భాషణం: ఓ కప్పు కాఫీ, నాలుగు మాటలు | One Cup of coffee, atleast Speak four words | Sakshi
Sakshi News home page

భాషణం: ఓ కప్పు కాఫీ, నాలుగు మాటలు

Published Sun, Sep 29 2013 2:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

భాషణం: ఓ కప్పు కాఫీ, నాలుగు మాటలు

భాషణం: ఓ కప్పు కాఫీ, నాలుగు మాటలు

ఏం తీసుకుంటారు? కాఫీనా, టీనా? ఆహా! ఎంత ప్రియమైన పలకరింపు. మూడ్‌ని బట్టి ఏదైతే అది. ఇవాళ మాత్రం ప్రపంచం చాలావరకు కాఫీ మూడ్‌లోనే ఉంటుంది. సెప్టెంబర్ 29 ‘ఇంటర్నేషనల్ కాఫీ డే’ మరి! అంచేత కాఫీ గురించి ఓ కప్పుడు విషయాలు మాట్లాడుకుందాం.
 coffee klatch (కాఫీ క్లాచ్) అంటే కాఫీ తాగుతూ పిచ్చాపాటీ మాట్లాడుకునే వారి గుంపు.  klatch అనే మాట ఇంగ్లిష్‌లో లేదు. జర్మనీ నుంచి మన వాడుకలోకి వచ్చింది. వారి భాషలో క్లాచ్ అంటే గాసిప్. కాలక్షేపం కోసం తరచు కొందరు పోగయ్యే ప్రదేశాన్ని కూడా కాఫీ క్లాచ్ అనొచ్చు. ‘కాఫీ క్లాచ్’ కంటే కాస్త మెరుగైనది coffee morning..  ఇదొక సోషల్ ఈవెంట్. పెద్దపెద్దవాళ్లంతా ఒక చోట కలుసుకుంటారు. కాఫీ తాగుతారు. కేకులు తింటారు. ధార్మిక సంస్థలకు విరాళాలు ఇస్తారు.
 
 coffee house అంటే రెస్టారెంట్. మధ్య, ఉత్తర ప్రాంత ఐరోపాదేశాల్లో ఈ కాఫీ హౌస్‌లు ఎక్కువగా కనిపిస్తాయి. కాఫీతో పాటు ఇతర పానీయాలు, కేకులు, చిరుభోజనాలు కూడా ఇక్కడ విక్రయిస్తుంటారు. కాబట్టి కాఫీ హౌస్ అంటే వట్టి కాఫీ మాత్రమే దొరుకుతుందనుకోనక్కర్లేదు. coffee bar అన్నా, coffee shop అన్నా కూడా ఇదే అర్థం.
 
 coffee table అంటే దిగువకు ఉండే చిన్నపాటి బల్ల. టీపాయ్ లాంటిది. దాని మీద కాఫీ సర్వ్ చేస్తారు. లేదా పుస్తకాలు, మ్యాగజీన్లు ఉంచుతారు.
 coffee-table book అని ఇంకో మాట ఉంది. దీనర్థం కాఫీ టేబుల్ మీద ఉండే పుస్తకం అని కాదు. అసలది కాఫీ టేబుల్ మీద ఉండాల్సిన పని కూడా లేదు. చాటంత ఉండే ఖరీదైన పుస్తకాన్ని కాఫీ-టేబుల్ బుక్ అంటారు. లోపలంతా చాలా వరకు బొమ్మలే ఉంటాయి. కనుక ఇది ప్రధానంగా చూడ్డానికే కానీ, చదవడానికి కాదు.
 
 Irish coffee అంటే తెలుసా? అందులో కాఫీ మాత్రమే ఉండదు. విస్కీ కూడా కలిసి ఉంటుంది! పై భాగాన చిక్కటి క్రీమ్ ఉంటుంది. సాధారణంగా దీనిని గ్లాసులో నింపి ఇస్తుంటారు.
 ఇవండీ...  coffee కలిసిన కొన్ని పదబంధాలు. ఇక ఇండియమ్స్ అంటారా... పెద్దగా ఏం లేవు. బాగా వాడుకలో ఉన్నది మాత్రం wake up and smell the coffee. . అంటే... కళ్లు తెరిచి, నిజం చూడమని.  
 
 ఇంగ్లిషు నవలలు చదివేవారికి తరచు coffee and అనీ, coffee and Danish అనీ రెండు మాటలు తగులుతుంటాయి. చదువుతున్న వారికి సందర్భాన్ని బట్టి వాటి అర్థం తెలిసిపోతుంది. coffee and అంటే కాఫీతో పాటు డోనట్, పేస్త్రీ కూడా లాగించారని. గ్ఛిWe stopped at a little shop for coffee andఅంటే కాఫీ మరియు వగైరా  అని అర్థం చేసుకోవాలి తప్ప  and తో వాక్యం ఎండ్ ఎలా అయిందని అనుకోనవసరం లేదు.
 coffee and Danish  అన్నా కూడా ఇదే అర్థం. a cup of coffee and a Danish sweet roll అని. కాఫీతో పాటు డ్యానిష్ రోల్ తినే సంప్రదాయ కారణంగా ఈ నానుడి పుట్టింది.
 
 
 నల్లగా దెయ్యంలా... వేడిగా నరకంలా..!
 పద్దెనిమిదో శతాబ్దపు ఫ్రెంచి తత్వవేత్త ఓల్టేర్ రోజుకి యాభై కప్పుల కాఫీ తాగేవారట! కాఫీ అంటే అంత ప్రాణం ఆయనకు. ‘ఎందుకలా తాగుతారు? అది స్లో పాయిజన్ కదా’ అని సన్నిహితులు హెచ్చరిస్తే... ‘నిజమే. స్లో పాయిజనే. అరవై ఐదేళ్లుగా కాఫీ తాగుతున్నా... నేనింకా చనిపోలేదు’ అని నవ్వేవారట. ఓల్టేర్ 83 ఏళ్లు జీవించారు.
 ఫ్రాన్సులోనే ఓల్టేర్ కాలంలో టాలీర్యాండ్ అనే దౌత్యవేత్త ఒకాయన ఉండేవారు. ఆయనక్కూడా కాఫీ అంటే చచ్చేంత ఇష్టం. ఆయనకు మామూలు స్ట్రాంగ్ సరిపోదు. ‘‘కాఫీ అంటే ఎలా ఉండాలో తెలుసా? నల్లగా దెయ్యంలా, వేడిగా నరకంలా, స్వచ్ఛంగా దేవదూతలా, తియ్యగా ప్రేమలా’’ అని barista లకు క్లాసు పీకి... ఇప్పుడు చెప్పిన లక్షణాలతో కాఫీని తయారుచేసి పట్రమ్మనేవారట టాలీర్యాండ్.
 barista(బరిస్టా) అంటే కాఫీ తయారుచేయడంలో నైపుణ్యం ఉన్న వ్యక్తి. పెద్దపెద్ద రెస్టారెంట్‌లలో బరిస్టాలు ఉంటారు. బరిస్టా పేరుతో ప్రపంచవ్యాప్తంగా కాఫీ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.  
 మరి ఓల్టేర్‌లా, టాలీర్యాండ్‌లా కాఫీని నిర్విరామంగా గ్రోలుతుండే వారిని ఏమంటారు? cof-fee-hol-i-c-(s) అట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement