే లీనమైపోతాడు. దాని గురించే మాట్లాడుతుంటాడు. పెపైచ్చు వెలుగును చూడటం మాని వాటి ఆకారాలనే ఆరాధిస్తాడు.
ప్రపంచం అజ్ఞానుల చేతుల్లో ఉంది. అందుకే దీపమైనా అది నరకంగానే ఉంది. కానీ ఆ దీపమే సత్యజ్ఞాని చేతిలోకొస్తే స్వర్గమవుతుంది. ప్రపంచంలో జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు అనేకమున్నాయి. అయినా వాటి మూలం ఒక్కటే. అది సత్య జ్ఞానం. సత్యాన్ని దర్శించడం. ఆకాశానికి ఎల్లలు లేవు. అలాగే ఎత్తుకూ ఎల్లలు లేవు. రెక్కల శక్తి మేరకు ఎత్తుంటుంది. ఎత్తుకు తగినట్లు దర్శనభాగ్యం కలుగుతుంది.
‘‘దేవుడా, సముద్రాన్ని చూసుకుంటూ సాగిపోయే నదుల్లా మేమందరం నీ దిశలో నీ దర్శనం కోసం అడుగులు వేస్తూనే ఉన్నాం. మాకెప్పుడు మోక్షం ప్రసాదిస్తావో తెలియడం లేదు...’’ అని ఒక భక్తుడు మొరపెట్టుకున్నాడు.
ఇక ఆనందం. ఆనందం అనేది కాస్సేపు ఉండిపోయే అతిథిలాంటిది. ఆవేదన అనేది ఎప్పుడూ మనతో ఉండే సొంతమనిషిలాంటిది. తత్వార్థంగా చెప్పాలంటే, ఆవేదన అనేది మరేదో కాదు. అది ఆనందంలో కలిసే ఉంటుంది. ఈ నిజాన్ని తెలియని వారు వాటిని వేర్వేరుగా చూస్తారు. బాధ పడతారు. కానీ సత్యజ్ఞాని రెండింటినీ సమానంగా స్వీకరించి స్థితప్రజ్ఞుడనిపించుకుంటాడు.
- యామిజాల