నివృత్తం: భర్తకు ఎడమవైపునే భార్య ఎందుకుండాలి?
పెళ్లి దగ్గర్నుంచి ప్రతి వేడుకలోనూ భార్యను భర్తకు ఎడమవైపునే ఉండమని చెబుతుంటారు పెద్దలు. ఇలా ఎందుకు అంటే... మనిషికి హృదయం ఎడమవైపున ఉంటుంది కాబట్టి ఆ హృదయంలో స్థానం సంపాదించడానికి అక్కడే ఉండాలని కొందరు చెబుతుంటారు. అయితే నిజానికి ఇలా ఎడమపక్క నిలబడటం అనేది ఓ అలవాటు దగ్గర్నుంచి సంప్రదాయంగా మారింది. పూర్వం రాజులు తమతో ఎప్పుడూ ఆయుధాలను ఉంచుకునేవారు. అమ్ముల పొదిని వీపునకు కుడివైపున తగిలించుకునేవారు. అటు పక్కన నిలబడితే పొరపాటున ఆ బాణాలు గుచ్చుకుంటాయేమోనని భార్యను ఎడమపక్కన ఉంచుకునేవారు. అది కాస్తా తర్వాత సంప్రదాయంగా మారింది.
మొదల్లేదు మొగుడా అంటే.. పెసరపప్పు వండవే పెళ్లామా అన్నాట్ట!
ఒకసారి ఓ వ్యక్తి తన స్నేహితుడిని ఇంటికి తీసుకొచ్చాడు. వంట చేసి భోజనం పెట్టమని భార్యతో అన్నాడు. దాంతో ఆమె కంగారుపడి... ‘ఏం వండిపెట్టను, ఇంట్లో కనీసం కందిపప్పు కూడా లేదు’ అంది. వెంటనే అతగాడు... ‘అయితే ఏం పోయింది, పెసరపప్పు వండు’ అన్నాడు అమాయకంగా. భర్తగారి తెలివికి భార్య తలకొట్టుకుంది. ఇదంతా చూసిన ఆ స్నేహితుడు ఇంటికెళ్లి జరిగినదంతా తన భార్యకు చెప్పాడు. మెల్లగా ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. అప్పట్నుంచీ ఎవరైనా అమాయకంగా మాట్లాడితే ఈ సామెత చెప్పడం మొదలైంది.