వారింట పద్యం పుట్టింది! | Warringah twisted verse! | Sakshi
Sakshi News home page

వారింట పద్యం పుట్టింది!

Published Fri, Nov 11 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

కొప్పరపు కవులు

కొప్పరపు కవులు

స్మరణ

తెలుగువారికే సొంతమైన అవధాన ప్రక్రియలో ఘనులు కొప్పరపు కవులు. గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గరి కొప్పరం గ్రామానికి చెందిన ఈ సోదరులు 20వ శతాబ్దపు తొలి దశాబ్దాలలో తెలుగు పద్యాన్ని పరుగులెత్తించారు. కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి (జననం-1885), కొప్పరపు వేంకట రమణకవి (జననం- 1887) అనే ఈ అన్నదమ్ములు పదహారేళ్లు నిండకుండానే ఆశుకవిత్వం చెప్పి, అష్టావధానాలు చేసి ‘కవిత పుట్టిల్లు కొప్పరపు ఇల్లు’ అని పేరొందారు.

వారి పేరున 15 ఏళ్ల క్రితం స్థాపితమైన ‘శ్రీకొప్పరపు కవుల కళాపీఠం’ ఏటా సాహిత్యకారులను సత్కరించి, గౌరవిస్తోంది. నవంబర్ 12 కొప్పరపు వేంకట సుబ్బరాయకవి జయంతి సందర్భంగా క ళాపీఠం బాధ్యులు మా. శర్మ పంచుకుంటున్న విశేషాలు...

నేను కొప్పరపు సోదరుల మనవణ్ణి. మా తాతగారు కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి. నేను వారి కుమార్తె సంతానాన్ని. మా తాతగారు సుబ్బరాయ కవి తన ఐదవ ఏట కవిత్వం ప్రారంభించారు. ఎనిమిదవ ఏట శతక రచన, 12వ ఏట అష్టావధానం, 16వ ఏట శతావధానం, 20వ ఏట కేవలం 24 నిమిషాలలో 300 పద్యాలతో కావ్యం రచించారు. ప్రపంచ సాహిత్య చరిత్రలో వీరు చెప్పినంత వేగంగా కవిత్వం చెప్పినవారు లేరు. కొప్పరపు అన్నదమ్ములిద్దరూ పద్యాలలో మాట్లాడుకునేవారు. వీరు పద్యాలలో మాట్లాడుకోవడం చూసి ‘పలికిన పలుకులన్నియు పద్యములయ్యెడు యేమి చెప్పుదున్’ అన్నారు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు.

కొప్పరపు కవులు వస్తుంటే సుమారు 40 గుర్రపు బగ్గీల కాన్వాయ్ ముందు నడిచేది. వారి ఒంటి మీద నాలుగైదు కేజీల బంగారు నగ లు ఉండేవి. ఆ రోజుల్లో వారి సభకు రూ. 1116 ఇచ్చేవారు. గజారోహణం, గండపెండేర సత్కారం - అన్నీ జరిగాయి. అంత వైభోగం ఎవరికీ జరగలేదు.

నేను ఐదో తరగతి చదువుతుండగా మా తెలుగు వాచకంలో తిరుపతి వెంకట కవుల పాఠ్యాంశం ఉంది. మరి కొప్పరపు కవుల గురించి ఎందుకు లేదా అనిపించింది. అప్పటి నుంచి ఆ విషయం నన్ను వెంటాడుతూనే ఉంది. అంత గొప్ప వంశంలో పుట్టినందుకు వారి ఋణం తీర్చుకునేలా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. 2002 సెప్టెంబరు 9వ తేదీన కొప్పరపు కళాపీఠం ప్రారంభించాను.

అప్పటి నుంచి కొప్పరపు సోదరుల రచనలు సేకరించడం ప్రారంభించాను. గుండవరపు లక్ష్మీనారాయణ గారి సంపాదకత్వంలో కొప్పరపు కవుల కవిత్వం ప్రచురించి, భారత మాజీ ప్రధాని పి.వి.నర సింహారావు చేతుల మీదుగా ఆవిష్కరించాం. విశాఖపట్టణం బీచ్ రోడ్‌లో కొప్పరపు కవుల కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేశాం. ఆంధ్రదేశంలో అవధాన కవులకు విగ్రహాలు వీరితోనే ప్రారంభం.

2003లో కొప్పరపు కవుల పేరిట ప్రతిభా పురస్కారాలు ప్రారంభించాం. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పుర స్కారాలు ప్రారంభించాం. 2013 వరకు ఇచ్చాక, 2014లో జాతీయ పురస్కారంగా మలిచాం. ఆ సంవత్సరం పండిట్ జస్‌రాజ్‌కి, 2015లో హరిప్రసాద్ చౌరసియాకి అందచేశాం. ఈ సంవత్సరం మాడుగుల నాగఫణిశర్మకు అందచేశాం.

