డోక్లామ్ సీరియస్ ఇష్యూనే కాదు: దలైలామా
న్యూఢిల్లీ: సిక్కింలోని డోక్లామ్ నుంచి భారత్ వెనక్కి తగ్గకపోతే 1962 నాటి పరిస్థితి ఎదురుకాక తప్పదని చైనా.. మేం కూడా అప్పటివాళ్లం కాదని ఇండియా పర్సరం హెచ్చరికలు చేసుకున్నాయి. దీంతో రెండు నెలలుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇదసలు సీరియస్ ఇష్యూనే కాదని, భారత్-చైనాలు ఎప్పటికీ సోదర దేశాలేనని అంటున్నారు టిబెటన్ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా!
బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన దలైలామా.. డోక్లామ్ సమస్య అంత తీవ్రమైనది కాదన్న అభిప్రాయం వెలిబుచ్చారు. ‘చైనా, భారత్‌లు రెండూ పెద్ద దేశాలే. ఇంతకు ముందు అనేక సందర్భాల్లో వీటి మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ హిందీ-చైనీ భాయి భాయి అంటూ వాటిని పరిష్కరించుకున్నాయి’ అని లామా అన్నారు. అయితే, ప్రస్తుత సందర్భంలో భారత్ అనుసరిస్తున్న తీరును ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
భారత్‌లో భావ వ్యక్తీకరణకు ఎలాంటి ఆంక్షలు లేవని, అందుకే స్వేచ్ఛగా నాఅభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానని దలైలామా పేర్కొన్నారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2012 లో ఇండియా-చైనా ఒప్పందంను ఉల్లంఘించి మరీ డ్రాగన్ కంట్రీ డోక్లామ్ వద్ద రోడ్డు నిర్మాణం చేపట్టడంతో మొదలైన రచ్చ.. ఇప్పుడు ఇరుదేశాల ఆర్మీ సై అంటే సై అని కాలు దువ్వుకునేవరకు వచ్చిన సంగతి తెలిసిందే.