డర్మటాలజీ కౌన్సెలింగ్‌ | Dermatology Counseling | Sakshi
Sakshi News home page

డర్మటాలజీ కౌన్సెలింగ్‌

Published Fri, Jun 15 2018 1:11 AM | Last Updated on Fri, Jun 15 2018 1:11 AM

Dermatology Counseling - Sakshi

హాస్టల్‌లో చేరినప్పటి నుంచి వేళ్ల మధ్య కురుపులు
నా వయసు 16 ఏళ్లు. ఇటీవలే ఇంటర్మీడియట్‌ చదవడానికి మా ఊరినుంచి వచ్చి ఇక్కడ టౌన్‌లోని ఒక హాస్టల్‌లో ఉంటున్నాను. నేను హాస్టల్‌ చేరాక కొద్దిరోజుల్లోనే నా చేతివేళ్ల మధ్యన కురుపుల్లాగా వస్తున్నాయి. కాస్త దురదగా ఉంటోంది కూడా.  ఇదేమైనా అంటువ్యాధా? తగిన పరిష్కారాన్ని సూచించండి. – ఎల్‌. రవికాంత్, గుంటూరు
హాస్టల్‌లో ఉండే పిల్లల్లో చాలామందికి వచ్చే చాలా సాధారణమైన వ్యాధి ఇది. దీన్ని ‘స్కేబిస్‌’ అంటారు. మీరు ఊహించినట్లే ఇది చాలా త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కేవలం 20 నిమిషాల పాటు కలిసి ఉన్నా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందంటే, ఇది ఎంతటి తీవ్రమైన అంటువ్యాధో ఊహించవచ్చు. దీనికి చికిత్స కోసం మీరు ఫెక్సోఫినడిన్‌ 180 ఎంజీ అనే ట్యాబ్లెట్‌ను రోజూ రాత్రివేళ 10 రోజుల పాటు తీసుకోండి. ఇది దురదను తగ్గిస్తుంది.

ప్రతిరోజూ సాయంత్రం వేడినీటితో స్నానం చేసి, ఆ టైమ్‌లో వేళ్ల మధ్య స్క్రబ్‌ (శుభ్రం అయ్యేలా గట్టిగా రాసుకోవడం)  చేసుకోండి. ఆ తర్వాత ఒకసారి పర్మెథ్రిన్‌ 5% అనే లోషన్‌ను శరీరమంతా రాసుకుని నిద్రపోండి. (ఇలా చేయడం కేవలం ఒక రాత్రి కోసం మాత్రమే). ఉదయం లేవగానే వేళ్లమధ్య స్క్రబ్‌ చేసుకుంటూ స్నానం చేయండి.

ఇదే ప్రక్రియను నెల తర్వాత మళ్లీ రిపీట్‌ చేయాలి. హాస్టల్‌లో ఒకరికి ఉన్నా... మొత్తం హాస్టల్‌లో ఉన్నవారంతా ఈ ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి. ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే నెల తర్వాత ఇదే ట్రీట్‌మెంట్‌ మళ్లీ తీసుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే  మరోమారు డర్మటాలజిస్ట్‌ను సంప్రదిం చండి.


చెవిరింగు ఉన్న చోట రాష్‌... తగ్గేదెలా?
నా వయసు 36 ఏళ్లు.  నేను చెవి రింగు ధరించే రంధ్రం వద్ద ర్యాష్‌లాగా వచ్చి అక్కడ విపరీతమైన దురద కూడా వస్తోంది. నేను ఆర్టిఫిషియల్‌ ఆభరణాలు... అంటే రింగులు లేదా దిద్దులు ధరించినప్పుడు ఈ బాధ ఎక్కువవుతోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
– డి. సురేఖ, వరంగల్‌
సాధారణంగా కృత్రిమ ఆభరణాలలో నికెల్‌ లోహం ఉంటుంది. దీని వల్ల ర్యాషెస్‌  వస్తాయి. వీటి కారణంగా కాస్త దురద, చెవి రంధ్రం వద్ద ఎర్రబారడం వంటి లక్షణాలూ కనిపిస్తుంటాయి. మీరు ఈ దశలో దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత అక్కడి గాయం రేగిపోయి, రక్తస్రావం కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యను ‘అలర్జిక్‌ కాంటాక్ట్‌ డర్మటైటిస్‌ టు నికెల్‌’ అంటారు.

చికిత్స : మీ సమస్యకు ఈ కింద సూచించిన విధంగా చికిత్స చేయవచ్చు. అవి...
1.    మీరు నికెల్‌తో చేసిన కృత్రిమ ఆభరణాలు, రింగులు, దిద్దులు ధరించకండి.
2.    మీరు మొమెటజోన్‌ ఉన్న ఫ్యూసిడిక్‌ యాసిడ్‌ లాంటి కాస్త తక్కువ పాళ్లు కార్టికోస్టెరాయిడ్‌ కలిసి ఉన్న యాంటీబయాటిక్‌ కాంబినేషన్‌తో లభించే క్రీములను గాయం ఉన్న చోట రోజుకు రెండు సార్లు చొప్పున కనీసం 10 రోజులు రాయండి.
3.     అప్పటికీ మీకు ఉపశమనం కలగకపోతే మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి.


