జీవితం అరిగిపోయిందని.. సారం కరిగిపోయిందని.. స్వప్నం చెదిరిపోయిందని.. ఆశ ఇంకిపోయిందని.. అవకాశం ఆవిరైపోయిందని.. నడివయసు నైరాశ్యం నుంచి బయటపడ్డ నలుగురు ఓహ్.. బేబీల కథ ఇది!!
బేబీకి డెబ్బై ఏళ్లు. మంచి గాయని కావాలనేది చిన్నప్పటి నుంచీ ఉన్న లక్ష్యం. సంగీతమూ నేర్చుకోవడానికి వెళ్తుంది. కాని సంప్రదాయ కుటుంబంలోని తండ్రి.. పాటలుగీటలు అంటూ ఆడపిల్ల బయటకు వెళ్లడమేంటంటూ ఆమె చెంపలు వాయించి ఇంట్లో కూర్చోబెడ్తాడు. తండ్రిని ఏమీ అనలేక దేవుడిని తిట్టుకుంటుంది. ప్రేమించిన అబ్బాయిని పెళ్లిచేసుకొని అయినా తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనుకుంటుంది. కాని పెళ్లయిన యేడాదికే భర్త చనిపోతాడు. అనుకున్న జీవితం అటకెక్కి.. అనుకోని కష్టం ముందు పడ్తుంది. వంటలు చేసుకుంటూ కష్టపడి పిల్లాడిని పెంచి పెద్దచేస్తుంది. అతనికీ పెళ్లయి.. పిల్లలు పుడ్తారు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న బాధ్యతల్లో తనను ముంచుతున్న దేవుడిని తిట్టుకోవడం తప్ప బేబీకి తనకంటూ ఏమీ మిగిలి ఉండదు.
గాయని కావాలనుకున్న.. కావాలన్న తపన మెదడు అట్టడుగుపొరల్లో రగులుతూనే ఉంటుంది. లైఫ్‌పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంటుంది. అప్పుడు దేవుడు ఆమెకు ఓ అవకాశం ఇస్తాడు.. డెబ్బై ఏళ్ల ఆ ముసలావిడకు ఇరవై ఏళ్ల యవ్వనాన్నిస్తాడు. నచ్చినట్టు బతుకుతూ అనుకున్నది సాధించమని ఆశీర్వదిస్తాడు. ఆ బేబీ గాయని అవుతుంది. ఇది ‘‘ఓహ్.. బేబీ’’ సినిమా సారాంశం క్లుప్తంగా! రియల్‌లైఫ్‌లో బేబీ లాంటి వాళ్లు చాలామందే ఉంటారు. ఎటొచ్చీ ఆమెకు దొరికిన వరమే.. ప్రాక్టికల్‌గా అసాధ్యం. అయినా రెండు జీవితాలు అనుభవించిన, ఆస్వాదించిన వాళ్లుంటారు.. ఉన్నారు కూడా. పెళ్లి, పిల్లల పెంపకంతో తమ ఆశలు,ఆశయాలు ఆవిరైపోకుండా.. హ్యాండ్‌బ్యాగ్‌లో అట్టేపెట్టుకొని.. మూడుముళ్ల బంధం ముడి వేసిన కర్తవ్యాన్ని నిర్వర్తించాక ఆ హ్యాండ్‌బ్యాగ్‌ను భుజానికి, అందులోని ధ్యేయాన్ని మనసుకు బదిలీ చేసుకొని సా«ధించిన అమ్మల గురించే ఈ కథనం..
గోల్స్ అంటే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడం, ఫ్రీదా ఖాలో అంతటి ఆర్టిస్ట్ అవడం, ఇంగ్లిష్ చానల్ ఈదడం, ప్రపంచమంతా పాదయాత్ర చేయడం, క్లియోపాత్ర కిరీటాన్ని పెట్టుకోవడం, టాటా, బిర్లా, అంబాని, అదానీలకు దీటుగా వ్యాపారం చేయడం లాంటివే కానఖ్ఖర్లేదు కదా... చిన్నప్పటి నుంచీ తాము అనుకున్నవి మ్యారేజ్ వల్ల దారి తప్పి.. మళ్లీ వాటి జాడను పట్టుకొని గాడిలో పెట్టుకునేవి కూడా కదా! అలాంటి వాటినే అఛీవ్ చేసిన రియల్ లైఫ్ ఓహ్ బేబీలు వీళ్లు...
మిసెస్ ఫొటోజెనిక్.. కుంభం రేణుక
కుంభం రేణుక వయసు నలభై పైనే. పుట్టింది తెలంగాణలోని సిద్ధిపేటలో.. పెరిగింది కరీంనగర్‌లో. రేణుకను డాక్టర్ చెయ్యాలని ఆమె తండ్రి అనుకున్నారు. రేణుకకేమో అందాల పోటీల్లో పాల్గొనాలని, ఒక్కసారైనా ర్యాంప్ మీద నడవాలనే ఆకాంక్ష. కాని ఆమె సంప్రదాయ కుటుంబం ఆ కోరకను కనీసం ఆమె కలలోకి కూడా రానివ్వకుండా మెడిసిన్ ఎంట్రన్స్ కోసం కోచింగ్‌కు పంపించింది. కష్టపడ్డా ఫలితం దక్కలేదు. దాంతో బీఎస్సీ మైక్రోబయాలజీలో చేరింది. అప్పుడే మంచి సంబంధం రావడంతో వెంటనే పెళ్లిచేసేశారు. అయినా చదువును కంటిన్యూ చేశారు రేణుక. భర్త కుంభం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. తరచూ ట్రాన్స్‌ఫర్స్ అవుతూన్నా చదువుకి ఫుల్‌స్టాప్ పెట్టలేదు. అందాల పోటీల్లో పాల్గొనాలనే కోరికా పోలేదు. పిల్లలు పుట్టారు. పెద్దవాళ్లవుతున్నారు. టీవీల్లో బ్యూటీ కాంటెస్ట్‌లు ఎప్పుడు టెలికాస్ట్ అయినా ఆసక్తిగా చూసేవారు. వయసు రీత్యా కాస్త ఒళ్లు రావడంతో శ్రద్ధగా వ్యాయామం చేసి బరువు తగ్గారు. యోగాలో తర్ఫీదు తీసుకున్నారు.దాంతో ఆమె ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనలియర్‌కు వచ్చాక.. తల్లి ఇంట్రెస్ట్ గమనించి మిసెస్ కర్ణాటక బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనమని ఎంకరేజ్ చేశాడు.
ఆ పోటీలకు సంబంధించిన వివరాలు, సమాచారం అన్నీ సేకరించి తల్లికిచ్చాడు. దరఖాస్తు చేసుకున్నాక తన భర్తకు చెప్పారు రేణుక. సరే అన్నారు ఆయన. భర్త, పిల్లల ప్రోత్సాహంతో మాగ్నా పబ్లికేషన్స్ నిర్వహించిన మిసెస్ ఇండియా పోటీల్లోనూ (ఇటీవలే) పార్టిసిపేట్ చేశారు. ఫైనల్స్‌కు చేరి మిసెస్ ఫొటోజెనిక్ ఫేస్ టైటిల్ గెలుచుకున్నారు. చిన్నప్పటి కల నెరవేర్చుకున్నారు. రేణుక సుప్రసిద్ధ చిత్రకారుడు కాపు రాజయ్య మనవరాలు. ‘‘మా తాత గొప్ప ఆర్టిస్ట్ అయినా నా మీద మా అమ్మమ్మ ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కువ. ఆవిడ చాలా స్ట్రాంగ్. పట్టుదల మనిషి. అమ్మమ్మే నాకు ఇన్సిపిరేషన్. మన సంకల్పం గట్టిదైతే పెళ్లి, పిల్లలు హార్డిల్స్ కావు, కారు. అఫ్‌కోర్స్.. ఆ రెస్పాన్సిబిలిటీస్‌తో మన ఎయిమ్ వెనకబడొచ్చు.. తర్వాత పర్‌స్యూ చేసుకోవాలి. లేకపోతే మనకు మనం మిగలం. మనల్ని మనం ప్రేమించుకోవాలి. నేను బ్యూటీకాంటెస్ట్‌లో పోటీ చేస్తున్నానని తెలిసినప్పుడు చాలా మంది చాలారకాలుగా కామెంట్ చేశారు. పట్టించుకోలేదు. విని ఉంటే నా కలను ఎక్స్‌పీరియెన్స్ చేసేదాన్నే కాదు. ఆ పోటీలో పాల్గొనడం వల్ల కొత్త ప్రపంచం తెలిసింది. చాలా మంది పరిచయం అయ్యారు. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఒక కొత్త రేణుకను చూసుకోగలుగుతున్నా. ప్రస్తుతం నా ఇంకో ఎయిమ్ మీద దృష్టిపెట్టా.. అదే యోగా ట్రైనింగ్. చాలామంది ఆడవాళ్లు పెళ్లి, పిల్లలు కాగానే అంతా అయిపోయిందని తమని తాము పట్టించుకోరు. అలాంటి వాళ్లను మోటివేట్ చేసి వాళ్లలో హెల్త్ కాన్షస్ తీసుకురావాలనుకుంటున్నా. ఓ నలుగురిని మోటివేట్ చేయగలిగినా..నేను హ్యాపీ’’ అంటారు కుంభం రేణుక.
ఆర్టిస్ట్.. నానుబాల భారతి
నానుబాల భారతి బార్న్ ఆర్టిస్ట్. స్వస్థలం కడప. ఉగ్గుపాలతో ఒంటబట్టిన కళ. భారతి వాళ్లమ్మ కూడా ఆర్టిస్టే. ఆమె ఆయిల్ పెయింటింగ్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తుంటే చూస్తూ పెరిగారు భారతి. అందుకే చిన్నప్పుడే బొమ్మలు వేయడం వచ్చేసింది ఆమెకు. స్వతహాగా అబ్బిన కళ, తల్లిని చూస్తూ పెంచుకున్న నైపుణ్యంతో అద్భుతమైన పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టారు. డిగ్రీ పూర్తయ్యే సరికి ఆమె ఆర్ట్‌కు ఓ గుర్తింపూ వచ్చింది. ఆ ప్రవృత్తిని సీరియస్‌గా తీసుకోవాలి అనే సమయానికి పెళ్లి అయిపోయింది. భర్త గండికోట రమేశ్‌కు సౌదీలో ఉద్యోగం. కొత్త చోటు, ఆమె పాతబడడానికే చాలా కాలం పట్టింది. ఈలోపు పిల్లలు. అందరి తల్లుల్లాగే ఆమెకూ పిల్లలే ప్రాధాన్యమయ్యారు. అక్కడి నుంచి భర్త ఉద్యోగం దుబాయ్‌కు మారింది. కాని ఆమె ప్రయారిటీస్ మారలేదు. కాన్వాస్, కుంచె రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. పాప యుక్తా ఫ్యాషన్ స్టడీస్‌లో డిగ్రీ, బాబు హేమంత్ ట్వల్త్ స్టాండర్డ్‌లోకి రావడంతో భారతికి కాస్త ఖాళీ సమయం దొరికింది. ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌కు వెళ్లడం స్టార్ట్ చేశారు. ఆ ఉత్సాహం, భర్త ప్రోత్సాహంతో మళ్లీ కుంచెకు కళ తెచ్చారు భారతి. అందమైన ఆయిల్ పెయింటింగ్స్‌తో తన ఉనికిని చాటుకుంటున్నారు. త్వరలోనే ఎగ్జిబిషన్ పెట్టాలనే ప్లాన్‌లోనూ ఉన్నారు. బొమ్మలే కాదు.. డ్రెస్, జ్యుయెలరీ డిజైనింగ్‌కీ భారతి క్రియేటివిటీని కేరాఫ్‌గా చెప్పుకోవచ్చు. ‘‘పెద్దయ్యాక ఏమవుతావ్ అంటే ఆర్టిస్టే అనుకునేదాన్ని. అదే నా లోకం. అయితే ఆడవాళ్లు అనుకున్నది సాధించాలంటే ముందు వైఫ్‌గా, మదర్‌గా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాతే మన గోల్. తప్పదు.. మన ప్రయార్టీస్ అలా సెట్ అయ్యుంటాయి. ఇప్పటికైనా పర్‌స్యూ చేసుకునే చాన్స్ వచ్చింది. మావారూ మంచి ఆర్టిస్టే. సో.. అర్థంచేసుకొని.. ఎంకరేజ్ చేస్తున్నారు’’ అంటారు భారతి.
బైక్ రైడర్.. కూర్మ నాగమణి
కూర్మ నాగమణి.. వయసు.. అరవై. స్వస్థలం హైదరాబాద్. బైక్ రైడింగ్ అండ్ పాలిటిక్స్ అంటే చిన్నప్పటి నుంచీ ఇంట్రెస్ట్. భర్త సహకారంతో పాలిటిక్స్‌లో అడుగుపెట్టి కౌన్సిలర్‌గా పనిచేశారు. కాని బైక్ రైడింగే తనకు అరవయ్యో యేడు వచ్చే వరకు ఆగాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి కళ్లముందు రయ్‌మంటూ టూ వీలర్స్ వెళ్తూంటే మనసు కొట్టుకునేది.. నడపాలని. కాని సాధ్యపడలేదు. పెళ్లయ్యాక కూడా ఆమె బండీ నడపాలనే కాంక్షను ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు ఆమె రాజకీయాల్లోకి రావాలనే ఇష్టాన్ని పట్టించుకున్నంతగా. నలుగురు పిల్లలు (ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి) పుట్టారు. వాళ్లూ బండి నేర్చుకున్నారు.. ఆమెకు ఆ అవకాశం రాలేదు. పెళ్లిళ్లయి కోడళ్లు, అల్లుడు వచ్చారు. స్థిరపడ్డారు. ఈలోపు ఆమె అరవయ్యోపడిలో పడ్డారు. అప్పుడు ఇక ఆగలేదు. ఈ వయసులో బండి ఏంటమ్మా అని లర్నింగ్ లైసెన్స్ కోసం వెళ్లిన ఆమెను ఆర్టీఓ సిబ్బంది నిరాశ పర్చినా రివర్స్ గేర్ వేయలేదు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కావాలని.. హార్డిల్ పెట్టినా.. దాటేశారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తెచ్చారు.. లర్నింగ్ లైసెన్స్ పొందారు. తాను బండీ నడపడమే కాక.. తన ఈడువాళ్లనూ ఎంకరేజ్ చేస్తున్నారు నేర్చుకొమ్మని. ‘‘పనులకు ఆడ, మగ తేడా ఉంటదా? ఉండదు. ఈత రావడం ఎంత అవసరమో డ్రైవింగ్ కూడా అంతే అవసరం. ఆడవాళ్లకైనా మగవాళ్లకైనా! నా ఈడు వాళ్లు కొంతమంది ముందు భయపడ్డారు. నేనే నేర్చుకోగాలేంది మీకు రాదా? అని వాళ్ల భయం పోగొట్టిన. మన పనులు మనం చేసుకుంటే ఎంత ఆనందం! ఎటైనా వెళ్లాలంటే ఇప్పుడు ఎవరిమీదా ఆధారపడాల్సిన పనిలేదు.. బండీ తీసి కిక్ కొడితే చాలు. కారు డ్రైవింగ్ కూడా నేర్చుకుంటా’’ అంటారు ఎంతో ఆత్మవిశ్వాసంతో నాగమణి.
వీ స్టార్.. షీలా జోసెఫ్
షీలా జోసెఫ్. వయసు అరవై పైనే. స్వస్థలం కేరళ. బిజినెస్‌లో రాణించాలనేది చిన్నప్పటి నుంచీ వెంటాడుతున్న కల. టీన్స్‌లోనే పెళ్లయిపోయింది. పిల్లలు, కుటుంబ బాధ్యతలు షరామామూలే. భర్త యోసెఫ్.. వీ గార్డ్ సంస్థ యజమాని. పిల్లలు స్థిరపడ్డాక.. మనసులో మాట బయటపెట్టారు షీలా భర్త దగ్గర. ‘‘వేరే ఎందుకు నాకే తోడుగా ఉండు నా వ్యాపారంలో’’ అన్నాడు భర్త. అతని మాట ప్రకారమే కొన్నాళ్లు ఆ బిజినెస్ వ్యవహారాల్లో భర్తకు తోడుగా ఉన్నారు. కాని అది ఆమెకు నచ్చలేదు. ఆమెకు గార్మెంట్ బిజినెస్ అంటే ఇష్టం.. ఇంట్రెస్టునూ. సొంతంగా పెట్టుకుంటాను అంది. భర్త దగ్గరే వడ్డీకి 20 లక్షలు అప్పు, భర్త పాత ఆఫీస్‌నే అద్దెకు తీసుకున్నారు. పది మంది ఉద్యోగులతో పని ప్రారంభించారు. ఏడాది తిరిగేలోపు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. భర్తకు వడ్డీ, రెంట్ కట్టలేని పరిస్థితి. ఇలా కాదని ఆ రేడీమేడ్ బట్టలను ఎప్పుడో తన భర్త రిజిస్టర్ చేసుకున్న వీ స్టార్ అనే లేబుల్ కింద అమ్మడం మొదలుపెట్టారు.
కొత్తలో కొంత కష్టమైనా తర్వాత సాఫీగా సాగింది. అయితే వీ స్టార్‌ని భర్త ఎలక్ట్రికల్స్ కంపెనీ అయినా వీ గార్డ్‌కు సిస్టర్ ఆర్గనైజేషన్ అనుకునేవారట వీ స్టార్‌ఎంప్లాయ్స్. దాంతో ఆమె వీ గార్డ్ కంపెనీ ఉద్యోగులకు సమానమైన జీతాలను తన ఉద్యోగులకూ ఇవ్వాల్సి వచ్చిందట. తర్వాత వీ స్టార్ అండర్‌గార్మెంట్స్ ప్రొడక్షన్‌నూ స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదే ఆ కంపెనీ యూఎస్‌పీ అయింది. స్త్రీల అండర్‌గార్మెంట్స్‌కి సంబంధించి వీ స్టార్ ఇప్పుడొక పాపులర్ బ్రాండ్. రెండు కోట్లతో మొదలై ఇప్పుడు 75 కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరింది. ఇది మొదలుపెట్టిన నాలుగేళ్లలో భర్త దగ్గర తీసుకున్న అప్పు తీర్చేశారు షీలా.. వడ్డీతో సహా. ‘‘కలలు.. మనలో చాలెంజింగ్ స్పిరిట్‌ను నిద్రలేపుతాయి. అదే ముఖ్యం. పెళ్లి, పిల్లలు వంటి బాధ్యతలు కూడా మన చాలెంజింగ్ స్పిరిట్‌ను స్ట్రాంగ్ చేసేవే అని నమ్ముతాను’’ అంటారు షీలా. దేవుడు వరమివ్వకపోతేనేమి.. కాలం అవకాశం ఇచ్చింది.. కల నెరవేర్చుకొమ్మని. ఇంకా యవ్వనవంతులమనే నిరూపించుకున్నారు లక్ష్యాన్ని చేరి! ‘‘ఓహ్.. బేబీ’’కే స్ఫూర్తిలా!
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment