నిర్లక్ష్యమే బరువు | Special Story on Housewife Weight Loss | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యమే బరువు

Published Mon, Aug 19 2019 7:35 AM | Last Updated on Mon, Aug 19 2019 7:35 AM

Special Story on Housewife Weight Loss - Sakshi

మహిళలకు యోగా నేర్పుతున్న వద్దిపర్తి రాజేశ్వరి

ఫలానా వాళ్ల కోడలు ఆ ఇంటి కోసం గంధం చెక్కలా అరుగుతోంది.. అనేది కాంప్లిమెంట్‌ కాదు ..  ప్రమాదకరమైన కామెంట్‌! ఇల్లాలు బాగుంటేనే..ఇంట్లోవాళ్లు బాగుంటారు..ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియాలంటే..ఇల్లాలు తన కోసం  స్పేస్‌క్రియేట్‌ చేసుకోవాలి.. తన గురించి తను పట్టించుకోవాలి.. లేదంటే ఆ నిర్లక్ష్యం బరువుగా మారి బోలెడు రోగాలను తెస్తుంది.కుటుంబం కుంటుపడేలా చేస్తుంది.‘‘అందుకు నేనే ఎగ్జాంపుల్‌’’ అంటూ తన జీవితానుభవాన్ని చెప్పుకొచ్చారు హైదరాబాద్‌కు చెందిన యోగా టీచర్‌ వద్దిపర్తి రాజేశ్వరి.

నేను పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు మా అమ్మకి హెల్త్‌ పాడైంది. ఆవిడను కంటికి రెప్పలా కాపాడుకోవలసి వచ్చింది. అమ్మకు సేవలు చేస్తూ, నా ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేశాను. దాంతో 36 ఏళ్ల వయసులో 95 కిలోల బరువుకొచ్చేసాను. ఒబేసిటీతోపాటు వెర్టిగో, ఆర్థరైటిస్, సయాటికా, ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ అన్నీ ఒంట్లో తిష్టేశాయి. మరో నెలలో అమ్మ పోతుందనగా నా గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఇన్ని బాధల నుంచి ఎప్పటికైనా విముక్తి వస్తుందా అని. అమ్మకూ నా ఆరోగ్యం గురించి బెంగ పట్టుకుంది. ‘నీ ఆరోగ్యం జాగ్రత్త’ అని అంటూ ఉండేది. ఎవ్వరూ వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అని నా జీవితం ద్వారా తెలుసుకున్నాను. నా లైఫే అందరికీ గుణపాఠం కావాలనుకున్నాను.

యోగా సాధనతో...
ఇన్ని అనారోగ్యాలను ఎదిరించి ఆరోగ్యంగా ఉండటం కోసం యోగా సెంటర్‌లో చేరి యోగా సాధన మొదలుపెట్టా. ఏడాది తిరిగేసరికి పదిహేను కిలోలు బరువు తగ్గాను. ఆత్మవిశ్వాసం పెరిగింది. నన్నే ఉదాహరణగా చూపించి నా చుట్టూ ఉన్నవాళ్లకు యోగా నేర్పాలన్న ఆలోచన వచ్చింది. ట్రైనింగ్‌ ఇచ్చేంత స్కిల్‌ సంపాదించుకోవడం కోసం కపిల మహర్షి ‘రీసెర్చ్‌ ఫర్‌ రిసోర్సెస్‌’ లో చేరి యోగాలో డిప్లొమా చేసి, ట్రైనింగ్‌ ఇవ్వడం మొదలుపెట్టాను. వచ్చిన వాళ్ల ఆరోగ్యంలో మార్పు కనిపిస్తూండడంతో నా క్లాసెస్‌కు అటెండ్‌ అయ్యే వాళ్ల సంఖ్య పెరిగింది. యోగా నేర్చుకోవడంతోపాటు ఆడవాళ్లు తమ వ్యక్తిగత సమస్యలను చెప్పుకోవడానికి నన్ను ఓ సోలేస్‌గా భావిస్తున్నారని అర్థమైంది. వాళ్లకు సలహా ఇచ్చేంత పరిణతి నాకు ఉండాలి కదా. అందుకే సరస్వతి వాసుదేవన్‌గారి దగ్గర చేరి థెరపీ కోర్సు చేశాను. ఆ తరువాత సెయింట్‌ ఫ్రాన్సిస్కో కాలేజీలో పి.జి. డిప్లొమా ఇన్‌ కన్సల్టింగ్‌ స్కిల్స్‌ నేర్చుకున్నాను. సబ్జెక్ట్‌ మీద మంచి పట్టు వచ్చింది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే ఆడవాళ్లందరికీ మంచి కౌన్సెలింగ్‌ ఇవ్వగలుగుతున్నాను.

వీటి ఆధారంగా చేస్తుంటాను..
ఉద్యోగం, ఆహారం, కూర్చునే తీరు వంటి అనేక అంశాల మీద ఆధారపడి కౌన్సెలింగ్‌ ఉంటుంది. ముందు లైఫ్‌ స్టయిల్, మైండ్‌ లెవల్‌ గురించి తెలుసుకుంటాను. పని ఒత్తిడిలో ఉన్నవారికి బ్రీతింగ్‌ సరిగా ఉండదు. ఈ కారణంగా డయాబెటిస్, ఇన్‌డైజేషన్‌ తలెత్తుతాయి. ‘నిన్ను నువ్వు చూసుకో, నీ మీద నువ్వు శ్రద్ధ పెట్టుకో’’ అని ముందుగా చెబుతాం. వారిలో ఆత్మవిశ్వాసం ఎంతవరకు ఉందో పరీక్షిస్తాం. చాలామంది రకరకాల భయాలతో వస్తూంటారు. భయాన్ని పోగొట్టి, నలుగురిలో నిర్భయంగా మాట్లాడేలా తర్ఫీదిస్తాను. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారందరితోనూ చర్చిస్తాను. వాళ్లు తమ సమస్యను చూసే విధానంలో మార్పు తీసుకువస్తాను. ఇక్కడ కౌన్సెలింగ్‌ తీసుకున్న వాళ్లు ‘‘ఇప్పుడు ఏ సమస్య వచ్చినా బెంబేలెత్తక తేలిగ్గా తీసుకుంటూ మా పని మేం చేసుకుపోతున్నాం’’ అని చెబుతుంటే వాళ్లలో వచ్చిన మార్పుకి సంతోషమేస్తుంది.

ఇంటి ఇల్లాలితో...
ఇంటిల్లిపాదికి సర్వం అమరుస్తున్న ఇల్లాలి గురించి ఎవరూ పట్టించుకోరు. ‘తిన్నావా? సరిగ్గా నిద్రపడ్తోందా? ఎక్కడికైనా వెళ్లాలనుందా?’’ అని అడగరు. వాళ్లకోసం ఆ స్పేస్‌ నేను కల్పిస్తున్నాను. సాధారణంగా యోగా నేర్చుకోవడానికి నా దగ్గరకి 20 నుంచి 60 ఏళ్ల వయసున్న వాళ్లు వస్తూంటారు. వచ్చీరాగానే ముందు ఈ కుశల ప్రశ్నలే వేసి వాళ్ల మీద వాళ్లు శ్రద్ధపెట్టుకునేలా మౌల్డ్‌ చేస్తాను వాళ్లను. అంటే ఎదుటి వాళ్లను వినడం ద్వారా హీలింగ్‌ చేయడమన్నమాట.– వద్దిపర్తి రాజేశ్వరి

షేరింగ్‌ ఈజ్‌ కేరింగ్‌...
‘‘మా పిల్లలు సరిగ్గా చదవట్లేదని, చెప్పినమాట వినట్లేదు’’ అంటూ కొందరు తల్లులు కంప్లయింట్‌ చేస్తూంటారు. పిల్లల్లో ఉన్న పాజిటివ్స్‌ని మాత్రమే చూడమని, నెగిటివ్స్‌ని భూతద్దంలో పెట్టొద్దని చెబుతుంటాను. సింగిల్‌ పేరెంట్స్‌లో ఆత్మస్థైర్యాన్ని పెంచుతాను. ‘షేరింగ్‌ ఈజ్‌ కేరింగ్‌’ అనే పద్ధతి మీద మనసులోని మాటలను పంచుకోమని సజెస్ట్‌ చేస్తాను. మనిషిలో ఉన్న మంచి గురించి మాట్లాడటం వల్ల పాజిటి ఎనర్జీ వస్తుంది. ఎదుటి వ్యక్తి కళ్లలోకి చూస్తూ మాట్లాడటం, వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినడం వల్ల వాళ్లకో భరోసా వస్తుంది, మైండ్‌ క్లియరై దిగులు మాయమవుతుంది.– సంభాషణ: వైజయంతి పురాణపండ,ఫొటోలు: ఎస్‌. ఎస్‌. ఠాకూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement