భారత్‌ను బెదరగొట్టేందుకే చైనా..
డోక్లాం ప్రతిష్టంభన.. చైనా సైనిక విన్యాసాలు
చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) గతవారం సైనిక యుద్ధవిన్యాసాలు నిర్వహించినట్టు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ దినపత్రిక పేర్కొంది. ప్రత్యక్ష సైనిక యుద్ధ సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన ఈ విన్యాసాల్లో ఆర్మీ ట్యాంకులను, హెలికాప్టర్లను ఉపయోగించినట్టు పేర్కొంది. వైమానిక దళాలు, సాయుధ బలగాలతో కూడిన 10 పీఎల్‌ఏ యూనిట్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయని యుద్ధోన్మాద వ్యాఖ్యలు చేసే గ్లోబల్ టైమ్స్ తెలిపింది. సరిహద్దుల్లోని డోక్లాం ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ విన్యాసాలు నిర్వహించినట్టు తెలిపింది.
పీఎల్‌ఏకు చెందిన వెస్టర్న్ థియేటర్ కమాండ్ ఈ విన్యాసాలు నిర్వహించిందని పేర్కొంది. అయితే, ఏ ప్రాంతంలో నిర్వహించిందో తెలుపలేదు. భారత్‌తో ఉన్న సరిహద్దు రేఖ పహారా బాధ్యతను వెస్టర్న్ థియేటర్ కమాండ్ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. సైనిక విన్యాసాల్లో భాగంగా ఎత్తైన కొండప్రాంతాల్లోని లక్ష్యాలపై సైనికులు కాల్పులు జరిపారని, ఆ తర్వాత హెలికాప్టర్లు ఉపరితలంపై ఉన్న లక్ష్యాలపై క్షిపణులు ప్రయోగించాయని చైనా సెంట్రల్ టెలివిజన్ (సీసీటీవీ)ను ఉటంకిస్తూ ప్రచురించిన ఈ కథనంలో తెలిపింది. డోక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్‌ను బెదరగొట్టేందుకు ఈ సైనిక విన్యాసాలు నిర్వహించినట్టు రక్షణరంగం నిపుణుడిని ఉటంకిస్తూ ఆ పత్రిక చెప్పుకొచ్చింది.