సామాజిక సమస్యలపై స్పందించే గుణం లేకుంటే కళాకారులెలా అవుతారని ప్రశ్నించే సంధ్యామూర్తి (65) .. భారతీయ సంస్కృతికి దర్పణంగా నిలిచిన శాస్త్రీయ సంగీత, నృత్యాలలో ఎంతోమందిని నిష్ణాతులుగా తీర్చిదిద్దుతూనే మహిళాభ్యుదయ సాధన కోసం స్త్రీ చైతన్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ∙
బుడిబుడి అడుగులతోనే
నా మూడేళ్ల ప్రాయం నుండే మా నాన్నగారు పీఎస్ శర్మ నన్ను నాట్య ప్రవేశం చేయించారు. నేను అనంతపురంలోనే పుట్టి పెరిగాను. మా నాన్న అప్పట్లో లలితకళాపరిషత్తు సెక్రటరీగా ఉండేవారు. మైసూరు నుండి అనంత కొచ్చిన నాట్యకోవిదులు వరదరాజఅయ్యంగార్ వద్ద భరతనాట్యం, కూచిపూడిలో పార్వతీశం వద్ద కూచిపూడి నేర్పించారు. చెన్నైకు చెందిన అన్నామలై చెట్టియార్ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. అప్పటికి నా వయసు కేవలం ఐదేళ్లు మాత్రమే. అప్పట్లో భక్త కబీరు నాటకంలో కబీరు కుమారునిగా, భూకైలాస్ నాటకంలో బాల వినాయకునిగా నటించాను.
దేవదాసీలనేవారు
మా చిన్నప్పుడు మహిళలు రంగస్థలం ఎక్కే అర్హత లేదు. అలా చేశారంటే దేవదాసీలనో, భోగంవారనో సభ్యసమాజం భావించేది. దానికి భయపడి ఎవ్వరూ నాట్య రంగంలో ప్రవేశించలేదు. మా నాన్నగారికి కళపై ఉన్న అభిమానంతో నాకు పద్నాలుగేళ్లు వచ్చేవరకు చెప్పించి ఆ తర్వాత మానిపించారు. అది కూడా పెద్ద పెద్ద విద్వాంసులను ఇంటికే రప్పించి సంగీత నృత్యాలు నేర్పించారు. అప్పటికి ఊరంతా కలిపినా పట్టుమని పది మంది కూడా నృత్యం నేర్చుకునే వారు లేరంటే ఆశ్చర్యమనిపిస్తుంది. ఆనాటి సమాజానికి భయపడడం వల్ల ఇక నా నాట్యం ఆగిపోయిందనే భావించాను.
అప్పట్లో భరతనాట్యమే
నేను నాట్యం ప్రారంభించిన రోజుల్లో శాస్త్రీ నృత్యమంటే భరత నాట్యమే. అది కూడా పదేళ్లలోపు వారైతే ఆడపిల్లలు నేర్చుకోవచ్చు. ఆడవేషాలైనా మగవారే వేసేవారు. కూచిపూడి నాట్య సంప్రదాయమంటే యక్షగానం, వీధి భాగవతార్లు మాత్రమే వీధుల్లో ప్రదర్శించేవారు. అయితే వెంపటి చినసత్యం రాకతో కూచిపూడికి మహర్దశ పట్టింది. ప్రస్తుతం సినిమాలో ఉన్న మంజుభార్గవి, ప్రభతో పాటు శోభానాయుడు మొదలైన వాళ్లందరూ రంగస్థలం ఎక్కి కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. వారి స్ఫూర్తి కారణంగానే నేను రంగస్థలంపై ప్రయోగాలు చేయగలిగాను.
తొలి నాట్య పాఠశాల
1969లో మేము శ్రీ నృత్య కళానిలయం స్థాపించాము. బహుశా జిల్లాలోనే తొలి సంగీత, నాట్య పాఠశాల అదే కావొచ్చు. ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులు కళానిలయంలో శాస్త్రీయ నృత్యాలు నేర్చుకున్నారు. ఎంతో మంది నాట్య గురువులుగా కూడా మారారు. ముఖ్యంగా ప్రత్యూష, మహాలక్ష్మీ ‘విదూషీ’ శిక్షణ పొందారు.
విదేశాలలో ప్రదర్శనలు
నాకు పెళ్లయిన తర్వాత మా వారి ఉద్యోగరీత్యా అనేక రాష్ట్రాలు తిరిగాము. అక్కడ కూడా నేను నాట్యం నేర్పించేదాన్ని. అనంతకొచ్చేసిన తర్వాత మా శిష్యబృందంతో న్యూఢిల్లీ, పుణే, బెంగళూరు, కోల్‌కతా, ఒడిశా లాంటి అన్ని ప్రధాన నగరాలతో పాటు సింగపూర్, మలేషియా, దుబాయ్ వంటి పలు దేశాలలో ప్రదర్శనలిచ్చాము.
పరాయి రాష్ట్రాలలోనూ అనంత కీర్తి
మా ఆయన కృష్ణమూర్తి ఏపీ లైటింగ్స్‌లో జీఎంగా ఉండేవారు. అంతకు ముందు వేరే ఉద్యోగాలు చేయడం వల్ల మా పెళ్లయిన తర్వాత కేరళలోని ఆళువా ప్రాంతంలో ఉండేవాళ్లం. కొన్ని నెలల కంతా చుట్టుపక్కల వారికి సంగీతం, నాట్యం నేర్పించడానికి అవకాశం రావడంతో ఏడేళ్ల పాటు గురువుగా మారిపోయాను. అలాగే గుజరాత్‌లో ఉన్నప్పుడు నడియాడ్ ప్రాంతంలో మరో మూడేళ్లు అక్కడా టీచర్ అవతారం ఎత్తి భరత నాట్యం నేర్పించాను. ఇప్పటికీ అక్కడి నా శిష్యులు నన్ను పలకరిస్తూనే ఉంటారు. 1969 తర్వాత పూర్తిగా అనంతపురంలోనే ఉంటూ సంగీత, నాట్యాలను నేర్పిస్తున్నాను.
సమస్యల పట్ల స్పందించాలి
ప్రస్తుత సమాజం గందరగోళంగా మారుతోంది. అడుగడుగునా బాలికలకు భద్రత లేకుండా పోతోంది. అవగాహన లేని వయసులో అర్థం పర్ధం లేని ప్రేమలతో కుటుంబ బాంధవ్యాలు దెబ్బతింటున్నాయి. వీటన్నిటికి పరిష్కారమార్గం కళలు చూపిస్తాయి. సమాజంలో సమస్యలు వచ్చినపుడు.. మహిళా సమస్యలపై కళాకారులు స్పందించాలి. వారైతేనే సమస్యను సున్నిత కోణంలో వివరించగలరు. మేము బాలికలకు ఇదే విషయమై రోజూ కొంత సమయమైనా కేటాయించి మాట్లాడుతుంటాం.
– గుంటి మురళీకృష్ణ, సాక్షి, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment