కర్త.. కర్మ.. క్రియాంక | specaial stroy to priyanka chopra | Sakshi
Sakshi News home page

కర్త.. కర్మ.. క్రియాంక

Published Sun, Mar 13 2016 10:12 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

కర్త.. కర్మ.. క్రియాంక

కర్త.. కర్మ.. క్రియాంక

బయోగ్రఫీ
 
ప్రియాంక సక్సెస్‌లోని కర్త, కర్మ, క్రియ.. అన్నీ ఆమె స్వయంకృషే! పని ప్రియాంక శక్తి. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది... ఆడుతూనో, పాడుతూనో. సమాజం కోసం పాటు పడుతూనో! ప్రియాంక దగ్గర చాలా కిరీటాలు ఉన్నాయి.
అందాల కిరీటం.. సినిమాల కిరీటం.. సరిగమల కిరీటం.. సేవల కిరీటం. వీటిని మించిన కిరీటం.. ఆమె క్రియాశీలత.
అందుకే ఆమె .. క్రియాంక!

 
రెడ్! ప్రియాంకకు ఇష్టమైన రంగు. కానీ ఆమెకు ‘రెడ్ కార్పెట్’ అంటే భయం. టెన్షన్. మొన్న ఆస్కార్‌కు వెళ్లినప్పుడు కూడా ఆ ఎరుపు రంగు తివాచీని తొక్కుకుంటూ వెళ్లడానికి ఆమె కొంతసేపు మానసికంగా సిద్ధం కావలసి వచ్చింది!  చీర! ప్రియాంకకు ఇష్టమైన వస్త్రధారణ. కానీ ఆమె ఎంతో అరుదుగా మాత్రమే చీరలో కనిపిస్తారు. మోకాళ్ల దగ్గర చిరిగిన జీన్స్ ప్యాంటులో ఆమెను చూసినప్పుడు ఇంతకీ ఈమెకు ఇష్టమైనది సంప్రదాయమా? ఆధునాతనమా అనే డైలమాలో పడిపోతాం! పెళ్లి! ప్రియాంకకు వివాహ వ్యవస్థమీద ఎంతో గౌరవం ఉంది. పెళ్లిలో ఉన్నంత గాఢమైన బంధం సహ జీవనంలో ఉండదని ఆమె నమ్ముతారు. కానీ ‘నాలుగేళ్ల వయసులో’ తప్ప, ఆ తర్వాత ఎప్పుడూ ఆమె పెళ్లి ఆలోచనే చేయలేదు!
 
ఇవే కాదు...

ప్రియాంకా చోప్రాలో చాలా వైరుధ్యాలున్నాయి. ప్రకృతిలోని రమణీయత అంతా వైరుధ్యాల నుంచి వచ్చిందే. అలాగే ప్రియాంక వ్యక్తిత్వంలోని సౌందర్యం కూడా. విరుద్ధతే ప్రియాంక అందం, విజయ రహస్యం.  ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారో కచ్చితంగా చెప్పడం కష్టం. మనకైతే ఇప్పుడు థియేటర్స్‌లో కనిపిస్తున్నారు. ‘జై గంగాజల్’ ఈమధ్యనే కదా రిలీజ్ అయింది. అందులో పోలీస్ ఆఫీసర్. మరీ ఈమధ్యనైతే ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ప్రెజెంటర్ గా తెల్లటి చేప గౌన్‌లో దర్శనమిచ్చారు. ‘వెంటిలేటర్’, ‘బమ్ బమ్ బోల్ రహా హై కాశీ’, ‘ఏక్ ఓంకార్’, ‘బేవాచ్’..  ఈ నాలుగూ ఇప్పుడు మేకింగ్‌లో ఉన్నాయి. ఇవి ఆమె చేస్తున్న, తీస్తున్న సినిమాలు.  ‘ఐ లైక్ విన్నింగ్’ అని పెద్దగా నవ్వుతారు ప్రియాంక. నిజమే. నిరంతరం నడిచేవాళ్లు, నడిపేవాళ్లే చివరికి విన్ అవుతారు. మొబిలిటీ... ‘కదలడం’ ముఖ్యం ఆమెకు. ఆ చలనశీలతే ప్రియాంకను చలన  చిత్రాలనుంచి, ఆ తర్వాతి హైట్స్‌కి నడిపిస్తోంది. ఓ హైట్ హాలీవుడ్. ఇంకో హైట్ అమెరికన్ టెలివిజన్.