జుట్టు చివరలు చిట్లుతున్నాయి... ఏం చేయాలి?
నా వయసు 26 ఏళ్లు. నేను వర్క్‌ప్లేస్‌కు బైక్‌పై వెళ్తుంటాను. నా ఒక మోస్తరు జడ (మీడియమ్‌ లెంత్‌ హెయిర్‌) ఉంది. నేను హెల్మెట్‌ వాడుతున్నాను. హెల్మెట్‌కు బయట ఉండే జుట్టు దుమ్ముకూ, ఎండకూ ఎక్స్‌పోజ్‌ అవుతోంది. నా జుట్టు చివర్లు చిట్లుతున్నాయి. దాంతో జుట్టు అసహ్యంగా కనిపిస్తోంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – శిరీష, హైదరాబాద్‌
మీరు చెప్పినట్లుగా వెంట్రుకల చివర్లు చిట్లడానికి మూడు అంశాలు కలిసి తమ  ప్రభావం చూపుతాయి. అవి... దుమ్ము, కాలుష్యం, ఎండ. ఈ అంశాల దుష్ప్రభావం  జుట్టుకు చాలా నష్టం చేస్తుంది. మీ సమస్య తగ్గడానికి కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించండి.
టూవీలర్‌ మీద ప్రయాణం చేసేటప్పుడు జుట్టు మొత్తం కాలుష్యం, ఎండ, దుమ్ము బారిన పడకుండా, వెంట్రుకలను కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోండి.
రోజు విడిచి రోజు తల స్నానం చేయండి. తలస్నానం చేయడానికి మైల్డ్‌ షాంపూ మాత్రమే ఉపయోగించండి.
 తలస్నానం తర్వాత మీ జుట్టు పూర్తిగా ఆరకముందే ఈ కింద పేర్కొన పదార్థాలు ఉండే  ‘హెయిర్‌ సీరమ్‌’ రాయండి. అవి...
డైమిథికోన్‌
ట్రైజిలోగ్జేన్‌
విటమిన్‌ ఈ ఎసిటేట్‌
అహోబా ఆయిల్‌
ఆలివ్‌ ఆయిల్‌
 ఆల్మండ్‌ ఆయిల్‌.
పైన పేర్కొన్న సీరమ్‌ మీ వెంట్రుకలకు దుమ్ము, అల్ట్రావయొలెట్‌ కిరణాలు, కాలుష్యం నుంచి రక్షణ ఇస్తుంది.

దుస్తులు కవర్‌కాని చోట్ల చర్మం డల్‌గా...!
నా వయసు 16 ఏళ్లు. నేను సెల్వార్, కమీజ్‌ లాంటి దుస్తులు ఎక్కువగా ధరిస్తుంటాను. అయితే స్వీల్‌లెస్‌ లాంటివి వేసుకునే సమయంలో ఒక సమస్య ఎదురవుతుంది. నా దుస్తులు కప్పి ఉండే ప్రాంతం తెల్లగానూ, మిగతా ప్రాంతం కాస్త వన్నె తక్కువగానూ కనిపిస్తుంది. నా మోచేతి కింది భాగాలు కూడా... దుస్తులు కప్పి ఉండే భాగాల్లాగే నిగనిగలాడుతూ, మెరుస్తూ కనిపించాలంటే ఏం చేయాలో చెప్పండి. – సరిత, విశాఖపట్నం
శరీరంలో దుస్తులు కప్పి ఉండే భాగాలపై సూర్యకిరణాలు పడవు. కాబట్టి అక్కడి భాగం తేమను కోల్పోదు. ఫలితంగా సూర్యకాంతి వల్ల జరిగే నష్టం జరగదు. దాంతో దుస్తులు కప్పి ఉండేచోట చర్మం, సూర్యుడికి ఎక్స్‌పోజ్‌ అయ్యే భాగాలతో పోలిస్తే కాస్త తెల్లగానూ, మెరుపుతోనూ ఉంటుంది. మీ శరీరంలో సూర్యకాంతికి ఎక్స్‌పోజ్‌ అయ్యే భాగాలు తమ తేమను కోల్పోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...

సూర్యకాంతికి ఎక్స్‌పోజ్‌ అయ్యే మీ చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్‌ ఉండే  మంచి మాయిశ్చరైజర్‌ను పూసుకోండి.
సూర్యకాంతికి ఎక్స్‌పోజ్‌ అయ్యే శరీర భాగాలకు చెందిన చర్మంపై అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల 50 ఎస్‌పీఎఫ్‌ ఉండే బ్రాడ్‌స్పెక్ట్రమ్‌ సన్‌స్క్రీన్‌ రాసుకుంటూ ఉండండి. ప్రతి మూడు గంటలకోసారి ఇలా సన్‌స్క్రీన్‌ రాసుకోవడం చేస్తూ ఉండాలి.
సాధారణంగా మీరు ఫుల్‌స్లీవ్స్‌ వేసుకోవడం వల్ల మిగతా మేనిభాగాలకు కూడా అదే నిగారింపు, మెరుపు వస్తుంది.
గ్లైకోలిక్‌ యాసిడ్‌ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్‌యాసిడ్‌ ఉన్న క్రీములను రాత్రివేళల్లో మీ చర్మంపై పూసుకోండి.
పై సూచనలు పాటించినా ఇంకా మేనిపై ఆ తేడాలు తగ్గకపోతే డర్మటాలజిస్ట్‌ను కలిసి కెమికల్‌ పీలింగ్‌ చేయించుకోండి.

- డాక్టర్‌ స్మిత ఆళ్లగడ్డ ,చీఫ్‌ ట్రైకాలజిస్ట్‌ – డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్‌ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement