బాపూ... నిన్ను మరువం | gandhi temple in nalgonda nalgonda district | Sakshi
Sakshi News home page

బాపూ... నిన్ను మరువం

Published Sun, Oct 1 2017 11:49 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

gandhi temple in  nalgonda  nalgonda district - Sakshi

సందర్భం – గాంధీ జయంతి

గాంధీజీని బాపూజీ అని ప్రేమగా పిలుచుకుంటాం. జాతిపిత అని గౌరవిస్తాం.కూడళ్లలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. అవన్నీ జయంతి, వర్థంతి రోజుల్లో బాపూజీని తలుచుకుని నివాళులర్పించడానికే పరిమితమవుతున్నాయి. మరి మిగిలిన రోజుల్లో గాంధీజీని తలుచుకోవాలంటే ఎలా?  ఒక ప్రశాంతమైన వేదిక కావాలి. అది గుడిని తలపించాలి. అది గాంధీజీ దేశం కోసం ఏమేమి చేశాడో భావి తరాలు నిరంతరం గుర్తు చేస్తూ ఉండాలి... ఇదీ ఆలోచన. దానికి కార్యరూపమే నల్గొండ జిల్లా, చిట్యాల సమీపంలో జాతీయ రహదారి పక్కన వెలసిన గాంధీగుడి.

గాంధీకి తొలి ఆలయం!
‘గాంధీజీ కోసం దేశంలో మరెక్కడా గుడి లేదని ఇదే తొలి ఆలయ’మని చెప్తూ అందుకు దారి తీసిన కారణాలను వివరించారు ఆలయ నిర్మాత శ్రీపాల్‌రెడ్డి. మా అన్న భూపాల్‌రెడ్డికి దేశమంటే చాలా ప్రేమ. మా మాటల్లో ఓసారి ‘గాంధీజీని ఏడాదికి రెండు రోజులు స్మరించుకుని మిగిలిన రోజుల్లో మర్చిపోతున్నాం. గాంధీజయంతి రోజు సెలవు ఉంది కాబట్టి పిల్లలు ఆ ఒక్కరోజును గుర్తు పెట్టుకుంటున్నారు. ఇది కాదు. గాంధీజీ కోసం చిరస్థాయిగా ఉండేటట్లు ఏదో ఒకటి చేయాలి’ అనుకున్నాం. మా ఆలోచనలతో కలిసి వచ్చిన వాళ్లందరం కలిసి ట్రస్ట్‌గా ఏర్పడ్డాం. ట్రస్ట్‌ సభ్యులందరూ గుడి కట్టడానికే ఆసక్తి చూపించారు’ అన్నారాయన.

గర్భగుడిలో గాంధీ
2012 అక్టోబర్‌ 2న గుడి నిర్మాణానికి పునాది పడింది. 2014 సెప్టెంబర్‌ 15న గాంధీ విగ్రహా ప్రతిష్టాపన జరిగింది. కింది అంతస్థులో ధ్యాన మందిరం, పై అంతస్థులో గాంధీ గుడి ఉంది. గర్భ గుడిలో ఉన్న నల్ల రాతి గాంధీ విగ్రçహాన్ని గుంటూరు జిల్లాలోని దుర్గిలో చేయించారు. «ధ్యాన మందిరంలో పెట్టిన పాలరాతి విగ్రహాన్ని రాజస్థాన్‌ నుంచి తెప్పించారు.
గాంధీ సర్వ మతాల సంక్షేమానికి కృష్టి చేశారని, అందుకు ప్రతీకలుగా విగ్రహం పక్కన శిలువ, స్వస్తిక్, నెలవంక గుర్తులను గంధంతో రాయిస్తున్నారు. గాంధీజీకి అన్ని మతాల శిష్యులు ఉన్నారని, అందరూ ఆరాధించేలా వీటిని పెట్టారు. బుద్ధగయ నుంచి బహుమతిగా వచ్చిన దిల్‌వార్‌(కంచుతో చేసిన)లను ఒక్క సారి కొడితే.. ‘ఓం’ కార శబ్ధం తొమ్మిది నిమిషాల పాటు వస్తుంది.

ధర్మచక్ర దర్శనం
గాంధీజీకి, భారతదేశ స్వాతంత్య్రానికి, జాతీయ పతాకానికి ఉన్న బంధానికి ప్రతీకగా ఆలయం ముందు ధర్మచక్రాన్ని ప్రతిష్ఠించారు. ధర్మ చక్రం మధ్యలో రంధ్రం నుంచి చూస్తే గాంధీ విగ్రహం కనిపిస్తుంది. గుడికి కుడి వైపుల కింద పంచ భూతాలు, ఎడమ వైపుల నవగ్రహాలను ప్రతిష్టించారు. గాంధీ జీవిత చరిత్రలో ముఖ్య ఘట్టాలు,  గాంధీ చెప్పిన సూక్తులతో ఉన్న బుక్, గాంధీ టోపీ, పాటల సీడీలు కూడా ఆలయంలో ఉన్నాయి. గాంధీ జననం చరిత్ర, దిన చర్య, మనిషిగా పుట్టిన వారు ఏడు పాపాలు చేయకూడదని వివరిస్తూ గర్భగుడి ఎదురుగా స్తంభాలపై ఫలకాలు పెట్టారు. భక్తులు గాంధీని పూజించిన అనంతరం వెనుదిరిగేటప్పుడు వీటిని చదువుకుని వెళ్తే వారి మీద ఆ ప్రభావం ఉంటుందని, మంచి ప్రవర్తనను అలవర్చుకుంటారని ట్రస్టు నిర్వాహకుల నమ్మకం.

పుణ్యక్షేత్రాల మట్టి.. పవిత్రగ్రంథాలు
దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించాలనే కోరిక ఉండి, వెళ్లడానికి సాధ్యం కాని వారి కోసం దేశంలోని 27 పుణ్య æక్షేత్రాల మట్టిని తెప్పించి గ్లాస్‌ డబ్బాల్లో అమర్చారు. హిందూ ఆలయాలతోపాటు హాజీ అలీదర్గా, బో«ద్‌గయ, జైన దిల్‌వార్, గాంధీ జీవితానికి సంబంధించిన పోరుబందర్, సబర్మతి, వార్ధా, రాజ్‌ఘాట్‌ల నుంచి కూడా మట్టిని తీసుకొచ్చారు. జెరుసలెం, మరో రెండు పుణ్యక్షేత్రాల నుంచి మట్టిని త్వరలో తేనున్నట్లు చెప్పారు. గర్భగుడి వెనక గోడకు అద్దాల అరల్లో భగవద్గీత, ఖురాన్, బైబిల్, త్రిపీఠకములు, జైనవాణి, గురుగ్రంథ్, గాంధీ రచించిన ‘సత్యశోధన’ గ్రంథాలను అమర్చారు. ఆ ఆలయం గురించి మన తెలుగు రాష్ట్రాలకే పెద్దగా తెలియదు. కానీ గుజరాత్‌లోని సబర్మతి, మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌ నుంచి పర్యాటకులు ఈ గుడికి వచ్చి గాంధీని దర్శించుకున్నారు.

సామాన్యుల కోసం గాంధీ!
రోడ్డు కూడళ్లలో ఎన్ని విగ్రహాలు పెట్టినా సామాన్యులు వాటితో కనెక్ట్‌ కావడం లేదు. కామన్‌ పీపుల్, ముఖ్యంగా పిల్లలు గాంధీజీని తరచూ తలుచుకోవడానికి, పెద్దవాళ్లు ప్రశాంతంగా సమయం గడపడానికి వీలుగా చక్కటి ప్రదేశంలో గాంధీని ఆవిష్కరించాలనిపించింది. స్థల సేకరణ కోసం తెలిసిన వాళ్లకు చెప్పినప్పుడు హైదరాబాద్‌ వాసులు ఈ నాలుగెకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. అనుకున్నట్లే గుడి పూర్తయింది. మొదట్లో ఇద్దరు– ముగ్గురు వచ్చేవాళ్లు. ఇప్పుడు రోజుకు దాదాపు వంద మంది వరకు దర్శించుకుంటున్నారు. జయంతి, వర్ధంతి రోజుల్లో పిల్లలకు వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ గాంధీ జయంతికి కొత్త కార్యక్రమం మొదలు పెడుతున్నాం. భక్తులకు వారి జన్మ నక్షత్రాన్ని బట్టి మొక్క నాటాలనే వివరాలతోపాటు మొక్కను కూడా ఇస్తాం. దానిని ఇంట్లో నాటుకోవాలి. ఇలా చేస్తే ప్రతి ఇంట్లో కనీసం మూడు– నాలుగు మొక్కలు పాదుకుంటాయి. పర్యావరణాన్ని పరిరక్షించడానికి కూడా గాంధీ గుడిని కేంద్రంగా చేయాలని మా ఉద్దేశం.
– మోర శ్రీపాల్‌రెడ్డి, మేనేజింగ్‌ ట్రస్టీ, మహాత్మ చారిట్రబుల్‌ ట్రస్ట్, నర్సరావుపేట, గుంటూరు జిల్లా
బొల్లం శ్రీనివాస్, సాక్షిప్రతినిధి, నల్లగొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement