తను మరో వివాహం చేసుకున్నాడని తెలిసింది
ఆ చట్టాన్ని అనుసరిస్తే... పని చేసే చోట వేధింపుల నుంచి రక్షణ
లీగల్ కౌన్సెలింగ్
మేడమ్, మేము వ్యవసాయకూలీలం. ప్రస్తుతానికి ఒక పొలంలో పత్తికాయ వొలిచే పని చేస్తున్నాం. మమ్మల్ని ఒక కాంట్రాక్టర్ ఆ పొలంలో పనికి పెట్టాడు. పొలం యజమాని అతనికి ఎంత డబ్బు ఇస్తాడో తెలీదు కానీ, మాకు మాత్రం చాలా తక్కువ కూలీ ఇస్తున్నాడు. ఏదో గత్యంతరం లేక మేము పని చేస్తుంటే కాంట్రాక్టరు నుంచి మాకు లైంగిక వేధింపులు మొదలైనాయి. మాతో చాలా అసభ్యంగా, అశ్లీలంగా, ద్వంద్వార్ధంగా మాట్లాడుతున్నాడు. మౌనంగా ఉంటే మరీ వేధిస్తున్నాడు. ఏదో ఒక వంకతో సతాయిస్తున్నాడు. డబ్బు ఆశ చూపి లోబర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. లేకుంటే కూలి నుంచి తప్పిస్తానని భయపెడుతున్నాడు. మేమెవరం పెద్దగా చదువుకోలేదు. మేమేంచేయాలి? మాకు చ ట్టం ఉందా?
- పి.రాజమ్మ, కరీంనగర్
మీరు అనుభవిస్తున్న వేధింపులు పనిచేసేచోట మహిళలకు రక్షణ చట్టం 2013 పరిధిలోకి వస్తాయి. వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ రంగంలో పనిచేసే మహిళా కార్మికులు, ఇంటిపని చేసేవారు మొదలైన వారంతా ఈ చట్ట పరిధిలోకి వస్తారు. మీరు గ్రామీణ ప్రాంతం వారు కనుక మీకు సంబంధించి, ఈ చట్టాన్ని అనుసరించి ఒక లోకల్ కంప్లైంట్స్ క మిటీ ఉంటుంది. దానిలో ఒక చైర్‌పర్సన్, న లుగురు సభ్యులు ఉంటారు. మీరు నేరుగా వారిని సంప్రదించవచ్చు. లేదాప్రతి మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు. వారికి రాతపూర్వకంగా విషయం తెలియజేస్తే దానిని వారంలోగా లోకల్ కంప్లైంట్స్ కమిటీకి పంపిస్తారు. ఆ కమిటీలో ఎక్కువ మంది మహిళలే ఉంటారు. చైర్‌పర్సన్ కూడా మహిళే ఉంటారు. మీరు వెంటనే అంగన్‌వాడీ కార్యకర్తలను కానీ, మహిళా మండలి వారిని కానీ సంప్రదించండి. వారు వివరాలు తెలియజేస్తారు. మీ ఫిర్యాదు అందిన వెంటనే మిమ్మల్ని వేధించే వ్యక్తికి నోటీసులిచ్చి పిలిపిస్తారు. తన ప్రవర్తనను మార్చుకుంటానని చెబితే, బాధితులకు క్షమాపణ చెప్పించి, రాతపూర్వకంగా హామీ పత్రం తీసుకుని వదిలి వేస్తారు. లేదంటే విచారణ చేపట్టి, మీ తోటివారెవరైనా సాక్ష్యం ఆధారంగా, వేధించిన కాంట్రాక్టర్ వాదనలు విని, నిజంగానే లైంగిక వేధింపులు జరిగాయని భావిస్తే, రిపోర్టు తయారు చేసి, అతనిపై చర్య తీసుకోవలసిందిగా పై అధికారికి తెలియజేస్తారు.
వారు తగిన చర్యలు తీసుకుంటారు. కొంత నష్టపరిహారాన్ని కూడా ఇప్పిస్తారు లేదా మీరు పనిచేసే ప్రదేశంలోకి రాకూడదని ఆదేశిస్తారు. అతనిని కాంట్రాక్టర్‌గా తీసివేయమని భూస్వామికి ఆదేశాలు ఇస్తారు. వేధింపులు తీవ్రంగా ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్‌కి కేసు బదలాయిస్తారు. అప్పుడు పోలీసులు ఐ.పి.సి. సెక్షన్ 354, 509 ప్రకారం చర్యలు తీసుకొని ఎఫ్.ఐ.ఆర్. చేసి, రిమాండ్‌కు పంపుతారు. మహిళల మానమర్యాదలకు భంగం వాటిల్లే లాగా ప్రవర్తించటం, అవమానకరంగా మాట్లాడటం ఆ సెక్షన్ల ప్రకారం నేరాలవుతాయి. మీరు మీ తోటి మహిళా కార్మికుల సహకారంతో అంతా కలిసి కేసు పెట్టండి. ఐకమత్యంగా ఉంటే విజయం మీదే.
నా పెళ్లై పదేళ్లైంది. మాకిద్దరు పిల్లలు. ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో వాళ్లు పుట్టినప్పటినుంచి మావారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇద్దరూ ఆడపిల్లల్ని కన్నానని నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం మాది. పిల్లలను పోషించే స్తోమత ఆయనకు ఉంది. కాని నా భర్త చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. నేను ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌ని. దాంతో నాకు ఈ మధ్య రెండేళ్లనుంచి పైసా కూడా ఖర్చుపెట్టడం మానేశారు. అదేమంటే ‘నీ జీతంతో సర్దుకుపో’ అంటున్నారు. ఏమిటా అని ఎంక్వయిరీ చేయిస్తే, అతను మరో వివాహం చేసుకున్నాడని తెలిసింది. అదేమంటే తను నాలుగు వివాహాలు చేసుకోవచ్చని వాదిస్తున్నారు. నన్నేం చేయమంటారు? నేను విడాకులు తీసుకునే ఉపాయం చెప్పండి.
- రజియా, హైదరాబాద్
మీరు మానసికంగా, శారీరకంగా ఎంతో ఆవేదనకు లోనై ఈ నిర్ణయం తీసుకున్నారని అర్థమౌతోంది. ముస్లిం వివాహాలు, విడాకులు చాలా సంక్లిష్టమైనవి. మగవారికి ఎన్నో రకాల తలాక్‌లు ఉన్నాయి. కానీ ముస్లిం మహిళలు విడాకులు కావాలంటే కొద్దిగా కష్టమే. ఎందుకంటే ముస్లిం స్త్రీలు కోర్టును ఆశ్రయించి పొందడానికి ఒకే ఒక చట్టం ఉంది. అదే డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939. ఈ చట్టాన్ని అనుసరించి విడాకులు పొందాలంటే, కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. కుటుంబాన్ని పోషించకుండా ఉంటే, అది కూడా విడాకులకు సహేతుకమైన కారణమవుతుంది.
మీ విషయంలో మీ భర్త గత రెండు సంవత్సరాలనుండి మిమ్మల్ని పోషించడం లేదని చెబుతున్నారు. చట్టం ప్రకారం రెండేళ్లనుండి భార్యాపిల్లల పోషణ బాధ్యత వహించకుండా నిర్లక్ష్యం చేసినా, తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురి చేసినా ఆ రెండూ విడాకులకు సహేతుకమైన కారణాలవుతాయి. కనుక మీరు ఈ చట్టాన్ని అనుసరించి పై రెండు కారణాలతో విడాకులకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ భర్త ఒప్పుకుంటే, కోర్టుకు వెళ్లకుండా మీ మతచట్టాన్ని అనుసరించి మీరిరువురూ కన్సెంట్ డైవర్స్ అంటే పరస్పర అంగీకారపూర్వకమైన విడాకులు పొందవచ్చు. మీ భర్త అంగీకరించట్లేదంటున్నారు కనక మీరు కోర్టుకు వెళ్లవలసిందే.
నాకు కోర్టు విడాకులు మంజూరు చేసి పదిరోజులైంది. దాదాపు ఐదు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం నా భర్తనుండి నాకు విముక్తి లభించింది. నా విడాకులు విషయం గురించి క్షుణ్ణంగా తెలిసిన నా మేనబావ నన్ను పెళ్ళాడతానని తొందర చేస్తున్నాడు. నాకు 30 ఏళ్లు. నాకు జీవితంలో త్వరగా సెటిల్ కావాలని, తల్లినవ్వాలని కోరికగా ఉంది. మేము వెంటనే పెళ్లి చేసుకోవ చ్చా?
- వి.శోభ, నాగర్ కర్నూల్
చూడమ్మా! ఐదు సంవత్సరాలు విడాకులకోసం పోరాటం చేశావు. ఒక నెలరోజులపాటు ఓపిక పట్టలేవా? మీది కన్సెంట్ డైవోర్స్ అయితే వెంటనే మీరు వివాహం చేసుకోవచ్చు. కానీ మీది క న్సెంట్ డైవోర్స్ కాదని తెలుస్తోంది. కనుక సెక్షన్ 19, ఫ్యామిలీకోర్ట్ యాక్ట్ 1984ను అనుసరించి విడాకుల డిక్రీ పొందిన 30 రోజులలోగా దానిపై అప్పీలుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ భర్త హైకోర్టుకు అప్పీలుకు వెళితే, ఆ కేసు తేలేంతవరకు అంటే అతని అప్పీలు కోర్టు కొట్టేసేంత వరకూ మీరు వివాహం చేసుకోకూడదు.
మీకు విడాకులు వచ్చి పదిరోజులయింది కదా! ఇంకా 20 రోజులు వేచి చూసి, తర్వాత వివాహమాడండి. అది కూడా, మీ భర్త అప్పీలుకు వెళ్లకుండా ఉంటేనే సుమా! అంటే 30 రోజుల కాలపరిమితి తీరిన తర్వాత కూడా అప్పీలు వేసుకోనప్పుడు.
ఆస్తి జప్తు అస్త్రంతో దిగివచ్చిన భర్త
కేస్ స్టడీ
సరస్వతి, సుధాకర్‌ల వివాహమై మూడేళ్లైంది. ఆమె గృహిణి. అతను ప్రభుత్వోద్యోగి. ఓ ఏడాది పాటు వారి కాపురం సజావుగానే సాగింది. సంక్రాంతి పండగకని ఇద్దరూ సరస్వతి పుట్టింటికి వెళ్లారు. సంక్రాంతినాడే సుధాకర్ తనకు ఆఫీసులో ఇన్‌స్పెక్షన్ ఉందని, వెంటనే వెళ్లక తప్పదని, ఓ వారం రోజులు పుట్టింటిలో గడిపి, ఆ తర్వాత ఊరికి రమ్మని సరస్వతికి చెప్పి, వెళ్లిపోయాడు. సరస్వతి పుట్టింట్లో గడిపి తిరిగి వారం తర్వాత సుధాకర్ దగ్గరకు బయలుదేరింది. తీరా ఇల్లు చేరేసరికి తాళం వేసి ఉంది. తన దగ్గరున్న తాళం చెవితో ప్రయత్నిద్దామంటే పాత తాళం స్థానంలో కొత్త తాళం ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుధాకర్ ఫోన్ ఎత్తలేదు. ఇరుగుపొరుగుని అడిగితే, సుధాకర్ ఆ ఇంటిని ఖాళీ చేశాడని తెలిసింది. దిగ్భ్రాంతి చెందిన సరస్వతి నేరుగా సుధాకర్ పని చేసే ఆఫీసుకు వెళ్లింది. అతను సెలవులో ఉన్నాడని తెలిసి మరో షాక్. గత్యంతరం లేక పుట్టింటికి తిరుగు ప్రయాణమైంది. ఆరా తీయగా సుధాకర్ అతని తలిదండ్రుల ఇంట్లో దొరికాడు. తనకు సరస్వతి అంటే ఇష్టం లేదని తెగేసి చెప్పాడు. అతని అమ్మానాన్న తమకేమీ సంబంధం లేదని చేతులెత్తేశారు. ఆశ చావని సరస్వతి, కుటుంబ న్యాయస్థానంలో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసు వే సింది.
ఏ కారణం లేకుండా భర్త తనతో కాపురం చేయకుండా వేరుగా ఉంటున్నాడని, తమ దాంపత్య హక్కులను పునరుద్ధరించమని కోరింది. అకారణంగా సుధాకర్ సరస్వతిని దూరంగా ఉంచాడని కోర్టు విచారణలో తేలడంతో సరస్వతిని కాపురానికి తీసుకెళ్లవలసిందిగా సుధాకర్‌కు డిక్రీ జారీ చేశారు. కానీ సుధాకర్ పెడచెవిన పెట్టడంతో మరలా న్యాయవాదిని ఆశ్రయించింది సరస్వతి. మిగతా డిక్రీల మాదిరిగా ఈ డిక్రీని అమలుపరచమని ఆదేశించేందుకు కోర్టుకు అవకాశం లేదని, ఓ ఏడాదిపాటు వేచి చూసిన తర్వాత ఇక విడాకులకైనా వెళ్లవచ్చునని, లేకుంటే అతనికి ఆస్తిపాస్తులేమైనా ఉంటే, వాటిని జప్తు చేయవలసిందిగా కోర్టును ఆశ్రయించవచ్చునని న్యాయవాది తెలిపారు. గుండె రగులుతున్న సరస్వతి అతని పేరు మీదగల త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌ను అటాచ్ చేయమని కోర్టుని ఆశ్రయించింది. జప్తు ఆర్డర్లు చూసుకున్న సుధాకర్ తనను క్షమించమని, ఏదో అయోమయంలో ఉండి పొరపాటు చేశానని, కాపురానికి రమ్మంటూ కాళ్లబేరానికి రావడంతో సరస్వతి సంతృప్తిగా నిట్టూర్చింది.
ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్
ఫ్యామిలీ కౌన్సెలర్