విజయదశమి మహర్దశమి | dasara durgamma special | Sakshi
Sakshi News home page

విజయదశమి మహర్దశమి

Published Wed, Oct 21 2015 10:33 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

విజయదశమి మహర్దశమి - Sakshi

విజయదశమి మహర్దశమి

శక్తి ప్రదాయినికి తొమ్మిది అవతారాలంటారు. పదవ అవతారం మేం కనుక్కున్నాం. పదిమంది సామాన్య స్త్రీలు చేపట్టిన అసమాన యజ్ఞాలు ఇవి. పురాణాలలో లోకకల్యాణం కోసమే అవతారాలు పుట్టాయని జనకల్యాణం కోసమే యజ్ఞాలు చేశారనీ చదివాం. మన చుట్టూ మనలో ఎందరో మహిళలు ఇవాళ్టికీ  అలాంటి అవతారాలెత్తి ఎన్నో యజ్ఞాలు తలపెట్టారు.  కడుపు మాడినా కుటుంబానికి అన్నం పెట్టడం కూడా ఒక యజ్ఞమే. భర్త తూలనాడినా క్షమించి సంసారాన్ని నిలబెట్టుకోవడం కూడా ఒక యజ్ఞమే. అవసరమైతే ఇంటికి తానే పెద్ద దిక్కై ఇంటిని కాపాడుకోవడం కూడా ఒక యజ్ఞమే. ఇలాంటి యజ్ఞాలు రోజూ చేస్తున్నా మనకి కానరావు. దసరా నాడైనా మహిళ శక్తి స్వరూపాన్ని కరుణారూపాన్ని దర్శించుకుందాం. తమ కుటుంబాలకే కాకుండా పది కుటుంబాలకి అండగా నిలిచిన ఈ కొందరినైనా కీర్తించుకుని అలాంటి శక్తి కోసం సంకల్పాన్ని చెప్పుకుందాం. ఈ దశమికి విజయం పలుకుదాం.  ఈ విజయదుర్గలకు ప్రణమిల్లుదాం.
 
 
సాక్షాత్తు సరస్వతే
భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన రోషిణి ముఖర్జీ... తండ్రి అకస్మాత్తుగా కన్నుమూయడంతో.. తన చిన్ననాటి ఆశయమైన టీచింగ్ కెరీర్‌ను వదులుకుని కోల్‌కతాలోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగానికి చేరింది. అయితే ఉద్యోగం చేస్తూనే 2011లో ’ExamFear.com’ అనే యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించడం ద్వారా టీచర్ అవ్వాలన్న కలను నెరవేర్చుకుంది. అందులో 9-12 తరగతుల విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్ క్లాసులు చెప్పడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ‘టీచింగ్’కి నూరుశాతం న్యాయం చేయాలనే సంకల్పంతో చేసే ఉద్యోగాన్ని మానేసింది రోషిణి. ప్రస్తుతం రోషిణి యూట్యూబ్ చానల్‌కు 74వేల మంది సబ్‌స్క్రైబర్లున్నారు. తన సమయాన్ని పూర్తిగా చానల్‌కే ఉపయోగించడం ఆమెకు ఆనందంగా ఉంటోందని గర్వంగా చెబుతోంది. త్వరలో బేసిక్ ఇంగ్లిష్, 6-8 తరగతుల వారికి కూడా ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించనున్నట్లు చెప్పింది ఈ చదువుల తల్లి.
 
ఉద్యమ స్ఫూర్తి బసంతి
కళ్ల ముందు ఏదైనా సమస్య వస్తే భయపడకుండా ఉద్యమించి మరీ దాన్ని పారదోలగొట్టేయగలరు మహిళలు. కానీ అలా చేయాలంటే వారికో స్పూర్తి కావాలి. ఆ ఉద్యమ శక్తే  బసంతి దేవి. ఆమె పేరు వినగానే ఉత్తరాఖాండ్ మహిళల ముఖంలో ఓ కృతజ్ఞత భావం వెల్లువిరుస్తుంది. ఎందుకంటే ఆమె కారణంగానే ఇప్పుడు లాభాపేక్షే ధ్యేయంగా గిరిజన భూముల్లో పరిశ్రమలు పెట్టేవారు అక్కడికి అడుగుపెట్టడం లేదు. సంఘటిత మహిళా శక్తితో బసంతి దేవి బడా పారిశ్రామిక వేత్తల్ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది మరి. బసంతి దేవి ఒక పేద కుటుంబంలో జన్మించింది. 12 ఏళ్లకే పెళ్లి జరగడం, కొన్ని రోజులకే వితంతువుగా మారడం ఆమెకు జీవితం అంటే ఏంటో తెలియని వయసులోనే అన్నీ జరిగిపోయాయి. అలా జీవితం నేర్పిన పాఠాలతో ఆమె ఊళ్లో జరిగే బాల్యవివాహాలను అడ్డుకుంది. చుట్టుపక్కల గ్రామాల్లోని సమస్యలను కూడా పరిష్కరిస్తూ ముందుకు సాగింది.
 
మూడోనేత్రం
సృజనను తన మూడో కంటితో కొత్త కోణంలో చూపుతోంది పాతికేళ్ల  ఫొటోగ్రాఫర్ షొవోనా కర్మకార్. శాంతినికేతన్ విశ్వవిద్యాలయం ఫైన్‌ఆర్ట్స్ విభాగంలో సెకండియర్ చదువుతోంది. తండ్రి బెంగాలి. తల్లి ఆఫ్రికన్. మొదట ఇంటి గోడల మీద తన ఆలోచనలను రంగులుగా ఆవిష్కరించేది షొవోనా. ఆ తర్వాత ఫొటోగ్రఫీలో ఎన్నో నూతన ఆవిష్కరణలు చేసింది. ఫలితమే.. ఫొటోగ్రఫీలో ఆమెకు వచ్చిన జాతీయ, అంతర్జాతీ బహుమతులు. షొవొనాకర్మకార్ ఇంటర్‌నెట్ ఆన్‌లైన్ పోర్టల్‌ని వెతికితే ఆమె గురించిన ఆసక్తిదాయకమైన ఎన్నో విషయాలేకాదు, ఆమె తీసిన ఫొటోలూ ఎన్నో సంగతులు మనకు చెబుతాయి. ముంబయ్‌లోని ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ రితమ్ బెనర్జీ... షొవానా దగ్గర ఒక నెల రోజులు శిక్షణ  తీసుకోవడం విశేషం. ఉన్న అడ్డంకులను తొలగించుకుంటూ ఆసక్తి ఉన్న ప్రపంచంలో తనకంటూ ఒక ముద్రను వేసుకుంటున్న విజేత షొవొనా.
 
ఖబర్ లహరియా
ఈ గెలుపు కథ ఒక్క స్త్రీ మూర్తిది కాదు స్త్రీ సమూహానిది. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని దళిత, గిరిజ మహిళల మూకుమ్మడి విజయగాథ. అగ్రకుల, పురుషాధిపత్యాలను ధిక్కరించిన వనితల ధీరగాథ. కత్తికన్నా కలం పదునైందని గ్రహించి వార్తాపత్రికను యుద్ధభూమిగా ఎంచుకున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను వార్తల రూపంలో పత్రికల్లో అచ్చువేసి ఇంటింటికీ పంపాలనుకున్నారు. వీరి ఆలోచనకు భయపడ్డ అగ్రకులస్తులు ఈ ప్రయత్నాన్ని ముందుకు సాగనీయకుండా అడ్డంకులు ఏర్పర్చారు. అయినా బుందేల్‌ఖండ్‌ప్రాంతంలోని చిత్రకూట్ జిల్లా ఆడవాళ్లు అంగుళం కూడా వెనక్కితగ్గలేదు. దగ్గర్లోనే ఉన్న నిరంతర్ అనే స్వచ్ఛంద సంస్థ సహాయంతో  ‘ఖబర్ లహరియా’అనే పత్రికను స్థాపించారు. ఆడవాళ్లే స్థాపించి, ఆడవాళ్లే నిర్వహిస్తున్న ఖబర్ లహరియా పత్రిక పత్రిక చూడందే బుందేల్‌ఖండ్ పెత్తందారీలకు తెల్లవారట్లేదట. స్త్రీ శక్తికి ఇంతకుమించిన ఉదాహరణ ఏముంటుంది!
 
