ఆరాగించండి | Health Food of Ragi Ambali,Ragi laddu | Sakshi
Sakshi News home page

ఆరాగించండి

Published Sat, Sep 24 2016 12:42 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

ఆరాగించండి

ఆరాగించండి

మాగిన పండులా మేను మిలమిలలాడటం ఎలా?
ఒళ్లు చేయకుండా తీగలా సాగడం ఎలా?
ఆరోగ్యం కోటలో పాగా వేయడం ఎలా?
రాగులతో చేసిన వంటలు తింటే చాలు!
మరి... అవి వండుకోవడం ఎలా?
ఏముంది మన ఫ్యామిలీ చదివితే చాలు.

 
 
రాగి అంబలి
కావలసినవి:
రాగిపిండి - అరకప్పు; ఉల్లి తరుగు- అరకప్పు
పచ్చిమిర్చి తరుగు- ఒక చెంచా; జీలకర్ర పొడి- ఒక చెంచా
కరివేపాకు- ఒక రెమ్మ ; కొత్తిమీర తరుగు - ఒక కప్పు
ఉప్పు- తగినంత; మజ్జిగ- రెండు కప్పులు

తయారీ: రాగిపిండిలో ఒక కప్పు నీరు కలపాలి. ఈ ద్రవాన్ని అరలీటరు మరుగుతున్న నీటిలో పోసి అడుగు పట్టకుండా గరిటెతో కలుపుతూ ఐదారు నిమిషాల సేపు ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మజ్జిగ, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు కలపాలి. రుచి ఇనుమడించాలంటే కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇది ఎండాకాలం వేసవి తాపాన్ని తగ్గించడానికి బాగా పనికొస్తుంది.
 
రాగి- మెంతి రొట్టె
కావలసినవి:
రాగిపిండి - ఒక గ్లాసు
గోధుమ పిండి- పావు గ్లాసు; ఉప్పు - తగినంత
ఉల్లి తరుగు- అర కప్పు; మెంతి ఆకులు- ఒక కప్పు
పచ్చిమిర్చి తరుగు- రెండు చెంచాలు
అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా; జీలకర్ర- ఒక చెంచా
నూనె లేదా నెయ్యి - కాల్చడానికి తగినంత
 
తయారీ:
వెడల్పాటి గిన్నెలో రాగిపిండి, గోధుమపిండి తీసుకుని అందులో ఉల్లితరుగు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, మెంతికూర, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి, నీటిని పోస్తూ చపాతీల పిండిలా కలపాలి. పిండి మీద తడి వస్త్రాన్ని కప్పి 15 నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత పిండిని పెద్ద నిమ్మకాయంత గోళీలు చేసుకోవాలి.
 
అట్ల పెనం వేడి చేయాలి. పిండి ముద్దలను రొట్టెలుగా వత్తి పెనం మీద వేసి కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చాలి. వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. ఘాటుగా కావాలంటే చట్నీతో తినవచ్చు.
 
గమనిక:  ఈ రొట్టెలను వత్తడం చాలా నైపుణ్యంతో కూడిన పని. అరిటాకు మీద వేసి చేత్తో వత్తుకోవచ్చు. చపాతీల పీట మీద రొట్టెల కర్రతోనూ చేసుకోవచ్చు. గోధుమ పిండి లేకుండా కూడా చేసుకోవచ్చు. కానీ కేవలం రాగి పిండితో చేస్తే పెళుసుగా విరిగిపోతుంటాయి. కాబట్టి గోధుమపిండి కలుపుకుంటే రొట్టెలు విరగవు.  మధుమేహంతో బాధపడే వాళ్లు ఆహారంలో ఒక పూట రాగి రొట్టెను చేర్చుకోవచ్చు.
 
రాగిలడ్డు
కావలసినవి:
రాగిపిండి- ఒక కప్పు; బెల్లం- ఒక కప్పు
వేయించిన నువ్వులు- అర కప్పు; నెయ్యి- మూడు చెంచాలు
ఏలకుల పొడి- ఒక చెంచా; జీడిపప్పు, కిస్‌మిస్ - పిడికెడు
 
తయారీ:
* మందపాటి బాణలిలో రాగిపిండిని (నూనె లేకుండా) దోరగా వేయించాలి.
* నేతిలో జీడిపప్పు, కిస్‌మిస్ వేయించి రాగిపిండిలో వేయాలి.
* పావు కప్పు నువ్వులను మిక్సీలో కాస్త పలుకుగా పొడి చేసుకోవాలి. అందులోనే బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి మరోసారి బ్లెండ్ చేస్తే సమంగా కలుస్తుంది. నువ్వులలోని నూనె, బెల్లంలోని తేమ కలిసి మిశ్రమం ముద్దగా అవుతుంది. ఈ మిశ్రమాన్ని రాగిపిండిలో వేసి బాగా కలపాలి.
* ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని లడ్డులుగా చేయాలి. లడ్డును వేయించిన నువ్వులలో ముంచి, నువ్వులు లడ్డుకు పట్టించాలి.
 
గమనిక: మిశ్రమం తయారైన తర్వాత అది లడ్డు కట్టడానికి అనువుగా లేదనిపించే ప్రమాదం లేకపోలేదు. పిండి మరీ గట్టిగా ఉంటే మరిగించిన పాలను వేసి కలుపుకోవాలి. మరీ జారుడుగా ఉంటే మరి కొంత రాగిపిండిని లేదా నువ్వుల పొడిని కలుపుకోవాలి.
పాలు వేసి కలిపినప్పుడు ఎక్కువ రోజులు నిల్వ చేయరాదు.
 
 
రాగిజావ
కావలసినవి:
రాగిపిండి- ఒకకప్పు
బెల్లం పొడి- ఒక కప్పు
ఏలకుల పొడి- అరచెంచా
బాదంపప్పు, పిస్తా- నాలుగు పలుకులు
కాచిన పాలు - ఒక కప్పు
 
తయారీ: రాగిపిండిని ఆరు కప్పుల నీటిలో వేసి కలపాలి. తర్వాత మీడియం మంట మీద పెట్టి పిండి అడుగుకు అంటకుండా గరిటెతో కలుపుతూ ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. ఇందులో బెల్లం పొడి, ఏలకుల పొడి, బాదం, పిస్తా పలుకులు వేసి సన్నమంట మీద మరో మూడు నిమిషాల సేపు ఉడికించి దించేయాలి. చల్లారిన తర్వాత పాలు కలుపుకుంటే రాగి మాల్ట్ లేదా రాగి జావ రెడీ.
 
గమనిక: మధుమేహం ఉన్న వాళ్లు రాగిమాల్ట్ బెల్లం లేకుండా చేసుకోవచ్చు. పిల్లలు మరింత తియ్యగా ఇష్టపడతారనుకుంటే బెల్లం మోతాదు పెంచుకోవచ్చు.
 
మాల్ట్ తయారీ: రాగిమాల్ట్ తయారీకి రాగిపిండి తయారు చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. రాగులను కడిగి రాత్రంతా నానబెట్టి వడబోసి నూలు వస్త్రంలో మూటగట్టాలి. మొలకలు వచ్చిన తర్వాత ఎండబెట్టి మరపట్టించాలి. మొలకెత్తిన రాగుల పిండితో చేసిన జావను మాత్రమే మాల్ట్ అనాలి. మొలకెత్తించిన ధాన్యంలో పోషకాలు పెరుగుతాయి.
 
రాగి కుడుములు
కావలసినవి: రాగిపిండి- ఒక కప్పు; బెల్లం - ఒక కప్పు
కొబ్బరి కోరు- అర కప్పు; నెయ్యి - రెండు చెంచాలు
ఏలకుల పొడి- అర చెంచా
 
తయారీ: రాగిపిండిని బాణలిలో వేసి సన్నమంట మీద (నూనె లేకుండా) దోరగా వేయించాలి. అందులో కొబ్బరి కోరు కలిపి పక్కన ఉంచాలి.
* బెల్లాన్ని లేతపాకం పట్టాలి. ఇప్పుడు అందులో రాగిపిండి- కొబ్బరి మిశ్రమం, ఏలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. చపాతీల పిండిలా ఉండాలి. అవసరమైతే పిండి కలిపేటప్పుడు మరికొంత వేడి నీటిని చల్లుకోవచ్చు.
* చేతికి నెయ్యి రాసుకుని పిండిని నచ్చిన ఆకారంలో చేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి మీద పది నిమిషాల సేపు ఉడికించాలి.
 
పాకం తయారీ: బెల్లంలో పావు కప్పు నీటిని పోసి కరిగిన తర్వాత వడపోయాలి. బెల్లంలో చిన్న రాయి, చెరకు పీచు వంటివి ఉంటే వేరవుతాయి. ఇప్పుడు స్వచ్ఛమైన బెల్లం నీటిని మీడియం మంట మీద కలుపుతూ ఉడికించాలి. మిశ్రమాన్ని వేళ్లతో తాకినప్పుడు వేళ్లకు అతుక్కోవాలి.
 
షెఫ్ : రాంబాబు
కర్టెసీ : క్రాంతి కుమార్ రెడ్డి, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement