దేవతల సేనను తెచ్చుకున్న ఇంగ్లండ్!
సంగ్రామం
యుద్ధంలో అబద్ధాలూ, అభూత కల్పనలూ కూడా ఓ వ్యూహమే. గ్రేట్‌వార్ నాటి ఇంగ్లండ్ చరిత్ర తొలి వాక్యాన్ని ఆ రెండు పదాలు లేకుండా ఊహించడం కష్టం. మొదటి ప్రపంచ యుద్ధంఅనేక యుద్ధాల సమాహారం. అందులో ప్రధాన భాగస్వాములు ఇంగ్లండ్, జర్మనీ. ఈ రెండు దేశాలు మొదటిసారిగా ఆగస్ట్ 22, 23 తేదీలలో (1914) మోన్స్ అనేచోట తలపడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇదో ప్రసిద్ధ యుద్ధం. చరిత్రాత్మక ఘట్టం. ఇంగ్లండ్ తరఫున జర్మనీ వాళ్ల పీచమణచడానికి స్వర్గద్వారాలు తెరుచుకుని దేవతల సైన్యం నేరుగా మోన్స్ యుద్ధరంగానికి దిగొచ్చింది. దీనితో జర్మనీ డంగైపోయింది (ట). ఈ ఉదంతాన్ని చెప్పదలిస్తే ‘అనగా అనగా ఒక మోన్స్....’అని మొదలుపెట్టొచ్చు.
మోన్స్ బెల్జియం సరిహద్దులలో ఉంది. ఫ్రాన్స్ సరిహద్దులకీ దగ్గరే. చుట్టూ ఉన్న పెద్ద దేశాలు జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్‌ల ఆవేశం అదుపులో ఉండడానికి బెల్జియంను తటస్థ దేశంగా ఉంచారు. ఇదో అంతర్జాతీయ ఒడంబడిక. ఆ ఒడంబడికను పక్కన పెట్టి బెల్జియం మీద దాడికి దిగినందుకే ఇంగ్లండ్ జర్మనీ మీద ఆగస్టు 14, 1914లో యుద్ధం ప్రకటించింది. అలా రంగ ప్రవేశం చేసింది రవి అస్తమించని దేశం. తన మిత్రుడు ఫెర్డినాండ్ హత్యకు కుట్ర పన్నిన సెర్బియాను శిక్షించాలని జర్మన్ చాన్సలర్ విల్‌హెల్మ్‘బ్లాంక్ చెక్’ ఇచ్చి ఆస్ట్రియా చక్రవర్తిని ఒప్పించాడు. నిజానికి బాల్కన్స్ యుద్ధాలలో సెర్బియా సాధించిన విజయం జర్మనీకి మింగుడు పడకుండా ఉంది.
సెర్బియాకు బుద్ధి చెప్పే పనితో పాటు, ఒకనాటి జర్మనీ సర్వసేనాని ష్లీఫెన్ (1907) రూపొందించిన పథకం మేరకు ఫ్రాన్స్ మీదకు కూడా జర్మనీ సైన్యాన్ని పంపింది. జర్మనీ నుంచి ఫ్రాన్స్ ైవె పు సైన్యం రావాలంటే బెల్జియం మీదుగా వె ళ్లాలి. ‘ఇది దేశం, జాతీయ రహదారి కాదు’ అని అప్పటికి చాలాకాలం క్రితమే ప్రకటించాడు బెల్జియం రాజు అల్బర్ట్. అందుకే బెల్జియంను నాశనం చేసి జర్మనీ సైన్యం పారిస్ సమీపానికి వచ్చేసింది. దీన్ని నిలువరించడానికీ, బెల్జియం తాటస్థ్యాన్ని భగ్నం చేసినందుకూ ఇంగ్లిష్ చానెల్ దాటి బ్రిటిష్ సేనలు వచ్చాయి.
ఆ యుద్ధంలో పాల్గొన్న బ్రిటిష్ సైన్యం డెబ్బయ్ అయిదువేలు. జర్మనీ సైన్యం దానికి రెట్టింపు. మోన్స్‌కి కాస్త అవతల బెతూన్ అనేచోట వేచి ఉన్న జర్మనీ సేన ఉదయమే మహోగ్రంగా బ్రిటిష్ ఫోర్సు మీద పడింది. తను ఎంత తక్కువ సేనతో యుద్ధభూమిలో మిగిలాడో, ఎంత పెద్ద సైన్యంతో తలపడవలసి ఉందో అప్పటికి జాన్ ఫ్రెంచ్‌కు తెలిసింది. ఏం చేయలేక తన సైన్యాన్ని ఫ్రాన్సు వైపు పరుగు తీయించాడు. నిజానికి ఇక్కడ ఫ్రాన్స్ సేనల సాయంతో ఇంగ్లండ్ జర్మనీని నిలువరించాలి. అక్కడికి పారిస్ నగరం యాభయ్ కిలోమీటర్లలోపలే ఉంది. కానీ, ఆగస్టు 22, 1914న ఫ్రాన్సు సేనలు సంబ్ర నది ఒడ్డున జర్మనీ చేతిలో చిత్తుగా ఓడిపోయి మోన్స్ వైపు పారిపోయి వచ్చాయి. మోన్స్ దగ్గర బ్రిటిష్ సైనికులతో కలిసినట్టే కలిసి, తమనే తరుముతూ మోన్స్ చేరిన జర్మనీ సేనను చూసి మళ్లీ మార్నే వరకు పరుగు లంఘించుకుంది ఫ్రాన్స్ సేన. తాము ఉడాయిస్తున్న సంగతి కూడా బ్రిటిష్ సేనానికి (బ్రిటిష్ ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్) సర్ జాన్ ఫ్రెంచ్‌కి కూడా చెప్పలేదు. దేశ భూభాగాన్ని రక్షించకుండా ఫ్రాన్స్‌నే అనుసరించాయి బెల్జియం సేనలు.
