‘‘మిస్టర్ రాకీ! యూ ఆర్ అండర్ అరెస్ట్’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్. బైట నుండి కేకలు, అరుపులు వినిపిస్తున్నాయి. కిటికీ తెరిచి చూశా. మహిళాలోకం సునామీలా నా ఇంటి మీద పడింది. అప్పటికప్పుడే ఇంతమంది ఇక్కడికి ఎలా చేరుకున్నారో ఆశ్చర్యమే నాకు. ‘భార్యా హంతకుణ్ని ఉరికంబం ఎక్కించాలి. ఆ దుర్మార్గుణ్ని మాకు అప్పగించాలి.’కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రాజును చూసి బైటకు వస్తుంటే, ‘‘ఎక్స్‌క్యూజ్ మీ!’’ అన్న కోమలస్వరం వినిపించి వెనుదిరిగి చూశా. ఎదురుగా ఓ అందమైన యువతి. ‘‘నా పేరు సానియా. అబ్దుల్లా గారి భార్యను’’ అంటూ పరిచయం చేసుకుంది. అబ్దుల్లా ఎవరో చటుక్కున గుర్తుకురాలేదు నాకు. ‘‘వారం క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఉగ్రవాదుల బాంబ్ బ్లాస్టుల్లో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తిని కాపాడి ఆసుపత్రికి చేర్చారు మీరు. అతను నాభర్త అబ్దుల్లా’’ అంటూ తన సెల్‌ఫోన్లో అతని ఫొటోని చూపించిందామె.గుర్తుపట్టి, ‘‘ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన?’’ అనడిగా.
‘‘ఇంకా కోమాలోంచి కోలుకోలేదు’’ అంటుంటే, ఆమె కళ్ళలో నీళ్ళు నిలిచాయి.‘‘ఆయన తప్పకుండా కోలుకుంటారు. మీరు ధైర్యంగా ఉండండి.’’ ‘‘నా భర్తను కాపాడిన వ్యక్తి మీరేనంటూ ఆసుపత్రి సిబ్బంది మిమ్మల్ని చూపించారు’’ అందామె. ‘‘మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో తెలియడంలేదు’’.‘‘ఆ పరిస్థితుల్లో ఎవరైనా అదే పని చేసేవారు’’ అన్నాను.సినిమాల్లో స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తున్నా. సుమారు పాతిక సినిమాలకు స్టంట్ డైరెక్షన్ చేశా. ప్రస్తుతం నేను ఫైట్స్ కంపోజ్ చేస్తున్న సినిమా క్లైమాక్స్ సీన్స్‌ని ఔట్‌డోర్‌లో తీయాలని లొకేషన్ సెర్చ్‌కి అసిస్టెంట్‌డైరెక్టర్ వెంకట్రాజుతో కలసి సిటీ బైట వివిధ ప్రదేశాలను సందర్శించి తిరిగి వస్తుండగా జరిగింది బాంబ్ బ్లాస్ట్. పేలుళ్ళకు కాస్త దూరంగా ఉండడంవల్ల మా కారుకు డ్యామేజ్ పెద్దగా జరగలేదు. గాజుపెంకులో, ఇనుపముక్కలో లోపలికి చొచ్చుకుపోవడంతో నా ఎడమ భుజానికి తీవ్రమైన గాయమై రక్తం ధారలు కట్టింది. వెంకట్రాజు ట్రౌమాకి గురయ్యాడు. ఎందరో ప్రాణాలు కోల్పోతే, మరెందరో గాయపడ్డారు. మాకు చేరువలో మధ్య వయస్కుడొకడు తీవ్రంగా గాయపడి, ‘దాహం.. దాహం..’ అంటూ అరుస్తున్నాడు. ఒకరినొకరు పట్టించుకునే స్థితిలో లేరు. ఆంబులెన్సులు రావడానికి సమయం పడుతుంది. ఆ లోపున అతను చనిపోయేలా ఉన్నాడు. నా గాయాన్ని లెక్కచేయకుండా వెంటనే అతన్ని చేతుల్తో ఎత్తుకుని కారులోకి చేర్చాను. వెంకట్రాజును లాక్కెళ్ళి ముందు సీట్లో కూర్చోబెట్టాను. ఒంటి చేత్తోనే డ్రైవ్ చేసుకుంటూ సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళాను. ఆ వ్యక్తిని డాక్టర్స్‌కి అప్పగించి, రక్తస్రావం అధికం కావడంతో కుప్పకూలిపోయాను. అర్ధరాత్రి వేళ తెలివిలోకి వచ్చాక ఆ వ్యక్తి గురించి అడిగితే, అతనికి ప్రాథమిక చికిత్స చేసి కేర్ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. తెల్లవారాక వెంకట్రాజు, నేను కూడా కేర్ ఆసుపత్రికి షిఫ్ట్ అయిపోయాము. రెండు రోజుల తరువాత భుజానికి బ్యాండేజ్, చేతికి స్లింగ్‌తో ఆసుపత్రి నుండి నేను బైటపడితే, ఇంకా ట్రౌమా నుంచి కోలుకోని వెంకట్రాజు ఆసుపత్రిలోనే కొనసాగుతున్నాడు. నేను రోజూ వచ్చి అతన్ని చూసి వెళ్తున్నాను.
సానియా కూడా రోజూ రెండుపూటలా భర్తకోసం వస్తుండేది. దాంతో మేము రోజూ పలకరించుకోవడము, మా పరిచయం పెరగడమూ జరిగాయి. ఓసారి ఐసీయూలో ఉన్న అబ్దుల్లాని చూసి వచ్చాను. ఇంకా కోమాలోనే ఉన్నాడు. ఇంచు మించు నలభై ఐదేళ్ళుంటాయి అతనికి. ముఖంలో కఠినత్వం. అబ్దుల్లా హైటెక్ సిటీలో ఉన్న ఓ త్రీ స్టార్ హోటల్‌కు ఓనర్. నేను వెంటనే విస్తుపోయా. అదే హోటల్లో నా భార్య అమల రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. కోటీశ్వరుడైన వ్యక్తికి భార్య అయివుండీ సానియా సామాన్యురాలిలా స్కూల్లో టీచర్‌గా పని చేస్తోందని విని ఆశ్చర్యపోతుంటే, ‘‘చిన్నప్పట్నుంచీ టీచింగంటే ఇష్టం నాకు’’ అని నవ్విందామె. వెంకట్రాజును డిశ్చార్జ్ చేసిన రోజున–అవసరమైతే ఫోన్ చేయడానికి సంశయించవద్దని చెప్పి, సానియాకు నా ఫోన్ నంబర్ ఇచ్చా.
సీసీ కెమెరాల ఆధారంగా బ్లాస్టులకు కారకులైన ముగ్గురు అనుమానితుల ఫొటోలను విడుదల చేశారు పోలీసులు. వారికోసం ముమ్మరంగా గాలింపు మొదలయింది. ఓ రోజున సానియా ఫోన్ చేసింది. తనను కలుసుకోవడానికి వీలవుతుందా అని. ఆమె స్వరంలో మునుపటి ఉత్సాహం కనిపించలేదు. వెళ్లి కలిశా. ఆమె వదనంలో విషాదం తాండవిస్తోంది. ‘‘హౌ ఈజ్ హీ?’’ అనడిగా. ఆమె చెప్పిన సమాధానం నన్ను ఖంగు తినిపించింది. రెండు వారాల క్రితం అబ్దుల్లా కోమాలోంచి బైటపడకుండానే చనిపోయాడట!‘‘అయామ్ వెరీ సారీ!’’ సంతాపం వెలిబుచ్చాను. ‘‘నా వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి మీకంటే మంచి మిత్రులు ఎవరూ కనిపించడంలేదు నాకు. వీలైతే ఓసారి మా ఇంటికి రాగలరా?’’. రెండు రోజుల తరువాత ఆమె ఇంటికి లంచ్‌కి వెళ్ళాను. పెద్ద భవంతి అది. అంగుళం అంగుళానా ఐశ్వర్యం ఉట్టిపడుతోంది.
ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించాము. ఆమె నాతో పంచుకోవాలనుకుంటున్న వ్యక్తిగత విషయాలు ఏమిటా అని కుతూహలంగా ఉంది. కాసేపటికి ఏదో ఫైల్ తీసుకువచ్చింది. అందులోంచి మూడు ఫొటోలు తీసి నాకు చూపించింది. ఆమె భర్త అబ్దుల్లా ఎవరో వ్యక్తులతో కలసి తీయించుకున్నవి అవి. ‘‘వీటిలో నా భర్త పక్కనున్న వ్యక్తులను సరిగా చూడండి’’ అందామె.రెండింటిలో ఇద్దరు వ్యక్తులతోను, ఒకదానిలో ఓ వ్యక్తితోను ఉన్నాడు అబ్దుల్లా. ఆ వ్యక్తులను పరిశీలనగా చూశా. వారిని ఎక్కడో చూసినట్టనిపిస్తోంది.
హైదరాబాద్ బ్లాస్టు కేసుల్లో పోలీసులు వెదుకుతున్న అనుమానిత వ్యక్తులు వాళ్ళు! ‘‘నా భర్త మరణం తరువాత ఆయన పర్సనల్ క్యాబినెట్‌ని తెరచి చూస్తే ఇతర పత్రాలతో పాటు ఈ ఫొటోలు కనిపించాయి’’ అంటూ ఆమె వివరంగా చెప్పుకుపోయింది –‘‘అబ్దుల్లా స్కూల్ డ్రాపౌట్. పెళ్ళికి ముందు ఓ టీ కొట్టు ఉండేది అతనికి. గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఐదేళ్ళ తరువాత తిరిగొచ్చాడు. రాగానే ఓ చిన్న సైజు హోటల్ ప్రారంభించాడు. ఏడాది తిరక్కుండానే అది త్రీ–స్టార్ హోటల్‌గా రూపొందింది. గల్ఫ్‌కు వెళ్ళి బాగా సంపాదించాడనుకున్నారు అంతా. బంధువుల ప్రోద్బలంతో సానియాకి అతనితో నిఖా జరిగింది. ఐతే ఇప్పుడు బైటపడ్డ పత్రాలను పరిశీలిస్తే అతను హవాలా రాకెట్ నడిపేవాడన్న నిజం బైటపడింది. ఉగ్రవాదులతో అతనికి సంబంధాలు ఉన్నాయనీ, పరోక్షంగా వారికి సాయపడుతున్నాడని తెల్లమవుతోంది’’.ఆ కఠోర సత్యాన్ని జీర్ణించుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. అతని అక్రమాస్తుల పత్రాలు, బినామీల పేర్లు, ఫొటోలు చూపించింది. వాటిని తిరగేస్తూ ఉలిక్కిపడ్డా. అందులో ఆ యువతి ఫొటో, పేరు, వయసు, చిరునామా ఉన్నాయి. ‘‘హోటల్ ముసుగులో నా భర్త దేశద్రోహ కృత్యాలకు పాల్పడేవాడన్న ఊహే నాకు మింగుడు పడడంలేదు. బ్లాస్ట్ జరిగిన రోజున ఆయన ఉగ్రవాదులతో కలసి అక్కడికి వెళ్ళుంటాడని అర్థమవుతోంది. ఐతే వాళ్ళు అక్కడ బ్లాస్టులు జరుపుతారని ఎరిగివుండడు’’. ఆమెతో అంగీకరించాను.
ఓ క్షణం ఆగి నెమ్మదిగా అందామె, ‘‘అబ్దుల్లా ఇక లేడు. పోయిన మనిషిని ఎక్స్‌పోజ్ చేయడం నాకు ఇష్టంలేదు. అందుకే ఏం చేయాలో తోచక ఈ రహస్యాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. ముందుగా ఆ యువతి ఎవరో, నా భర్తకు ఆమెతో గల సంబంధం ఏమిటో? ఆమెకు కూడా ఆ హవాలా రాకెట్‌తో గాని, ఉగ్రవాదులతో గాని సంబంధాలు ఉన్నాయేమో తెలుసుకోవాలి’’.ఆ యువతి నా భార్య అమల. ఆమె అబ్దుల్లా హోటల్లో రిసెప్షనిస్టు. అబ్దుల్లా ఆమె బాస్. ఆ విషయం నేను తనతో చెప్పలేదు. సానియా దగ్గర సెలవు తీసుకుని తిన్నగా ఇంటికి వచ్చా. ఆ సమయంలో అమల హోటల్లో ఉంటుంది. అమల బీరువా వెదికాను. అడుగున ఉన్న సీక్రెట్ అరలోంచి పత్రాలు కొన్ని బైటపడ్డాయి. వాటిలో సానియా ఇంట్లో చూసిన వాటికి నకళ్ళు కూడా ఉన్నాయి. సిగరెట్ వెలిగించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. వాటి గురించి అమల నాకెప్పుడూ చెప్పలేదు.హఠాత్తుగా నా ఎదుట ప్రత్యక్షమయింది అమల. ఆమె డ్యూటీ రాత్రి ఎనిమిది గంటల వరకు. కానీ ఆ రోజు ఎందుకో త్వరగా వచ్చేసింది!
‘‘నేను లేని సమయంలో నా బీరువా ఎందుకు తెరిచావ్?’’ తీవ్రంగా అంటూ నా చేతిలోని పత్రాలను లాక్కుంది. ఆ పత్రాలను గురించీ, అందులోని ఆస్తులను గురించీ, అబ్దుల్లాకి తాను బినామీగా వ్యవహరించడం గురించీ నిలదీసాను. అది మా మధ్య ఘర్షణకు దారి తీసింది. ఎదురు దాడికి దిగింది. ఉద్రిక్తతకు గురికావడంతో మైకం కమ్మి పడిపోయాను. స్పృహలోకి వచ్చేసరికి అమల అక్కడ లేదు. టీ పెట్టుకుందామని కిచెన్‌లోకి వెళ్ళి గ్యాస్ ఆన్ చేసి స్టవ్ వెలిగించబోతే, హాల్లోంచి అలికిడి వినిపించింది. అటువైపు వెళ్ళాను, అమల దగ్గరి పత్రాలను తీసుకుని కాల్చేయాలని. తరువాత వాటి సంగతి వెలుగులోకి వస్తే, తాను ప్రమాదంలో చిక్కుకోకూడదన్నదే నా ఆలోచన. అమల హాల్లో కనిపించలేదు. సిగరెట్ ముట్టించి, ఇల్లంతా వెదికాను. కనిపించలేదు. ఫ్రస్ట్రేషన్‌తో చేతిలోని సిగరెట్‌ని కోపంగా విసిరికొట్టి బైటకు నడిచాను. ఐతే, అది కిచెన్లో పడటమూ, అంతకుముందు నేను ఆన్ చేసి ఉండడంతో గ్యాస్ లీకై పేలుడు సంభవించడమూ తృటిలో జరిగిపోయాయి. కిచెన్ అంటుకుని కాలుతోంది. హాల్లో ఉన్న నేను దూరంగా ఎగిరిపడి స్వల్పగాయాలతో బైటపడటం జరిగింది. ఎదురుచూడని ఆ సంఘటనకు కొయ్యబారిపోయాను.
క్షణాలలో అక్కడి వాతావరణం మారిపోయింది. ఇరుగుపొరుగు వారంతా పరుగెత్తుకు రావడము, మంటలు ఆర్పడానికి ప్రయత్నించడము, ఫోన్ కాల్స్ అందుకున్న పోలీసులు, ఫైర్ సర్వీసులు రావడమూ జరిగాయి. అమల జాడ లేదు. అంతకు మునుపు మా గొడవలను విన్న ఇరుగుపొరుగు వారు, నేను గ్యాస్ లీక్ చేసి తనను చంపేసానని ఫిర్యాదు చేసారు పోలీసులకు. మహిళా సంఘాలు కూడా రంగంలోకి దిగడంతో, పోలీసులు నన్ను అరెస్ట్ ఐతే చేసారు కాని, అమల డెడ్ బాడీని మాత్రం కనిపెట్టలేకపోయారు! న్యాయస్థానం నాకు పద్నాలుగు రోజులపాటు జ్యుడీషియల్ రిమాండుని విధించింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమల చచ్చిపోయిందన్న బాధ ఒక వంకా, భార్యా హంతకుడన్న ముద్ర మరో వంకా నన్ను కుంగదీసాయి. దినపత్రికలలో వార్తలు చూసి నన్ను పరామర్శించడానికి వచ్చిన సానియా, నాకు బెయిల్ ఇప్పిస్తానంటే వద్దన్నాను. వారం రోజుల తరువాత ఓ రోజున జైలర్ వచ్చి చెప్పిన విషయాలు నాకు సంతోషాన్నీ, దుఃఖాన్నీ కలిగించాయి. అమల మంటల్లో పడి చనిపోలేదట. ఆ సమయంలో తాను ఇంట్లో లేదట. ఎక్కడికో స్కూటర్‌పైన వెళుతూ ఓ రోడ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ప్రభుత్వాసుపత్రిలో చేర్చబడిందట. ఆ రోజు ఉదయమే ఆమె కోమాలోంచి బైటపడడంతో, వివరాలు తెలుసుకుని నాకోసం కబురుపెట్టారట. నా నిర్దోషిత్వం రుజువయిందన్న దానికంటే, అమల బతికి ఉన్నందుకే మిక్కిలి ఆనందం కలిగింది. ఐతే, ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టాడుతున్న అమలను చూస్తే దుఃఖం ముంచుకొచ్చింది.
ఆ రోజు నాతో గొడవపడిన అమల, నాకు స్పృహæతప్పడంతో కోపంతో అలాగే వదిలేసి స్కూటర్ ఎక్కి బైటకు వెళ్ళిపోయిందట. తన పేరిట ఉన్న ఆస్తుల ఒరిజినల్ డాక్యుమెంట్లను తెచ్చుకునేందుకని అబ్దుల్లా ఇంటికి బైలుదేరిందట. దారిలో సిటీ బస్ ఒకటి వెనుక నుండి వచ్చి గుద్దుకోవడంతో ఎగిరి దూరంగా పడిపోయిందట. ఆ తరువాత ఏం జరిగిందీ తనకు తెలియదట – హీనస్వరంతో అమల జరిగింది చెబుతుంటే నా మది గిలగిల కొట్టుకుంది. ఆ స్థితికి నేనే కారణమన్న అపరాధ భావన నా గుండెలను పిండేసింది. నాపైన మోపబడ్డ ఆరోపణ గురించీ, నేను జైలుకు వెళ్ళడం గురించీ తెలుసుకుని బాధపడింది అమల. పోలీసులను పిలిపించి తన వాంగ్మూలం నమోదు చేయించింది. ఆ రాత్రే నన్ను ఒంటరివాణ్ని చేసి తను చనిపోయింది.నెల్లాళ్ళ తరువాత సానియా నా వద్దకు వచ్చింది. ‘‘అబ్దుల్లా కారణంగా ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది’’ అందామె. ‘‘అబ్దుల్లా అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నింటినీ, హోటల్‌తో సహా, చారిటీస్‌కి రాసేసాను’’ అంది. ఓ క్షణం విస్తుపాటుకు గురైనా, ఆమెను మనస్ఫూర్తిగా అభినందించాను. - తిరుమల శ్రీ
నిందితుడు
Published Sun, Apr 29 2018 12:59 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment