జీవితం ఒక ధ్యానం
అంతర్జాతీయ యోగా దినోత్సవం!
నేను నా దైవం
ఓ దండం పెట్టో టెంకాయ కొట్టో విభూతి రాసుకునో ఇవాళ్టి డ్యూటీ అయిపోయిందని.. గాడ్ చాలా హ్యాపీ అని.. ఇక.. ‘డే’ అంతా మనకు వర్కవుట్ అవుతుందని అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి నిత్యం దేవుణ్ణి తలచుకోకపోయినా ప్రతి క్షణం దైవస్తుతి చేయకపోయినా... ప్రతి కార్యం ఒక ధ్యానం అయితే ప్రతి సంకల్పం ఒక పూజ అయితే అదే.. యోగా అంటున్నారు భూమిక.
ఎప్పుడూ ప్రశాంతంగా, నవ్వుతూ, కామ్‌గా కనిపిస్తుంటారు. అదే మీ అందం రహస్యమా?
దేవుడే ఆ క్రెడిట్ నాకు ఇచ్చాడు. డివైన్ పవర్‌ని బాగా నమ్ముతాను. ఆ పవర్‌తోనే సంభాషిస్తుంటాను. ఇదే ధ్యానం అనొచ్చు. నేను నాదైన లోకంలో ఉండటానికి ఒక సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించుకుంటాను. నాకు నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నాను. పనిలో ఉన్నంతసేపు పని. తర్వాత నా వ్యక్తిగతం. షూటింగ్స్‌కి వెళితే నా వ్యక్తిగత విషయాలు అక్కడకు తీసుకెళ్లను. అలాగే ఇంటికి వస్తే బయటి విషయాలు లాక్ చేసేయడమే. మరొకటి... మా నాన్నగారి నుంచి ఇలాంటి ప్రవర్తన వచ్చి ఉంటుంది. త్వరగా ఆవేశపడటం, ఆందోళన చెందడం వంటివి ఆయనలో నేను చూళ్లేదు. బాగా పుస్తకాలు చదువుతారు. ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు ఎక్కువ. నాకూ పుస్తకాలంటే చాలా మక్కువ. మనల్ని మనం తెలుసుకునేలా చేస్తాయి. ఇలా ఉండటానికి ఆ తత్త్వమే కారణం అయ్యుంటుంది.
ఆధ్యాత్మిక భావనలు మీలో ఎక్కువ అనిపిస్తున్నాయి? పూజలు బాగా చేస్తారన్నమాట.
మా అమ్మ పూజలు బాగా చేస్తారు. అందరు దేవుళ్లకు ప్రసాదాలు చేస్తారు. నాకు అవి బాగా ఇష్టం. అయితే, నా వరకు నేను రోజూ ఏదో గంటో, రెండు గంటలో పూజ చేసి అక్కడితో పూర్తయిపోయిందనుకోను. రోజంతా దేవుడికి దగ్గరగా ఉండటం. అర్ధరాత్రి మెలకువ వచ్చినా దైవ ధ్యానం మదిలో ఉండటం. అదే నాకు తెలిసింది.
మౌనంగానే ఎదగమని... తెలుగువారి హృదయాలలో నిలిచిపోయారు. దీని నుంచి మీరేం నేర్చుకున్నారు?
ఈ పాట నాకు చాలా ఇష్టం. ఈ పాటతో పాటు కొన్ని జ్ఞాపకాలు కూడా అలాగే ఉండిపోయాయి. చూపులేని వారి పెర్‌ఫార్మెన్స్‌ని దగ్గరగా ఉండి చూశాను. అద్భుతం. అప్పుడనిపించింది దేవుడు ఒకటి కావల్సినది ఇవ్వలేదు అని నిందిస్తాం. కానీ, అంతకంటే విలువైనవి వెయ్యింతలు ఇస్తాడు అనిపించింది.
మీకు దేవుడున్నాడనిపించిన సంఘటన..
నా పదిహేడేళ్ల వయసులో మా కుటుంబంతో కలిసి ముంబయ్ నుంచి దౌలతాబాద్ ట్రైన్‌లో బయల్దేరాను. ఆ ప్రయాణంలో నేను నిద్రపోతున్నాను. అది నాసిక్ వెళ్లే ట్రెయిన్. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా దౌలతాబాద్‌లో దిగిపోయారు. నేను లేచే టైమ్‌కి నాసిక్‌లో ఉన్నాను. అప్పుడు విషయం చేరవేయడానికి ఫోన్ సదుపాయం లేదు. తిరిగి వెళ్లడానికి చేతిలో డబ్బుల్లేవు. పైగా కొత్త ప్లేస్! ఆందోళన పడ్డాను. తిరిగి మా కుటుంబాన్ని కలుస్తానా లేదా అనుకున్నాను. అక్కడ ఒక దంపతులు నేను తిరిగి మా పేరెంట్స్‌ను చేరుకోవడానికి సాయం చేశారు. ఉదయం 10 గంటల సమయంలో అలా తప్పిపోయిన నేను (నవ్వుతూ) రాత్రి ఏడు గంటలకు అమ్మవాళ్లను చేరుకున్నాను. అప్పుడనిపించింది దేవుడు వెళ్లేదారిని ఏర్పాటు చేసినట్టే తిరిగొచ్చేదారినీ పెట్టి ఉంటాడు అని.
భయంతో దేవుణ్ణి ప్రార్థంచిన సందర్భం..
‘ఒక్కడు’ సినిమా షూటింగ్ సమయంలో నలభై అడుగుల ఎత్తు నుంచి జంప్ చేయాల్సిన సీన్ ఉంది. కింద డన్‌లప్ బెడ్స్ అమర్చారు. కాళ్లతో కాకుండా బాడీ అడ్డంగా పడేలా జంప్ చేయాలి. ‘చేస్తాను’ అని చెప్పాను. కానీ, లోపల విపరీతమైన భయం. కెమరా రోల్ అవుతోంది. కళ్లుమూసుకున్నాను. దేవుణ్ణి ప్రార్థించాను. జంప్ చేశాను. మోకాళ్లు గీరుకుపోవడం వంటివి అయ్యాయనుకోండి. ఆ టైమ్‌లో ఎంత భయపడ్డానో..!
మీరు భయంగా ఉన్నప్పుడల్లా దేవుడు మీకు సాయం చేశాడు.. మీకు – దేవుడికీ ఉన్న కనెక్టివిటీ ఏంటి?
స్నేహితుడు, అధ్యాపకుడు, రక్షకుడు.. ఇలా అన్నీ దేవుడే అనుకుంటాను. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. ఊహించన ఘటనలు ఎదురవుతాయి. దేవుడు అంటే భయం కాదు. ఏది జరిగినా పై నుంచి దేవుడు చూస్తున్నాడు... అనేదానిని నేను బాగా నమ్ముతాను.
తల్లి దైవంతో సమానం... అంటారు. అమ్మ అయ్యాక ఏర్పడిన కొత్త ప్రపంచం..
నా కొడుకు యశ్‌కి మూడేళ్లు. అమ్మ అయ్యాక జీవితంలో చాలా మార్పులు చూశాను. బిడ్డకు అన్నం పెట్టడం దగ్గర నుంచి ప్రతిదీ అబ్బురంగానూ, అద్భుతంగానూ ఉంటుంది. ఇది దేవుడి సృష్టిలో చాలా విచిత్రమైన అనుభవంగా నాకు అనిపిస్తుంటుంది.
సేవలో దైవత్వాన్ని ఎలా చూస్తుంటారు?
నెలలో ఒక గంట సేపయినా వృద్ధాశ్రమాలకు, అనా«థాశ్రమాలకు వెళ్ళాలనేది నేను పెట్టుకున్న నియమం. వారిని కలుసుకున్నప్పుడు దైవాన్ని కలిసిన భావన కలుగుతుంది. వారికి నా వంతుగా డబ్బు లేదా టైమ్ కేటాయించడం వంటి వాటితో సాయం చేసి వస్తుంటాను.
మీ వారు (భరత్‌ఠాకూర్) యోగా గురు. మీరూ ఫిట్‌నెస్‌కి యోగా వంటివి సాధన చేస్తుంటారా?
లేదు. నా వరకు గురువు ఎవ్వరూ లేరు. సూర్యనమస్కారాలు చేస్తాను. నాకు తెలిసి యోగా అంటే అదొక వ్యాయామం కాదు. మనలోకి మనం అంతర్ముఖులు అవవడం. అదే నేను చేసే యోగా!