అప్‌డేట్ ఆమె పేరు!
‘బేవాచ్’కీ, ‘క్వాంటికో’కి మధ్య ప్రియాంక ఇప్పుడు అటో మేకప్, ఇటో మేకప్ వేసుకుంటున్నారు. క్వాటికో.. అమెరికన్ టీవీ ధారావాహిక. రెండో సీజన్ మొదలైంది. అందులో ప్రియాంక ఎఫ్.బి.ఐ. ఏజెంట్. మాంట్రియల్‌లో షూటింగ్ జరుగుతోంది. ఇక ‘బేవాచ్’. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్న అమెరికన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్. అందులో ‘విక్టోరియా లీడ్స్’ అనే పాత్రను వేస్తున్నారు ప్రియాంక.
 ప్రియాంక వయసు 33 ఏళ్లు. అందులో సగం సినిమా రీళ్లు. ప్రపంచానికి ఆమె తొలి పరిచయం 17 ఏళ్ల వయసులో. మిస్ వరల్డ్ 2000 పేజెంట్ విజేతగా ఒక తాజా పువ్వై పరిమళించారు ప్రియాంక. ఆ అందాల పోటీలు లండన్‌వి. అక్కడ నెగ్గారు ప్రియాంక. చీమ కుట్టి కొద్దిగా వాచిన ట్లుండే పెదవులతో, చురుకైన కళ్లతో ఆమె అతి కొద్ది సమయంలోనే భారతదేశపు ప్రత్యేక ఆకర్షణ అయ్యారు.
 
కశ్మీర్ గుబాళింపులు
బిహార్‌ను, ప్రియాంక చోప్రాను కలిపిచూస్తే అదొక దుష్ట సమాసంలా అనిపిస్తుంది. మనకు తెలిసిన బీహార్, మనం చూస్తున్న ప్రియాంక ఏ కోశానా కలవని పోలిక. కానీ ఆమె అక్కడే జార్ఖండ్‌లో... జార్ఖండ్‌కు జెంషెడ్‌పూర్ అనే పేరు ఉన్నప్పుడు 1982 జూలై 18న జన్మించారు. నాన్న అశోక్. అమ్మ మధు చోప్రా. ఇద్దరూ ఇండియన్ ఆర్మీలో డాక్టర్లు. అశోక్ పంజాబీ. మధు బిహారీ. ప్రేమ వివాహం. ప్రియాంక, ఆమె తమ్ముడు. ఇద్దరే పిల్లలు. తమ్ముడు ప్రియాంక కన్నా ఏడేళ్లు చిన్న. పరిణీతి చోప్రా, మీరా చోప్రా, మన్నారా.. వీళ్లు ప్రియాంక కజిన్స్.
 ఆర్మీలో ఉన్నవాళ్లకు దేశమంతా స్వస్థలమే. ఢిల్లీ, ఛండీఘర్, అంబాలా, లడఖ్, లక్నో, బరేలీ, పుణె.. ఇన్ని తిరిగారు ప్రియాంక.. అమ్మానాన్నల వెంట. లక్నోలో స్కూలు, బరేలీ లో కాలేజ్. ప్రియాంక బాల్య స్మృతులు ఉన్నది మాత్రం లేహ్ (జమ్ము కశ్మీర్) లోయలో. దేశవిదేశాల్లో ఆమె ఎక్కడ తిరిగినా ఆ లోయ నుంచి ఆ స్మృతులు ఆమెను వెంటాడుతూనే వస్తుంటాయి. అందుకే ప్రియాంక అంత ఫ్రెష్‌గా ఉంటారట.

తన కష్టమే తన కాన్ఫిడెన్స్
యూ.ఎస్.లో ప్రియాంక ఆంటీ వాళ్లు ఉండేవారు. పదమూడేళ్ల వయసులో ప్రియాంక ఆవిడ దగ్గరకు వెళ్లారు. కొన్నాళ్లు అక్కడే చదువు. ఆంటీ వాళ్లదీ ఇదే వరుస. ఒక చోట ఉండేవాళ్లు కాదు. వాళ్లతో పాటు ప్రియాంక కూడా వెళ్లేవారు. మసాచుసెట్స్‌లో ఉన్నప్పుడు ప్రియాంక వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నారు. వెస్ట్రన్‌లో శాస్త్రీయ సంగీతం. నాటకాలు వేశారు. పాటలు పాడారు. కథక్ డాన్స్ కూడా నేర్చుకున్నారు. కానీ కాన్ఫిడెన్సే కాస్త తక్కువగా ఉండేది. ఓ ఆఫ్రికన్-అమెరికన్ క్లాస్‌మేట్ ప్రియాంకను ఎప్పుడూ ఏడిపిస్తుండేవాడు. దాంతో ఆమె ఆత్మవిశ్వాసం ఇంకా దెబ్బతింది. ప్రతిదానికీ వణుకే. మాట్లాడడానికీ, మాటకు మాట చెప్పడానికీ! పైగా తన కాళ్లపై తెల్లటి మచ్చలు ఉండేవి. ఇప్పుడు అవే కాళ్లు 12 బ్రాండ్‌ల ఉత్పత్తులకు యు.ఎస్.పి. (యునీక్ సెల్లింగ్ పాయింట్) అయ్యాయి! ప్రియాంక ఏ పని చేసినా కష్టపడి చేస్తారు. అదే ఆమెను జీవితంలో నిలబడేలా చేసింది.
 
అమ్మాయి బాగుండేది!
అమెరికా నుంచి తిరిగి వచ్చేటప్పటికి ప్రియాంక వయసు 16 ఏళ్లు. పదహారేళ్ల అమ్మాయిలు బరేలీలో చాలామందే ఉన్నారు కానీ, వాళ్లలో ప్రియాంక స్పెషల్‌గా ఉండేది. బరేలీలో ‘మై క్వీన్’ అందాల పోటీలు జరిగితే వాటిల్లో ఫస్ట్ వచ్చింది. ఆ ఈవెంట్ తర్వాత ప్రియాంక వాళ్లు ఉంటున్న ఇంటికి ప్రొటెక్షన్ అవసరమైంది. అంతగా అభిమానించేవారు, ఆరాధించేవారు, ఇంటి బయట వేచి ఉండేవారు ఎక్కువయ్యారు. కాలేజీలో చేరింది కానీ, కాలేజీకి వెళ్లలేకపోయింది. సినిమాలు ఆమె ఆకర్షణలో పడిపోయి, ఆమెను చదువుకోనివ్వలేదు.
 
నాన్న కూతురు
ప్రియాంకలో ఇద్దరు అమ్మాయిలున్నారు. ఒకరు ప్రపంచానికి ఆనందాన్ని ఇస్తున్న అమ్మాయి. ఇంకొకరు కుటుంబం నుంచి ఆనందాన్ని పొందుతున్న అమ్మాయి. ప్రియాంకకు వాళ్ల నాన్నంటే ఇష్టం. తమ్ముడంటే ప్రేమ. అమ్మంటే గౌరవం. కొంచె భయం కూడా. తమ్ముడు సిద్ధార్థ్ ఇప్పటికీ ప్రియాంక ఉంటున్న ఇంట్లోనే ఉంటాడు. ప్రియాంక తండ్రి 2013లో చనిపోయారు. అంతకు ముందు ఏడాదే ప్రియాంక ఆయన చేతిరాతతో తన చేతిపై ‘డాడీస్ లిటిల్ గాళ్’ పచ్చబొట్టు వేయించుకున్నారు. ప్రియాంక తల్లి గైనకాలజిస్ట్. కూతురికి సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాక తనకు సహాయంగా ఉండడం కోసం వైద్యవృత్తిలోని తన ఆసక్తిని వదిలేసుకున్నారు ఆమె. తమిళ సినిమా ‘తమిళన్’ (2002)తో సినిమాల్లోకి వచ్చారు ప్రియాంక.
 
మనసు మరింత అందమైనది
ప్రియాంక చేసిన సినిమాల కంటే కూడా, ఆమె చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలే ఎక్కువ. ఇప్పటికే ఆమె లెక్కలేనన్ని చారిటీ షో లు, ప్రసంగాలు, కార్యక్రమాలు ఇచ్చారు. స్త్రీవాదాన్ని (ఫెమినిజం) ప్రియాంక విశ్వసిస్తారు. అనుసరిస్తారు. అవలంబిస్తారు.
 
(జీవితంపై ప్రియాంక మనోభావాలు) నిజాయితీ ధైర్యానిస్తుంది
తప్పులు, పొరపాట్లు ఊరికే జరుగుతాయా? ఏదో ఒక పని చేస్తుంటేనే కదా అవి దొర్లేది. పనిలో ఉండడం అన్నది జీవితంలోని గొప్ప విషయం. నేను చేసే తప్పులకైతే లెక్కేలేదు. తప్పులు జీవితాన్ని అందంగా మారుస్తాయి.
నేనొక మామూలు అమ్మాయిని. భయభక్తులు, వినయవిధేయతలు, భావోద్వేగాలు, కొంత తెలివితక్కువ తనం.. నాలో ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు డైనమిక్‌గా ఉండడం ఇష్టం.
నాలుగేళ్ల వయసులో నా జీవిత లక్ష్యం.. పెళ్లి చేసుకోవడం!
‘మిస్ వరల్డ్’ టైటిల్ వచ్చినప్పుడు.. నమ్మలేకపోయాను. నిద్రలోనూ ఆ కిరీటం నా పక్కలోనే ఉండేది. ఎవరైనా దొంగిలిస్తారని భయం!
స్క్రీన్ మీద కొన్ని సీన్‌లు చేయలేను. (ముద్దు సీన్‌ల గురించి).
గృహిణిగా ఉండిపోవడం అనేది కూడా నా టీనేజ్ లక్ష్యాలలో ఒకటి. అలాగే ఇంజినీర్ కావాలని, పైలట్ కావాలని ఉండేది. చివరికి సినిమాల్లోకి వచ్చేశాను. జీవితం తన లక్ష్యానికి ఎన్నుకున్న అమ్మాయిలలో నేనూ ఒక దాన్ని అనుకుంటాను.
బటర్ పనీర్, పరాటాతో పరిష్కారం కాని సమస్య ఈ లోకంలోనే లేదు.
నా బలం, బలహీనత రెండూ నా కుటుంబమే.
స్వయం కృషి, దేవుడి కరుణ.. ఈ రెండూ లేకుండా మనం దేన్నీ సాధించలేం.
ఐ హేట్ రెడ్ కార్పెట్. ఆ ఒత్తిడిని తట్టుకోలేను. అందుకే చివరి నిమిషం వరకు దాని గురించి ఆలోచించను.
నీకు నువ్వు నిజాయితీగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. నిజాయితీ నుంచి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం మళ్లీ నిన్ను, నీ నిజాయితీని నిలబెడుతుంది.
సృజనశీలురు నాకు స్ఫూర్తినిస్తారు. జీవితానికి వాళ్లు ఉద్వేగాలను, వర్ణాలను అద్దుతారు. అందుకే స్ఫూర్తి పొందుతాను.
 
(ప్రేమపై ప్రియాంక  అభిప్రాయాలు) పద్ధతి, భద్రత నాకు నచ్చవు
 
నేను ప్రేమను నమ్ముతాను. ఏళ్లూ పూళ్లూ గడిచిపోతాయి. కానీ ప్రేమ మాత్రం మారదు. మనుషులూ మారిపోతారు. కానీ ప్రేమ మారదు.
ప్రేమ అంటే అమ్మాయి, అబ్బాయి మధ్య ఉండేది మాత్రమే కాదు. ప్రతి అనుబంధంలోనూ ప్రత్యేకమైన ఒక ప్రేమ బంధం ఉంటుంది.
  సహ జీవనం మీద నాకు ఆసక్తి లేదు. పెళ్లిని ఒక దృఢమైన బంధంగా నేను విశ్వసిస్తాను.
మగాళ్ల మొదట నేను కళ్లను చూస్తాను. ఆ తర్వాత పాదాలు. పాదాలను శుభ్రంగా ఉంచుకునే మగాళ్లను నేను ఇష్టపడతాను.
  భద్రమైన జీవితానికి అలవాటు పడిన పద్ధతి గల పురుషులు నాకు నచ్చరు. నాలో రగిలే సాధనేచ్ఛకు ఆజ్యం పోసే వాళ్లు నాకు కావాలి. వాళ్లకూ నన్ను మించిన సాధనేచ్ఛ ఉండాలి. నన్నెప్పుడూ పరుగులు పెట్టించే మగాడే నా మనసు గెలుచుకోగలడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement