ఔట్డోర్ ఆటలే అన్నిటికన్నా బెస్ట్!
పూర్వం పిల్లలు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండే స్నేహితులతో కలిసి హాయిగా ఆటలాడుకునేవారు. కబడ్డీ, కోతికొమ్మచ్చి, నేలాబండా, ఒంగుళ్లు- దూకుళ్లు, క్రికెట్టు, కర్రాబిళ్లా, ఏడుపెంకులాట, రాళ్లాట వంటివి వారు ఆడుకునే ఆటల్లో ఉండేవి. అయితే ఈ కాలం పిల్లలు బయటికెళ్లి ఆడుకోవడం తగ్గిపోయింది. అస్తమానం టీవీలకూ, కంప్యూటర్లకూ అతుక్కుపోతున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే ఊబకాయం, కళ్లద్దాల బారిన పడుతున్నారు. తలిదండ్రులు కూడా పిల్లలు బయటికెళ్లి అటలాడుకుని ఏ కొట్లాటో తెచ్చిపెట్టేకంటే, ఓ సిస్టమ్ వాళ్ల ముందు పడేస్తే సరిపోతుంది, హాయిగా కళ్ల ముందే ఉంటారు కదా అని అనుకుంటున్నారు.
అయితే అది చాలా తప్పు. ఎందుకంటే బయటికెళ్లి ఆటలాడుకునే పిల్లల కు శారీరక వ్యాయామంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందట. తెలివితేటలు, సోషల్ స్కిల్స్ పెంపొందుతాయట. ఎగరడం, దుమకడం, సైక్లింగ్ చేయడం, మోటుగా ఆటలు ఆడటం వంటి వాటి వల్ల వారిలో ఐక్యూ పెరుగుతుందట. సాధారణ అధ్యయనం చెబుతున్న మాటలు కావివి. యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో బాలల శారీరక, మానసిక ఆరోగ్యాలపై మేటి శాస్త్రవేత్తలు తేల్చిన పరిశోధనాంశాలు.
వీరే కాదు, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ రిసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు కూడా పిల్లలను ఔట్‌డోర్ గేమ్స్ ఆడుకోవడాన్ని తలిదండ్రులు తప్పక ప్రోత్సహించాలంటున్నారు. అలా ప్రోత్సహించబట్టే కదా మొన్నటికి మొన్న పి.వి. సింధు, సాక్షి మాలిక్ వంటి వారు ఒలింపిక్ గేమ్స్‌లో మన పరువు నిలబెట్టింది! అందుకే ఎప్పుడూ చదువు చదువు అని పిల్లల్ని సతాయించకుండా, వారిలో ఉన్న ఇతర సామర్థ్యాలని కూడా వెలికి తీయడం బెస్టంటున్న సర్వే రిపోర్టులను కూడా కాస్త తలకెక్కించుకోక తప్పదు మరి!