తెలుగు మెతుకు
గిడుగు రామ్మూర్తి పంతులు ఒక ఉద్యమం. వాడుక భాష ప్రజల హక్కు. తెలుగు భాష జాతికి గౌరవం. ఆ అక్షరం ఎందరికో అన్నం. కాని- ఒక మెతుకు కావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఒక సాయం అందాల్సి ఉంది. కష్టాలలో ఉన్న ఒక వారసత్వానికి భరోసా ఇవ్వాల్సి ఉంది. ఇది గిడుగు రామ్మూర్తి ముని మనవడి మొర.
గిడుగు కుటుంబం
గిడుగు రామమూర్తి పంతులుగారికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారుల పేర్లు గిడుగు సీతాపతి, గిడుగు వీర్రాజు, గిడుగు రామదాసు, గిడుగు సూర్యనారాయణ. వీరిలో గిడుగు సీతాపతిగారి పెద్దబ్బాయి గిడుగు జగన్నాథరావు (హైస్కూల్ హెడ్‌మాస్టారుగా చేశారు). వీరి మూడో అబ్బాయే ప్రస్తుతం ఇబ్బందులలో ఉన్న వెంకట నాగేశ్వరరావు (పై చిత్రం).
చిరునామా: గిడుగు వెంకట నాగేశ్వరరావు, న్యూ నల్లకుంట రామాలయం వద్ద, హైదరాబాద్. ఫోన్ : 9581 888 989
తెలుగుభాషను వాడుక భాషగా తీసుకురావ డానికి గిడుగు రామ్మూర్తి పంతులు తన జీవితసర్వస్వాన్నీ త్యాగం చేశారు. ఆ త్యాగానికి గుర్తుగా జయంతులు, వర్ధంతులు జరుగుతున్నాయి. భాషను ఉద్ధరిస్తున్నామని చెబుతున్నవారికి గౌరవాలు దక్కుతున్నాయి. పదవులు ప్రాప్తమవుతున్నాయి.
మంచిదే.
కాని వారి వారసులు కష్టాలలో ఉంటే పట్టించుకోరా అంటున్నారు గిడుగు రామ్మూర్తి పంతులు మునిమనుమడు గిడుగు వెంకట నాగేశ్వరరావు. గిడుగు జయంతి సందర్భంగా వారి మునిమనుమడు గిడుగు వెంకట నాగేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరంలో సన్మానించింది. ఆ సందర్భంగా సాక్షి ఆయనను పలకరించింది. గద్గద స్వరంతో, కన్నీరు నిండిన గుండెతో ఆయన పలికిన మాటలు ఎవరి గుండెనైనా ఆర్ద్రపరిచేలా ఉన్నాయి...
బులుమూరు నుంచి...
‘‘గిడుగు రామ్మూర్తిగారు మాకు ముత్తాత అవుతారు. నా పేరు గిడుగు వెంకట నాగేశ్వరరావు. మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా బులుమూరు. విద్యాభ్యాసం అక్కడ కొంత, పర్లాకిమిడిలో కొంత జరిగింది. బీఎస్సీ చదువుకున్నాను. అప్పట్లో నాన్నగారికి కొద్దిగా పొలం ఉండేది. అయితే చెల్లెళ్ల పెళ్లిళ్లకు అంతా ఖర్చయిపోయింది. ఇక పొలం లేదు, చేయడానికి పనులు లేవు. అందువల్ల 1992లో ఉద్యోగం కోసం, అమ్మాయి చదువు కోసం హైదరాబాద్ నగరానికి కట్టుబట్టలతో వచ్చేశాను. అప్పటి నుంచి అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యాను. నాది చిన్న ఉద్యోగమే కనుక వేణ్ణిళ్లకు చన్నీళ్లుగా కొన్ని సినిమాలలోను, టీవీ సీరియళ్లలోను నటించాను. మంగమ్మగారి మనవడు, కుంకుమరేఖ, కొడుకు పుట్టాలి... సీరియల్స్‌లో చిన్నచిన్న వేషాలు వేశాను. కాని దానివల్ల లబ్ధి బహు స్వల్పం.
పగబట్టిన విధి
ఇప్పుడు నా వయసు 67 సంవత్సరాలు. ఒక అమ్మాయి. పేరు కిరణ్మయి. ఆమె చ దువుకోవడానికి మా బంధువులు కొద్దిగా ఆర్థిక సహాయం చేశారు. ప్రస్తుతం నాకు నెలకి కేవలం ఆరు వందలు పెన్షన్ వస్తోంది. అమ్మాయి బిటెక్ చేసి, చిన్న ఉద్యోగంచేస్తోంది. ఆమె తెచ్చేది పదీ పన్నెండు వేలకు మించదు. నేను, నా భార్య పూర్తిగా అమ్మాయి మీదే ఆధారపడ్డాం. విధి నా మీద పగబట్టినట్లుగా 2014లో నా భార్య సావిత్రికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఆవిడ వయసు 60 సంవత్సరాలు. నాకు తెల్ల కార్డు కాని, ఆరోగ్యశ్రీ కార్డు కాని లేవు. అందువల్ల ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాం. ఆపరేషన్ అవసరం లేదని కొన్నాళ్లు చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. రెండు సంవత్సరాలకే మళ్లీ తిరగబెట్టింది. ఈసారి ‘మల్టిపుల్ బోన్ క్యాన్సర్’ అన్నారు.
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో చేర్పించాను. అక్కడ వైద్యం ప్రారంభించారు. అయితే అక్కడ కొంత వరకు రీ ఇంబర్స్ అయ్యింది. బంధువులు కొద్దికొద్దిగా సహాయం చేస్తున్నారు. కాని ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యం కదా. ప్రస్తుతం రేడియేషన్ పూర్తయ్యింది. త్వరలోనే కీమోథెరపీ ప్రారంభిస్తామన్నారు. ఉన్న కొద్ది సంపాదన నా భార్య వైద్యానికి ఏమాత్రం సరిపోవట్లేదు. ఇంటి అద్దె, ఇంటి ఖర్చులను భరించడమే కష్టంగా ఉంది. అమ్మాయి పెళ్లి బాధ్యత అలాగే ఉంది. ఈ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాను.
చికిత్స కోసం...
నా భార్యకు కీమోథెరపీ ప్రారంభిస్తే అందుకు చాలా ఖర్చు అవుతుంది. చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నిధులు ఇప్పించమని కోరాను. అయితే ముందు మేం సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకుంటే ఆ తరువాత ప్రభుత్వం రీ ఇంబర్స్ చేస్తామంది. నా దగ్గర అంత డబ్బే ఉంటే నేను సహాయం కోసం అర్థించను కదా. ప్రభుత్వం దయతో మా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటే నా శేషజీవితం హాయిగా గడపగలుగుతాను.
వారసుడిగా గుర్తిస్తేనే గౌరవం
గురజాడ అప్పారావుగారి మనవరాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుని ప్రభుత్వం ఆమెకు నెలనెలా పదివేలు భృతి ఇస్తోంది. గిడుగు రామ్మూర్తి మునిమనవడినైన నేను నాకు ఇవ్వమని అడగలేక పోతున్నాను. మా కుటుంబంలో నేనొక్కడినే ఆర్థికంగా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాను. అందువల్లే నాకు ఆర్థికసహాయం చేయమని ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాను. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో నా దరఖాస్తు సాంస్కృతిక శాఖకు వెళ్లింది. కాని ‘లెజండరీ’ కుటుంబ సభ్యులకు భృతి ఇచ్చేలా జీ.వో. లేదని ప్రిన్సిపల్ సెక్రటరీ అనడంతో నా నవ నాడులు కుంగిపోయాయి. నన్ను వృద్ధాప్య పెన్షన్‌కి దరఖాస్తు చేసుకోమన్నారు. నాకు అది అవసరం లేదు. గిడుగువారి వారసుడిగా గుర్తించి, నాకు భృతి ఇచ్చినట్లయితే అది నాకు గౌరవం.
24 ఏళ్లుగా...
మేము 1992లో హైదరాబాద్ వచ్చినది మొదలు న్యూనల్లకుంట లోని రామాలయం దగ్గర ఉంటున్నాం. ఇన్ని సంవత్సరాలుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. ఇంటి వాళ్లు ఎంతో మంచివాళ్లు. అందువల్ల మాకు సొంత ఇంట్లో ఉన్న భావనే కలుగుతుంది.
ఆహ్వానం మేరకు...
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ కార్యదర్శి విజయభాస్కర్ గారి ఆహ్వానం మేరకు విజయవాడ వచ్చాను. మా ముత్తాతగారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో నన్ను ఇక్కడకు ఆహ్వానించి, సన్మానం చేశారు. గిడుగువారి కుటుంబ సభ్యులు, మునిమనుమలు ఎంతోమంది ఉండగా, నన్నే ఎందుకు పిలుస్తారని చాలామంది ప్రశ్నిస్తుంటారు. నాకు ముందర నుంచి నలుగురితో కలిసి మాట్లాడటం, అన్ని కార్యక్రమాలకు హాజరు కావడం అలవాటు. అందువల్లే నన్ను ఆహ్వానిస్తారు.
- సంభాషణ: డా. పురాణపండ వైజయంతి
సాక్షి, విజయవాడ
ఆదుకోమని విన్నవించుకుంటున్నాను...
నేను గిడుగు వారసులలో ఒకడిని. ఆయన పేరిట ఇంత వైభవంగా ఉత్సవాలు జరుపుతున్నారు కాని, మా పరిస్థితి గురించి పట్టించుకునేవారే లేరు. నేను వృద్ధుడినయ్యాను. నా భార్యకు అనారోగ్యంగా ఉంది. మా అమ్మాయి జీతం మీదే ఆధారపడవలసి వస్తోంది. నేను కోరేది ఒక్కటే, నెలనెలా నాకు భృతి ఏర్పాటుచేస్తే, ఆ డబ్బుతో నా భార్యకు చికిత్స చేయించుకుంటాను. నాకు గౌరవభృతి ఇప్పించాలని కోరుతున్నాను. అలా ఇవ్వడం మాకు ఎంతో గౌరవంగాను, మా ముత్తాతగారిని గౌరవించినట్లుగాను భావిస్తాను.
- గిడుగు వెంకట నాగేశ్వరరావు