దీనితో కంగు తిని కాళ్లకి బుద్ధి చెబుతున్న బ్రిటిష్ సేనని దానికి రెట్టింపు ఉన్న జర్మనీ సేన ఆ మొదటి దాడిలోనే చావగొట్టేసి ఉండొచ్చు. కానీ అలా జరగలేదు. ఆ పెనుముప్పు నుంచి బ్రిటిష్ జాతిని తప్పించినది దేవతల సైన్యమేనట.
ఇదీ ఆ ‘కథ’.
రెచ్చిపోయిన జర్మనీ సైన్యం బ్రిటిష్ సైన్యం మీద విరుచుకు పడబోతూ ఉండగా, ఆకాశంలో తూర్పున పెద్ద మెరుపు. అందరికీ కళ్లు బైర్లు కమ్మేశాయి. మంత్రం వేసినట్టు మరుక్షణంలో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన తెల్లటి పొగ కమ్మేసింది. మరు లిప్తలోనే, మళ్లీ మంత్రించినట్టే ఆ పొగ మాయమయిపోయింది. కళ్లు చెదిరిపోయేటంత వెలుగు ఆకాశంలో అప్పుడు. ఆ వెలుగులోనే ఒక దివ్యలోకపు వాకిలి కనిపించింది. అదే స్వర్గద్వారం. ఆ ద్వారం హఠాత్తుగా తెరుచుకుంది.
‘అదిగో, అదే స్వర్గం’ అంటూ గట్టిగా అరిచాడు, అక్కడే ఉన్న ఓ పాడ్రే. అంటే మిలటరీ దళాల వెంట ఉండే మతాధికారి. అంతా కన్నార్పకుండా చూస్తున్నారు. ఎంతో కళాత్మకంగా ఉన్న ఆ వాకిలి తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఆ చప్పుడును అర్ధ నిమీలిత నేత్రాలతో విన్నారు చాలామంది. ఎక్కడా చిన్న మచ్చ కూడా లేకుండా శ్వేత వర్ణంలో మెరిసిపోతున్న మూడు గుర్రాలు గుమ్మం నుంచి బయటకి అడుగు పెట్టాయి లోపల నుంచి. వాటి మీద ముగ్గురు దివ్యమూర్తులు ఉన్నారు. అటూ ఇటూ ఇద్దరు దివ్య పురుషులు. వారి ఆపాదమస్తకం శ్వేతవర్ణమే. కానీ వాళ్లకి తక్కువ జుట్టే ఉంది. పాల తెలుపుతో పోటీ పడే పొడవైన తెల్లని దుస్తులు శరీరాల మీద. వారి చేతుల్లో తెల్లని ఆయుధం. ఆ ఇద్దరు దివ్య పురుషుల మధ్య ఓ దేవత, దివ్యకాంతులు వెదజల్లుతూ. ఆమె కూడా పై నుంచి కింది వరకు శ్వేతాంబరధారియై కనిపించింది. ఆమె కేశపాశం సుదీర్ఘం. తెల్లటి పట్టుకుచ్చు వంటి కురులట అవి. ఆమెకు మాత్రం రెండు తెల్లని పొడవైన రెక్కలు ఉన్నాయి. ఆలా చూస్తూ ఉండగానే వారిని అనుసరిస్తూ అద్భుతమైన అశ్వికదళం ఆ ద్వారాల నుంచి ఒక్కసారిగా బయటకు ఉరికింది. ఆ అశ్వికులంతా తెల్లటి పొడవైన దుస్తులు ధరించిన దివ్యపురుషులే. ఇంకో విడ్డూరం. వాళ్లంతా భూమ్మీద సంచరించే సాధారణ మానవుల్లా లేరు. ఒక్కొక్కళ్లు ఎనిమిదిన్నర అడుగుల ఎత్తు ఉన్నారు. ఆయుధాలు కత్తులే, కానీ పాదరసంలా మెరుస్తున్నాయి.
భగభగ మంటున్న సూర్యకిరణాలే బాటలుగా, ఆకాశం నుంచి ఆ దివ్య పురుషుల అశ్వికదళం కాంతివేగంతో బెతూన్‌లో జర్మనీ వాళ్లు విడిది చేసిన ఆ ఖాళీ ప్రదేశంలోకి వచ్చి నేరుగా దిగింది. అంటే జర్మన్ సేనకీ, ఇంగ్లీషు సేనకీ నడుమ ఆ దేవతల అశ్విక దళం ఉందన్నమాట. వాళ్ల రాకతో జర్మనీ వాళ్లంతా శిలాప్రతిమలైపోయారు. జర్మనీ వాళ్లు తెలివి తెచ్చుకుని ఎన్ని షెల్స్ పేల్చినా, ఎన్ని మెషీన్ గన్లు గురి పెట్టి కాల్చినా, ఆర్టిల్లరీ ట్యాంకులు ఎన్నిసార్లు పేల్చినా చెక్క చెదరలేదు స్వర్గసైన్యం. ఒక్క అశ్వికుడు కూడా గాయపడలేదు. కింద పడలేదు. వెన్నుచూపి పారిపోతున్న బ్రిటిష్ సేనకు ఒక్క తూటా కూడా తగలకుండా జాగ్రత్తగా కాపాడింది దివ్య సేనావాహిని. అలా బ్రిటిష్ ఎక్స్‌పెడిషినరీ బలగాలు అక్కడ నుంచి కదిలి, ఫ్రెంచి సైనికులు కాసుక్కూచున్న మార్నే అనే ఆ సురక్షిత ప్రాంతం దాకా వెళ్లిపోయాయి. ఇదీ కథ.
ఆ యుద్ధంలో బ్రిటన్ పలాయనం చిత్తగించింది. దీనికే గ్రేట్ రిట్రిట్ అని పేరు పెట్టారు గొప్పగా, ఆనాటి యుద్ధవీరులు. మామూలు భాషలో వెనక్కి మరలడమే. కానీ దీనిని మభ్య పెట్టడానికి ఇంగ్లండ్ ఎన్ని కథలు సృష్టించిందో చెప్పలేం.
జర్మన్ సైన్యంలో పెద్ద ఆఫీసరు ఒకడు మోన్స్‌లోనే యుద్ధఖైదీగా పట్టుబడ్డాడు. బ్రిటిష్ ఆర్మీ ప్రధాన కేంద్రంలో కూర్చుని ఈ ఉదంతం గురించి ఇంగ్లీషు వాళ్లకి పూస గుచ్చినట్టు వర్ణించినవాడు అతడే. ‘అరుదైన అనుభవం’ అంటూ ఒక నర్సు మరో అధికారికి ఇదే కథ చెప్పినట్టు అప్పుడు పత్రికలలో వెలువడింది. జీఎం ట్రెవీలియన్ గొప్ప చరిత్రకారుడు. ఆయన సయితం ఈ సంగతిని నమ్మినట్టే సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు చేశాడు. ఏపీజే టేలర్ అని ఇంకో పెద్ద చరిత్రకారుడూ అంతే. చాలాకాలం తరువాత బీబీసీ వాళ్లు కూడా ఈ కథనే వినిపించారు. లండన్ నుంచి వెలువడే ‘ది ఈవెనింగ్ న్యూస్’ సెప్టెంబర్ 29, 1914లోనే ‘ద బౌమెన్’ అనే కథానికను ప్రచురించింది. అందులో కథాంశం మోన్స్ దేవతలు దిగిరావడమే. ఆర్థర్ మాషెన్ ఇది రాశాడు. ఏప్రిల్ 25, 1915న ‘స్పిరిట్యువలిస్ట్’ పత్రిక కూడా ఈ ఉదంతం గురించి ప్రచురించింది. నిజానికి బ్రిటిష్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ జాన్ చార్టెరిస్ ఈ కథను జనంలోకి వదిలిపెట్టాడని చెబుతారు. తొలి యుద్ధంలోనే చిత్తయిన బ్రిటిష్ సేనలలో మానసిక స్థయిర్యం కోసం అతడీ పని చేశాడు.
మొదటి ప్రపంచ యుద్ధం తొలి సమరంలో ఇంగ్లండ్‌కు ఎదరైంది అవమానమే. కానీ స్వజాతినీ, ప్రపంచాన్నీ కూడా ఇంగ్లండ్ సైనికాధికారులు మాయ చేశారు. ఆ ఘట్టం మీద వచ్చిన ఊహా చిత్రాలు మాత్రం ఇప్పటికీ ఇంగ్లండ్‌ను వెక్కిరిస్తున్నాయి. తరువాత జరిగే యుద్ధాలలో నిలదొక్కుకుకోవడానికి ఆ దేశం చేసిన ప్రయత్నాలు చరిత్ర విస్మరించలేని విషాదాన్ని మిగిల్చాయి.
- డా.గోపరాజు నారాయణరావు