కుంచెపట్టిన దుర్గమ్మ
రాజకీయ నాయకుల ప్రసంగాల్లోనైనా, మీడియాలోనైనా సామాన్యులను ఉద్దేశించే మాటలన్నీ పుల్లింగాన్ని సంబోధించేవే. లక్నో యువతి కర్ణికా కహేన్‌కు ఇదంతా మహిళల పట్ల సమాజం చూపుతున్న వివక్షలా అనిపించింది.  దేశంలోని సామాన్య ప్రజానీకంలో సగభాగం మహిళలే అయినప్పుడు వారికి సమాన ప్రాతినిధ్యం ఎందుకు దక్కడం లేదనేదే ఆమె ప్రశ్న.  తన ప్రశ్నకు తనే సమాధానం ఇచ్చే ప్రయత్నంగా ‘కామన్‌మ్యాన్’ అనే పదానికి దీటుగా రెండేళ్ల కిందట ‘కామన్‌వుమన్’ (ఆమ్ లడ్కీ) పాత్రను సృష్టించింది. ఆ పాత్ర ద్వారానే సమాజంలో మహిళలపై సాగుతున్న అకృత్యాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వందలాదిగా కార్టూన్లు గుప్పించడం మొదలుపెట్టింది. ‘ఇండియాటుడే’ ఆమె కార్టూన్లను, ఇంటర్వ్యూను ప్రచురించింది. ‘ఆజ్‌తక్’ చానల్ ఆమె ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. జనాలకు చేరువయ్యేందుకు కర్ణికా ‘ఫేస్‌బుక్’ను వేదికగా చేసుకుంది. ‘ఫేస్‌బుక్’లో ఆమె పేజీ సూపర్‌హిట్. సామాన్యులలో సగభాగానికి ఆత్మగౌరవం దక్కించడంలో తనవంతు పాత్ర పోషిస్తున్న కర్ణికా కహేన్‌ను కుంచె పట్టిన దుర్గమ్మలా ఆరాధిస్తున్నారు.
 
అడవి బిడ్డ పోరు
అరకులోయ అనగానే కొండలు, లోయలు, అడవులు...ఇలా మనకు సుందర ప్రకృతి దృశ్యాలే దర్శనిమిస్తాయి. విశాఖపట్నానికి చేరువలో ఉన్న ఈ అరకు చుట్టూ ఎన్నో కొండజాతులు నివాసం ఉంటున్నాయి. వారి కష్టాలను తెలుసుకోవడానికి, వారి జీవనవిధానంలో మార్పు తీసుకురావడానికి పట్టించుకునేవారే లేరు. అలాంటి వారికి ‘ నేనునాన్నను’ అంటూ విశాఖపట్నం నుంచి బయల్దేరింది ఓ స్త్రీ. నెలలు నిండని పసికందును పొత్తిళ్లలో పెట్టుకొని పాతికేళ్ల క్రిందట తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ధనిక, పేద అసమానతలను తొలగించడానికి నేటికీ దుర్గ అయి పోరాడుతూనే ఉంది. ఈ అపర దుర్గ పేరు ప్రసన్న శ్రీ. పుట్టింది అరకులోని ఓ కొండజాతిలో. ఆమె చిన్నవయసులో కుటుంబం విశాఖపట్నం వచ్చి, స్థిరపడింది. ప్రసన్నశ్రీ చదువుకుని, ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఇంగ్లిషు అధ్యాపకురాలిగా చేరింది. గిరిపుత్రుల జీవితాల్లో చిన్నమార్పు అయినా తీసుకురావాలనుకుంది. వారి కోసం 18 గిరిజన భాషలకు లిపిని కనిపెట్టడం ద్వారా ఆ మార్పు తెచ్చింది. అంతటితో ఊరుకోలేదు. వారి సంక్షేమం కోసం, అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేడుతోంది.
 
కీచకుడి పీచమణచిన భద్రకాళి
ప్రజ్ఞా మన్‌ధారే సాదాసీదా కాలేజీ అమ్మాయి. ముంబైలోని విల్లేపార్లే ప్రాంతంలో ఉన్న సాథాయే కాలేజీలో మాస్ మీడియా డిగ్రీ కోర్సు మూడో సంవత్సరం చదువుకుంటోంది. బొరివలి ప్రాంతంలో ఆమె ఇల్లు. ఇంటి నుంచి కాలేజీకి లోకల్ ట్రైన్‌లోనే రాకపోకలు సాగిస్తోంది. కాలేజీకి సమీపంలోని కండివలి స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై ఓ రోజు సాయంత్రం ఎప్పటి మాదిరిగానే లోకల్‌రైలు కోసం ఎదురు చూస్తోంది. ఎక్కడి నుంచి వచ్చాడో తాగుబోతు. ఆమె చేయి పట్టుకుని గుంజాడు. అతడిని నెట్టేసేందుకు ప్రయత్నించింది. అసలే చిత్తుగా తాగి ఉన్న ఆ కీచకుడు బలవంతంగా అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఇక అంతే... భద్రకాళి అవతారమెత్తింది ఆమె. చేతిలోని బ్యాగుతో అతడి ముఖంపై ఎడాపెడా బాదింది. స్టేషన్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీస్‌స్టేషన్ వరకు అతణ్ణి లాక్కుపోయి, పోలీసులకు అప్పగించింది. ఈ సంఘటన ఈ ఏడాది మార్చిలో జరిగింది. సంఘటన జరిగిన మర్నాడు పత్రికల్లో వార్త వచ్చింది. అప్పుడు మొదలయ్యాయి ఆమెపై ప్రశంసలు.
 
 షెహనాజ్ దీదీ
 షెహనాజ్‌బాను స్వస్థలం ఢిల్లీ!  వరకట్నానికి వ్యతిరేకంగా చేసిన పోరాటమే ఆమె శక్తి. 2009లో అత్తింటి వాళ్లు అడిగినంత కట్నంతో నవేద్‌కిచ్చి నిఖా జరిపించాను షెహనాజ్ బాను తల్లిదండ్రులు.  పెళ్లయిన తెల్లవారి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆ కష్టాల్లోంచి ఆమె ఒక అపరకాళిలా ఆవిర్భవించింది. మెట్టినింట్లో అత్తా, మామ, భర్త, ఆడపడచులను జైల్లో పెట్టించింది.  తాను ఎవరి పంచనా ఉండకుండా హాస్టల్లో చేరింది. ఓ ఎన్‌జీవోలో ఉద్యోగం సంపాదించుకుంది. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే ఇంకో వైపు ఢిల్లీ స్లమ్స్‌లోని వరకట్న బాధితులకోసం పని చేస్తోంది. ‘భయపడినన్నాళ్లు.. చీకట్లోనే బతకాల్సి వస్తుంది. ఎదురు తిరిగితేనే వెలుతురిని చూడగలం అని అనుభవం ద్వారా తెలుసుకున్నా. అందుకే జీవితంలో ఇక భయపడ దల్చుకోలేదు. నాలా అత్తింటి ఆరళ్లు భరిస్తున్న కొంతమందికైనా ధైర్యానివ్వగలుతున్నా. ఇది చాలు నాకు’అంటుంది షెహనాజ్. ఇప్పుడు షెహనాజ్.. పాత ఢిల్లీలోని స్లమ్స్‌లోని ఆడపిల్లలకు  పంచే దీదీ!
 
ఛూ.. మంత్ర కాళీ

ఆమె పేరు బిరుబలా! ఆ ఊరి పేరు థకుర్‌విలా. అస్సాం రాష్ట్రంలో ఉంది. మూఢనమ్మకాలు, చేతబడులకు పుట్టిల్లు. వాటి మీదే బిరుబలా పోరాటం.  ఆ అంధవిశ్వాసాలకు తమ ఊళ్లో చోటులేకుండా చేయాలనే ఆలోచన ఆమెకు పుట్టడానికి కారణం ఆమె కుటుంబమూ దాని బారిన పడ్డమే! థకుర్‌విలా ప్రజల్లో వేళ్లూనుకున్న మూఢవిశ్వాసాలను పారదోలడానికి బిరుబలా పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. మంత్రాల్లేవ్, తంత్రాల్లేవ్ అని చెప్తోందంటే అసలు ఈమే మహామంత్రగత్తె అయింటుంది అనుకొని జనాలంతా బిరుబలా ఇంటి మీద దాడి చేశారు. బిరుబలా సహా ఆమె కుటుంబ సభ్యులందరినీ కొట్టారు. అయినా ఆమె పోరాటాన్ని ఆపలేదు. ముందు మహిళలను చైతన్యం చేసి వాళ్ల ద్వారా వాళ్ల కుటుంబాల్లో మార్పు తేవాలని నిశ్చయించుకొని ‘థకుర్‌విలా మహిళాసమితి’ని ఏర్పాటు చేసింది. దాడులతో భయపడి కుంగిపోయిన వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తోంది. బతుకు బరిలో నిబడ్డానికి కావల్సిన పనులను నేర్పిస్తోంది!
 
 శిఖరస్థాయి సాహసి
 49 ఏళ్ల దిల్షన్ మాస్టర్‌కు ఏదైనా ‘ప్రారంభించడమే’ పని! ఆమె స్టార్టప్ ఉమెన్. ఢిల్లీలో ఉంటారు. జీ సినిమా, స్టార్ మూవీస్, ఎన్.జి.సి హిందీ, హిస్టరీ ఛానెల్, యూటీవీ, ఎన్డీటీవీ వంటి ప్రజాదరణ పొందిన టీవీ ఛానెళ్ల ప్రారంభంలో దిల్షన్ చెయ్యి ఉంది. చమక్కు ఉంది. ఆ చానెళ్లన్నింటి సక్సెస్‌లో ఆమెదే స్టార్టింగ్ స్టోరీ ఉంది. అయితే దిల్షన్ ఆకస్మాత్తుగా మీడియా నుంచి అడ్వెంచరస్ ట్రెక్కింగ్ వైపు మళ్లారు! అందుకు రెండు కారణాలు. ‘ఇక చాలు’ అనుకున్నారు మీడియా గురించి. ‘ఇది చాలదు’ అనుకున్నారు తన నాలుగేళ్ల కూతురు గురించి. విషయం ఏమిటంటే... తనలోని క్యాన్సర్‌తో ఇప్పుడామె పోరాడుతున్నారు. ఇంత పోరాటంలోనూ ఆమె తన రక్తాన్ని, చెమటను మృత్యువుకు ధారపోయదలచుకోలేదు. ‘మా అమ్మ నా కోసం ఇది చేసి వెళ్లి పోయింది’ అని తన కూతురు గర్వంగా చెప్పుకునేలా తన శక్తిని, సామర్థ్యాన్ని వినియోగించదలచారు. ‘మెర్క్కురీ హిమాలయన్ ఎక్స్‌ప్లోరేషన్’ సంస్థను ప్రారంభించి లక్ష్యసాధకులను నడిపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement