శాంతి సమరయోధుడు దలైలామా | a story about dalailama | Sakshi
Sakshi News home page

శాంతి సమరయోధుడు దలైలామా

Published Sun, Dec 15 2013 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

శాంతి సమరయోధుడు  దలైలామా

శాంతి సమరయోధుడు దలైలామా

పురస్కారం
 నోబెల్ ఇండియా  భారతదేశంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని తనపై చైనా మీడియా చేసిన విమర్శలను దలైలామా అనేకసార్లు తిప్పికొట్టారు. గుజరాత్‌లో 2010లో జరిగిన ‘ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్’లో  ఆయన మాట్లాడుతూ... ‘పైకి కనిపిస్తున్న నా రూపం టిబెట్‌ది, ఆధ్యాత్మికంగా నేను భారతీయుడిని, భారతమాత పుత్రుడిని’ అన్నారు.
 
 అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ పురస్కార గ్రహీతలలో 14వ దలైలామా ఒకరు. ఈయనకు 1989వ సంవత్సరపు నోబెల్ శాంతి పురస్కారం లభించింది. శాంతి, అహింసా మార్గంలో టిబెట్ దేశానికి స్వాతంత్య్రం సంపాదించేందుకు అర్ధ శతాబ్దంపైగా చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ బహుమతిని ప్రదానం చేశారు. దలైలామా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల నుంచి శాంతిపోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
 
 దలైలామాను యేషేనారెబల్, లామో ధోండ్రబ్‌గా పిలిచేవారు. ఆయన టిబెట్ దేశం ఈశాన్య ప్రాంతంలోని ‘తక్త్ సేర్’ అనే కుగ్రామంలో 1935వ సంవత్సరం జూలై ఆరవ తేదీన జన్మించారు. ఆయన రెండున్నర సంవత్సరాల వయస్సులోనే బుద్ధుని అవతారంగా గుర్తింపు పొందారు. ‘లామో ధోండ్రబ్’ను బుద్ధుని అంశగా గుర్తించడంతోపాటు తన వారసునిగా కూడా ప్రకటించారు 13వ దలైలామా. టిబెటన్ భాషలో దలైలామా అంటే ‘జ్ఞాన సముద్రం’ అని అర్థం. దలైలామా పూర్తి పేరు జెట్‌సన్ జంఫెల్ గవాంగ్ లోబ్సంగ్ యేషే టింజెన్ గ్యాట్నో. ఇంత పెద్ద పేరులోని పదాలన్నీ బుద్ధుని అవతారాన్ని కీర్తించేవే. పవిత్ర దైవం, దివ్య ప్రభ, సానుభూతి, విశ్వాస నిరూపక జ్ఞాన సముద్రుడు అని అర్థం.
 
 దలైలామా ఆరేళ్ల వయసులో విద్యాభ్యాసం ప్రారంభించారు. ఆయన 25వ సంవత్సరం వరకు బౌద్ధ మత సంప్రదాయ విద్యను అభ్యసించారు. బౌద్ధ మత తత్వశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా (గేషే లారంపా) పొందారు. బౌద్ధ విశ్వవిద్యాలయాలైన డ్రెఫంగ్, సెరా, గండెన్ బౌద్ధ విద్యాలయాలలో 30 మంది పండితుల పరీక్షలను నెగ్గి, 15 మంది పండితులతో బౌద్ధ మత న్యాయ సూత్రాలపై వాదించి, భౌతిక ఆధ్యాత్మిక విభాగాలలో నైపుణ్యతను నిరూపించుకున్నారు.
 
 యేషేనారెబల్... పదహారేళ్ల ప్రాయంలోనే టిబెట్ పరిపాలన వ్యవస్థకు అధిపతిగా నియమితులయ్యారు. అయితే 1954వ సంవత్సరంలో టిబెట్ చైనీయుల ఆక్రమణకు గురైంది. చైనీయుల వలసలు పెరిగిపోయి దేశం చైనా హస్తగతం అయింది. ఆ దశలో టిబెట్ పరిరక్షణ కోసం దలైలామా... మావోసేటుంగ్ చౌ ఎన్ లై మొదలైన నాయకులతో చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలం కావటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ అజ్ఞాత ప్రదేశం... భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ధర్మశాల. భారతదేశంలో ఆశ్రయం పొంది ‘ధర్మశాల’లో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. టిబెట్ స్వాతంత్య్రం కోసం ధర్మశాల నుంచే ప్రయత్నాలు కొనసాగించారు దలైలామా.  
 
 టిబెట్‌పై చైనా దురాక్రమణను గురించి ఐక్యరాజ్యసమితిలో దలైలామా ఫిర్యాదు చేశారు. ఐక్యరాజ్యసమితి నుండి కూడా మూడుసార్లు టిబెట్‌కు అనుకూలంగా ప్రతిపాదనలు వచ్చినా చైనా దురాక్రమణ మానలేదు. దలైలామా తయారుచేసిన టిబెట్ రాజ్యాంగాన్ని చైనా గౌరవించలేదు. 1980వ దశాబ్దంలో దలైలామా ప్రపంచంలో ఎన్నో దేశాలు పర్యటించి, టిబెట్ పట్ల ఆయా దేశాల మద్దతును కూడగట్టారు. తుది ప్రయత్నంగా టిబెట్‌లో శాంతి స్థాపనకు 1987లో ఐదు అంశాల ప్రతిపాదన చేశారు.
 
 దలైలామా నిరాడంబరమైన బౌద్ధ సన్యాసి. ఆయన బౌద్ధ మతాన్ని కచ్చితమైన నియమానుసారంగా అవలంబించడంతోపాటు ప్రపంచంలోని ఇతర మతాలన్నింటినీ గౌరవిస్తారు. ఆయన 1973లో క్రైస్తవుల రోమన్ క్యాథలిక్ కేంద్రమైన వాటికన్ సిటీలో ఆరవ పోప్‌ను కలుసుకున్నారు. పోప్ రెండవ జాన్‌పాల్‌ని 1980, 82, 86, 88 సంవత్సరాలలో కలుసుకొని ప్రపంచ శాంతి గురించి చర్చించారు. ‘‘ప్రపంచ మానవులందరం ప్రస్తుతం గొప్ప విపత్కర పరిస్థితుల్లో మనుగడ సాగిస్తున్నాం. ఈ క్లిష్ట పరిస్థితులలో మానవులందరి మధ్య పరస్పర అవగాహన, భద్రత, సామరస్యం తప్పనిసరి. అవి లేకుండా శాంతియుత సహజీవనం సాగబోదు. మానవుల మధ్య శాంతి నెలకొల్పడానికి నేను ప్రపంచంలోని అన్ని మతాల అధిపతులనూ కలిసి వారి సహకారం కోసం కృషి చేయగలను’’... ఇదీ వాటికన్ నగరంలో దలైలామా చేసిన ప్రసంగ పాఠం సారాంశం.
 
 ‘‘ఈ ప్రపంచంలో భిన్న మనస్తత్వాలు గల మానవులనేకులున్నప్పుడు వారి వారి మనసుకు నచ్చిన విధంగా ఏ మతాన్నైనా గౌరవించవచ్చు. అన్ని మతాల సారాంశమూ ఒక్కటే. మానవులందరూ శాంతియుత జీవనం, సుఖ సంతోషాలతో కాలం గడపడం, ఇతరుల వలన తమ స్వేచ్ఛా జీవనానికి ఇబ్బందులు ఏర్పడకపోవటం’’ అని ఆయన చెప్పేవారు. దలైలామా 1989లో కేంటర్‌బరీ ఆర్బ్‌బిషప్ డా॥రాబర్ట్ రన్‌సీ, ఆంగ్లికన్ చర్చి అధికారులతో చర్చలు జరిపారు. ఆయన టిబెట్ దేశ స్వాతంత్య్రం కోసం అర్ధశతాబ్దం పాటు తన శాంతి ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో ఆయన ప్రపంచ శాంతి స్థాపన కోసం కూడా నిర్విరామంగా కృషి చేశారు. ఆయన శ్రమను, పోరాటంలోని చిత్తశుద్ధిని గుర్తించి, ఆయనకు 1989వ సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు.
 
 గాంధీజీ స్ఫూర్తితో...
 దలైలామా ఒక సందర్భంలో... శాంతియుత పోరాటానికి స్ఫూర్తి, ఆదర్శం భారత జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. నోబెల్ బహుమతి అందుకునే సమయంలో దలైలామా ‘‘నోబెల్ శాంతి పురస్కారానికి ఒక పీడితమైన ప్రతినిధిగా నన్ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు. ప్రపంచంలోని పీడిత మానవులకు, స్వాతంత్య్రం కోసం పోరాడేవారికి, అణగదొక్కబడే వారికి... ప్రపంచ శాంతి కోసం పాటుపడే వారికీ ఈ బహుమతి అంకితం’’ అని పేర్కొన్నారు.
 డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు
 విశ్రాంత రసాయనాచార్యులు
 
 
 టిబెట్ సార్వభౌమత్వం కోసం...
     టిబెట్‌ని శాంతియుత తటస్థ భాగంగా పేర్కొనాలి.
     అణ్వాయుధాలు, సైన్యాలను మోహరించరాదు.
     టిబెట్ దేశంలోకి చైనీయుల వలసలు ఆపివేయాలి.
     టిబెట్ దేశాన్ని పూర్తి స్వయంపాలన స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యంగా అంగీకరించాలి.
     టిబెటన్‌ల సంస్కృతి మతాచారాలను పరిరక్షించి, ఆ దేశంలో మానవ హక్కులను పునరుద్ధరించాలి.
 ఈ ఐదు ప్రతిపాదనలనూ ప్రపంచదేశాల దృష్టికి తీసుకువచ్చారు దలైలామా.
 
 దలైలామా పురస్కారాలు...
     1959... రామన్ మెగసెసె అవార్డు
     1989... నోబెల్ శాంతి బహుమతి
     2012... టెంప్లెటన్ ప్రైజ్ (ఈ అవార్డు కింద లభించిన డబ్బుని భారతదేశంలోని ‘సేవ్ ద చిల్డ్రన్’ చారిటీకి విరాళంగా ఇచ్చారు)
     2007... అమెరికా నుంచి ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’
     2006... కెనడా ప్రభుత్వం నుంచి గౌరవ పౌరసత్వం (హానరరీ సిటిజన్‌షిప్)
     2005... యు.కె.లోని బుద్ధిస్ట్ సొసైటీ నుంచి క్రిస్టమస్ హాంఫ్రీస్ అవార్డు
 
 ప్రపంచ మానవులమైన మనమంతా సుఖ సంతోషాలతో కూడిన శాంతియుత జీవనాన్ని కోరుకుంటాం. ఇదే విధమైన భావన ప్రపంచంలో అందరికీ ఉంటుందని భావించి, ఇతరులకు హాని తలపెట్టడం ఆపివేస్తే, ప్రపంచ శాంతి దానికదే పరిఢవిల్లుతుంది. ప్రతి మానవునికీ అవసరమైన కనీస సౌకర్యాలు, శాంతియుత సహజీవనం గల సమాజాన్ని ఇవ్వగలిగితే, వారిని బలవంతంగా అణచివేతకు గురిచేయకుండా ఉంటే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది. సాటి మానవులపై హింస ప్రయోగిస్తే, అది మరింత హింసకు దారితీస్తుంది తప్ప సమస్యలకు పరిష్కారం మాత్రం లభించదు. టిబెట్‌ను ప్రకృతి అందాలతో పర్యావరణాన్ని పరిరక్షించే శాంతియుత ప్రదేశంగా గుర్తించి, ఆ దేశంపై దురాక్రమణలు, బల ప్రయోగాలు ఆపివేయాలని మనవి చేస్తున్నాను.
 - 14వ దలైలామా (నోబెల్ పురస్కారం సందర్భంగా...)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement