లెక్క తేలుద్దాం
భవిష్యత్ అంతా కూడికలు తీసివేతలతో ఉంటుందని తెలియని బాల్యంలో.. లెక్కలంటే సొల్యూషన్ లేని ప్రాబ్లమ్! ఆ చిన్ని బుర్రలకు ఫార్ములాలు అంతుచిక్కనిరహస్యాలు! లెక్కల మాస్టార్ వస్తున్నారంటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. లెక్కల భయంతో క్లాస్‌కు లేటుగా వెళ్లడం, అమ్మో! కడుపునొప్పి అంటూ చల్లగా జారుకోవడం స్కూల్ డేస్‌లో అందరి అనుభవమే. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టే.. లెక్కలకూ సొల్యూషన్ చూపిస్తున్నాయి మ్యాథ్స్ ల్యాబ్స్. వినూత్న విధానంతో ముందుకెళ్తూ గణితాన్ని సులభతరం చేస్తున్నాయి.
థియరీలో కన్‌ఫ్యూజ్ చేసే సబ్జెక్టులు.. ప్రాక్టికల్స్‌తో మాత్రం పిల్లలకు బాగా అర్థం అవుతాయి. సైన్స్ పాఠాలు క్లాసులో కన్నా.. ప్రయోగశాలలోనే ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. గణితాన్ని కూడా ప్రాక్టికల్‌గా పిల్లలకు నేర్పించాలన్న ఆలోచన నుంచి పుట్టిందే మ్యాథ్స్ ల్యాబ్. ఐదేళ్ల కిందట కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ఓ సర్వేలో విద్యార్థులకే కాదు.. ఉపాధ్యాయులకు కూడా మ్యాథ్స్ కష్టంగా ఉందన్న విషయం తేలింది. పిల్లలకు ఎలా చెబితే లెక్కలు బుర్రకెక్కుతాయన్న అంశంపై పరిశోధనల ఫలితమే ఈ మ్యాథ్స్ ల్యాబ్. పెన్ను, పేపర్‌తో పనిలేకుండా, బట్టీ పట్టే అవసరం లేకుండా లెక్కలకు ఈ ల్యాబ్‌లో సొల్యూషన్స్ దొరుకుతున్నాయి.
ల్యాబ్ మేడ్ ఈజీ
అర్థమైన వారికి మ్యాథ్స్ కన్నా ఈజీ సబ్జెక్ట్ ఉండదు.. అర్థం కాని వారికి లెక్కల కన్నా కష్టం ఉండదు. మ్యాథ్స్ ఫోబియా ఉన్నవాళ్లకైతే.. స్టెప్ బై స్టెప్ చెప్పినా.. ఏదో చెప్తున్నట్టు ఫీలింగ్స్ పెడతారు. ఈ మ్యాథ్స్ ల్యాబ్స్‌లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు గణితంలోని ప్రతి అంశం ప్రాక్టికల్‌గా నేర్చుకునే వీలుంటుంది. వివిధ పరికరాలతో లెక్కలను ప్రాక్టికల్‌గా వివరించడం వల్ల విద్యార్థుల్లో నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. తొందరగా అర్థం చేసుకునే అవకాశమూ ఉంటుంది.
ప్రాబ్లమ్ సాల్వ్‌డ్..
ఈ ల్యాబ్స్‌తో విద్యార్థులకు లెక్కలపై ఉన్న భయం దూరం అవుతుందంటున్నారు మొదటి మ్యాథ్స్ ల్యాబ్ ఏర్పాటు చేసిన ‘విశ్వం ఎడ్యుటెక్ సొల్యూషన్స్’ డెరైక్టర్ పీపీఆర్ ప్రసాద్. ‘నగరంలో రెండేళ్ల కిందట మొదలు పెట్టిన మ్యాథ్స్‌ల్యాబ్‌లు ఇప్పుడు రెండు వందల వరకూ ఉన్నాయి. ఈ ల్యాబ్స్ సాయంతో నాలుగు వారాల్లో ఎక్కాలన్నీ నేర్చుకుంటున్నారు. ల్యాబ్ కోసం గది కేటాయించే పరిస్థితి లేని పాఠశాలలకు మెటీరియల్ మొత్తం ఓ ఇనుప పెట్టెలో ప్యాక్ చేసి ఇస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రతో పాటు బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్ తదితర నగరాల్లోని పాఠశాలల్లో కూడా మా మ్యాథ్స్ ల్యాబ్స్ ఉన్నాయి. విద్యార్థులే కాదు, లెక్కల టీచర్లు కూడా వీటి వల్ల రిలాక్స్ అవుతున్నారు’ అని తెలిపారు పీపీఆర్ ప్రసాద్.
నో డుమ్మాస్
మ్యాథ్స్ క్లాస్ అనగానే డుమ్మా కొట్టాలనుకుంటారు పిల్లలు. అలాంటి వాళ్లు ఇప్పుడు మ్యాథ్స్ ల్యాబ్‌లో చాలా సరదాగా గడుపుతున్నారు. ‘కొన్ని లెక్కలు ఎంత చెప్పినా అర్థం కావు. టీచర్ చెప్పినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత మరచిపోతాం. అదే సొల్యూషన్ ల్యాబ్‌లో చూస్తే మైండ్‌లో ఫిక్స్ అయిపోతుంది’ అని ఎంతో హుషారుగా చెబుతోంది విద్యార్థిని శిరీష. ఆడుతూ పాడుతూ పాఠాలు ప్రాక్టికల్‌గా చెబుతున్న ‘మ్యాథ్స్ ల్యాబ్’ మరిన్ని పాఠశాలలకు విస్తరించాలని కోరుకుందాం.
- భువనేశ్వరి
ఫొటోలు: రాజేశ్ రెడ్డి