లక్కవరం సంస్థానాధీశులు రాజా మంత్రిప్రగడ భుజంగరావు బహద్దూర్ 1916లో ‘ఆధునిక కవి జీవితములు’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. అందులో కొప్పరపు కవుల గురించి ప్రస్తావిస్తూ, ‘కొప్పరపు కవులు ఆశువుగా చెప్పిన పద్యాలు నేటికి మూడు లక్షలకు పైమాటే’ అన్నారు. అయితే మాకు కేవలం వెయ్యిపద్యాలు మాత్రమే లభ్యమయ్యాయి.  కొప్పరపు కవులకు తీరని అన్యాయం జరిగిందని ఆరుద్ర తన ‘సమగ్రాంధ్ర సాహిత్యం’లో అన్నారు.

తిరుపతి వెంకట కవులకు, కొప్పరపు కవులకు అనేక వివాదాలు ఉండేవి. ఒకసారి ఒక సభలో ఒక ఆసనం దగ్గర ఈ వివాదం ప్రారంభమైంది. అంతకు మునుపు వీరు ఒకరి పట్ల ఒకరు అనురాగంతో ఉండేవారు. వీరి వివాదం వల్ల ఎందరో పద్యాలు రాశారు. పద్య సృష్టి బాగా జరిగింది. పద్యాల పంట పండింది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ వివాదం ముగిసింది. వీరికి ఒకరంటే ఒకరికి అభిమానం. ఒకరికి ఒకరు వీరాభి మానులు. ఆ తరువాత కొప్పరపు సోదరుల కుమా రులు ‘కుమార సోదరకవులు’ అవధానం చేసేట ప్పుడు ఆ కార్యక్రమాన్ని తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారు దగ్గరుండి నడిపే వారు.

అపూర్వ ఆశుకవితా చక్రవర్తులు
ఆంధ్ర పద్యసాహిత్యంలో ఆశుకవితా చక్రవర్తులంటే కొప్పరపు కవులే. గద్వాల్ నుంచి మద్రాసు దాకా వారి సభలు వందలు జరిగాయి. ఎనిమిది సెకన్లకొక పద్యం అల్లడం వారికే చెల్లింది. అదీ ‘నీలాంబుజారామ కేళీ మరాళమై...’ లాంటి ప్రబంధ శైలి పద్యాలు.ఒక్కరోజులో రెండేసి శతావధానాలు చేయడం, గంటకొక ప్రబంధం ఆశువుగా అల్లడం వారి పాండితీ వేగానికి నిదర్శనమే కాదు, ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఆశ్చర్యకరం.ఆశు ప్రబంధ నిర్మాణంలో వారు అసమాన ప్రతిభామూర్తులు. ఎలాంటి కథనైనా సరే, రకరకాల వృత్తాలలో, ప్రబంధ శైలిలో గంటకు 500 పద్యాలుగా రాసేవారు. సభలో ఏ కథనిచ్చి కావ్యంగా అల్లమన్నా, వందల పద్యాలతో ఆశువుగా కావ్యరచన చేసేవారు.

ఒకసారి మార్టేరు సభలో ఈ అన్నదమ్ములతో పందెం వేశారు. అంతే... గంటకు 720 పద్యాల చొప్పున అరగంటలో 360 పద్యాలతో ‘మనుచరిత్ర’ కథను తమదైన కొత్త ప్రబంధ కావ్యంగా ఆశువుగా అల్లారు.మరోసారి వీరవాసరంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఒక సాహిత్యసభకు అధ్యక్షత వహించారు. ఆ సభలో 3 గంటల్లో 400కు పైగా పద్యాలతో ‘శకుంతల కథ’ను ప్రబంధంగా ఆశువుగా చెప్పారు. గన్నవరంలో ఒక సభలో షేక్‌స్పియర్ ‘సింబలిస్’ నాటకాన్ని గంటన్నరలో 400 పద్యాలతో ఆశువుగా కావ్యంగా మలిచారు.

కొప్పరపు కవుల మీద ఇతర మహాకవులు చెప్పిన ప్రశంసా పద్యాలే వేయికి పైగా ఉంటాయి. కావ్యకంఠ వాశిష్ఠ గణపతి, విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా, వేటూరి ప్రభాకర శాస్త్రి - ఇలా ఎందరో వారిని ప్రశంసించారు. కొప్పరవు కవుల రచనల్లో ‘దైవసంకల్పవ్‌ు, సాధ్వీ మాహాత్మ్యవ్‌ు, శ్రీకృష్ణ కరుణా ప్రభావం, దీక్షిత స్తోత్రవ్‌ు, నారాయణాస్త్రం, సుబ్బరాయ శతకం మొదలైనవి ఉన్నాయి.ఆశువుగా చెప్పిన వేలాది పద్యాలు రికార్డు కాకపోవడం, చిన్న వయసులోనే మరణించడంతో వీరి సారస్వత సంపద ఇవాళ అందుబాటులో లేకుండా పోయింది.     - సంభాషణ: డా. పురాణపండ వైజయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement