దశరాజ యుద్ధానికి కారణమైన పురోహితులు? | Dasaraja priests caused the war? | Sakshi
Sakshi News home page

దశరాజ యుద్ధానికి కారణమైన పురోహితులు?

Published Sun, Jan 18 2015 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

Dasaraja priests caused the war?

వైదిక నాగరికత - 2
తొలి వేద కాలంలో ఆర్యులు ప్రధానంగా సప్తసింధూ ప్రాంతానికే పరిమితమయ్యారు. తూర్పున యమునా నదిని దాటి విస్తరించలేదు. అందుకే తొలివేద కాలానికి చెందిన రుగ్వేదంలో సింధూ, దాని ఐదు ఉపనదులతోపాటు సరస్వతిని అధికంగా ప్రస్తావించారు. కానీ మలివేద కాలానికి ఆర్యులు యమునా నదిని దాటి గంగామైదాన ప్రాంతానికి విస్తరించారు. ఈ భౌగోళిక విస్తరణతో పాటే మలివేద కాలం నాటికి ఆర్యుల ఆర్థిక, సామాజిక, రాజకీయ, మత వ్యవస్థల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.
 
వైదిక నాగరికత లక్షణాలు
సామాజిక వ్యవస్థ: ఆర్యులు భారతదేశంలో వర్ణ వ్యవస్థను ప్రవేశపెట్టారు. సమాజాన్ని నాలుగు వర్ణాలుగా విభజించారు. ఇందులో మొదటి మూడు వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ద్విజులుగా పరిగణించారు. నాలుగో వర్ణమైన శూద్రులు రుగ్వేద కాలం చివరలో కనిపిస్తారు. అయితే ఈ వర్ణ వ్యవస్థ అంత కఠినంగా లేదు. ఏ వర్ణం వారైనా ఏ వృత్తినైనా చేపట్టవచ్చు. వర్ణాంతర వివాహాలు అధికంగానే జరిగేవి. అయితే అనులోమ వివాహాల సంఖ్య అధికంగా ఉంది. ఆనాటి సమాజంలో పైన పేర్కొన్న నాలుగు వర్ణాలతోపాటు దస్యులు అనే మరొక వర్గం కూడా ఉంది.

వీరు ఆర్యుల చేతిలో ఓడిపోయిన స్థానిక ప్రజలు. వాస్తవంగా ‘వర్ణం’ అనే పదానికి రంగు అని అర్థం. నలుపు వర్ణంలో ఉన్న స్థానిక ప్రజలను సూచించేందుకు దీన్ని వాడారు. నాటి సమాజంలో స్త్రీలకు గౌరవప్రదమైన స్థానం ఉండేది. పాలనా సభల్లో కూడా మహిళలకు ప్రాతినిధ్యం ఉంది. స్త్రీలు భర్తతోపాటు యజ్ఞ యాగాది క్రతువుల్లో పాల్గొనేవారు. తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలోనూ స్వేచ్ఛ ఉండేది. వీరికి విద్యా హక్కు కూడా ఉండేది. ఉన్నత విద్యను అభ్యసించిన 20 మంది మహిళా మేధావుల ప్రస్తావన రుగ్వేదంలో కనిపిస్తోంది. బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి దురాచారాలకు తావు లేదు.

వితంతు పునర్వివాహాలకు, నియోగ వివాహాలకు అవకాశముండేది. అపాల, విశ్వవర, ఘోష మొదలైన బ్రహ్మవాదినులు.. జీవితాంతం వివాహం లేకుండా విద్యార్జనకే తమ జీవితాలను అంకితం చేసినట్లు తెలుస్తోంది. రుగ్వేదంలోని చాలా శ్లోకాలను మహిళలే రచించారని చరిత్రకారుల అభిప్రాయం. బృహదారణ్యక ఉపనిషత్‌లో గార్గి అనే బ్రహ్మవాదినికి యజ్ఞవల్క్య మహర్షికి మధ్య జరిగిన చర్చల ప్రస్తావన ఉంది.
     
మలివేద కాలం నాటికి చాతుర్వర్ణ వ్యవస్థ బాగా స్థిరపడింది. వర్ణ వ్యవస్థ కఠినంగా మారింది. దీనికితోడు వర్ణాశ్రమ ధర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం జీవితాన్ని బ్రహ్మచర్యం, గృహస్తం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు దశలుగా విభజించారు. ఒకే వర్ణానికి చెందిన వారి మధ్య మాత్రమే వివాహాలను అనుమతించేవారు. గోత్ర సంప్రదాయం అమల్లోకి వచ్చింది. ఒకే గోత్రానికి చెందిన వారి మధ్య వివాహాలను అనుమతించేవారు కాదు. వర్ణాంతర వివాహాలు నిషేధించినా అవి ఆగలేదు.

అందుకే వర్ణ సంకర సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈ కాలంలోనే అష్ట వివాహ పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇందులో బ్రహ్మ, దైవ, అర్స, ప్రజాపత్య, గాంధర్వ, అసుర, రాక్షస, పైశాచ అనే 8 రకాల పద్ధతులున్నాయి. వీటిలో గాంధర్వ, రాక్షస వివాహాలకు క్షత్రియులను అనుమతించారు. వర్ణాంతర వివాహాల వల్ల సమాజంలో అనేక మిశ్రమ కులాలు వచ్చి చేరాయి. రుగ్వేద కాలంతో పోలిస్తే స్త్రీల గౌరవ మర్యాదలు క్షీణించాయి. వారిపై అనేక రకాలైన ఆంక్షలను విధించారు.

స్త్రీలకు సంబంధించి అనేక సామాజిక దురాచారాలు ప్రారంభమయ్యాయి. బాల్య వివాహాలు, సతీ సహగమనం, వితంతు వివాహాలను నిషేధించారు. వేదాధ్యయనం చేసే అవకాశం స్త్రీలకు లేదు. పున్నామ నరకాన్ని తప్పించేవాడు అని పుత్ర సంతానానికి ప్రాధాన్యం పెరిగింది. సభ, సమితి వంటి వాటిలోనూ స్త్రీలకు సభ్యత్వం లేకుండా పోయింది.
 
ఆర్థిక వ్యవస్థ: రుగ్వేద ఆర్యుల ప్రధాన వృత్తి పశుపోషణ. కాబట్టి గోవులకు అమిత ప్రాధాన్యతనిచ్చారు. రుగ్వేదంలో ‘గోవ్’ అనే పదాన్ని 176 సార్లు ప్రస్తావించారు. వీరి సంపదకు మూలం పశువులే. కాబట్టి పశువుల దొంగతనాలను ఘోరాపరాధంగా పరిగణించేవారు. ఈ నేరానికి కఠినమైన శిక్షలుండేవి. ఆ కాలంలో ‘పాణిలు’ అనేవారు పశువుల దొంగతనాలకు పాల్పడేవారు. పశు సంపదను రక్షించడం రాజన్ ముఖ్య విధి. కాబట్టి రాజన్‌ను ‘గోప, గోపతి’ అనే పేర్లతో పిలిచేవారు.

సంపన్నమైన వ్యక్తిని ‘గోమత్’ అనేవారు. ‘గవిష్టి’ అంటే గోవుల కోసం చేసే యుద్ధం లేదా గోవుల కోసం వెదకడం అని అర్థం. ఈ విధంగా వీరి ఆర్థిక వ్యవస్థలో సమస్త పదాలు గోవులతో ముడిపడి ఉండడాన్ని బట్టి చూస్తే పశువులు రుగ్వేదార్యుల ఆర్థిక వ్యవస్థలో ముఖ్య స్థానం ఆక్రమించినట్లు తెలుస్తోంది. పశుపోషణ తర్వాత ఆర్యుల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఇంకా స్థిర జీవనం ఏర్పడనందున వ్యవసాయాన్ని పరిమితంగానే చేపట్టారు. వీరి ముఖ్య పంటలు గోధుమ, బార్లీ. తొలివేద కాలంలో అనేక రకాల చేతివృత్తుల వారు ఉన్నారు. చేతివృత్తుల్లో రథాలను తయారు చేసే రథకారులకు (వడ్రంగులు) ప్రముఖ స్థానముండేది.
 
ఇంకా ఇతర వృత్తుల్లో వస్త్రాలు, కుండలు, చర్మ వస్తువుల తయారీ మొదలైనవి పేర్కొనదగినవి. లోహాన్ని ‘ఆయాస్’ అని పిలిచారు. లోహ వస్తువులను తయారు చేసేవారిని ‘కర్మార’ అనేవారు. ఆ కాలంలో రాగి లేదా కంచును అధికంగా ఉపయోగించారు. తొలివేద కాలంలో పరిమిత స్థాయిలో వ్యాపార, వాణిజ్యాలు జరిగాయి. రుగ్వేదంలో ‘నిష్క’ అనే నిర్దిష్ట విలువ కలిగిన బంగారు ఆభరణం గురించి ప్రస్తావన ఉంది. దీన్ని నాణెంగా ఉపయోగించారని కొందరి అభిప్రాయం. అయినప్పటికీ వాణిజ్యం ప్రధానం వస్తు మార్పిడి పద్ధతిలోనే జరిగేది. వేదాల్లో ‘ఫణి’ అనే అనార్య జాతికి చెందిన వ్యాపారస్థుల ప్రస్తావన ఉంది.
 
మలివేద కాలానికి ఆర్యుల ఆర్థిక జీవనంలో పెనుమార్పులు సంభవించాయి. దీనికి ప్రధాన కారణం వీరు సప్త సింధూ నుంచి ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన గంగా మైదానానికి విస్తరించడమే. ఈ విస్తరణకు ఇనుప పరిజ్ఞానం తోడై ఆర్యుల ఆర్థిక వ్యవస్థ వ్యవసాయాధార ఆర్థిక వ్యవస్థగా మారడానికి కారణమైంది. ఇనుమును వీరు ‘కృష్ణ ఆయా’ లేదా ‘శ్యామ ఆయా’ అని పిలిచారు. ఇనుప నాగళ్ల ఉపయోగం ప్రారంభమైంది. శతపథ బ్రాహ్మణంలో వివిధ రకాలైన వ్యవసాయ కార్యకలాపాల గురించిన ప్రస్తావన ఉంది.

గోధుమ, బార్లీతోపాటు వరి ప్రధాన పంటగా రూపొందింది. ఈ వ్యవసాయాభివృద్ధి వల్ల ఆర్యుల సంచార జీవితం అంతమై స్థిర జీవనం ప్రారంభమైంది. తొలివేద కాలంతో పోలిస్తే వృత్తుల సంఖ్య కూడా పెరిగింది. లోహకారులకు ప్రాధాన్యం పెరిగింది. ఈ అభివృద్ధి అంతా కలిసి చిన్న చిన్న పట్టణాలు ఏర్పడటానికి దారి తీసింది. మలివేద గ్రంథాల్లో కనిపించే ‘నగరం’ అనే పదాన్ని ఈ పట్టణాలకు సంకేతంగా భావించవచ్చు. అయితే వాస్తవంగా పట్టణాలు ఏర్పడింది మాత్రం మలివేద యుగం చివరలో మాత్రమే.

మలివేద గ్రంథాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్య పట్టణాలు.. కాశీ, కౌశాంబి, వైదేహ, అయోధ్య, హస్తినాపూర్, ఇంద్రప్రస్థ మొదలైనవి. విస్తృత వ్యవసాయం, స్థిరమైన జీవన విధానం, పట్టణ జీవితం, చేతి వృత్తులు ఇవన్నీ కలిసి వ్యాపార వాణిజ్యాల అభివృద్ధికి దోహదపడ్డాయి. దీంతో వ్యాపార నిర్వహణకు వ్యాపారస్తులు ‘శ్రేణులు’ లేదా ‘గణ’లుగా ఏర్పడ్డారు. రుగ్వేద కాలపు నిష్కతోపాటు అనేక రకాలైన నాణేలు వచ్చాయి. అవి.. శతమాన, క్రిష్ణాల, సువర్ణ, హిరణ్య పిండ మొదలైనవి.

బృహదారణ్యక ఉపనిషత్‌లో ‘పడ’ అనే నాణెం ప్రస్తావన ఉంది. అయితే వాస్తవంగా ఇవన్నీ నిర్ణీత విలువ కలిగిన ఆభరణాలు మాత్రమే. అసలైన నాణేలు వాస్తవంగా క్రీ.పూ. 6వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. అవే విద్ధాంక నాణేలు. అధర్వణ వేదం సంతల గురించి, అక్కడి సందడిని గురించి ప్రస్తావిస్తోంది. ఈ కాలంలో వడ్డీ వ్యాపారం కూడా ఒక వృత్తిగా గుర్తింపు పొందింది. వడ్డీ వ్యాపారిని ‘కుసిదిన్’ అని పిలిచేవారు.
 
రాజకీయ వ్యవస్థ: రుగ్వేద కాలంలో పూర్తిస్థాయి రాచరిక వ్యవస్థ ఏర్పడలేదు. పాలక వర్గాలను రాజన్య అని పిలిచేవారు. ఈ వర్గాల నుంచే రాజన్‌ను ఎన్నుకునేవారు. రాజన్‌ను రాజుగా కంటే తెగ నాయకుడిగా పరిగణించడమే సబబుగా ఉంటుంది. రాజన్ ముఖ్య విధి ప్రజలను కాపాడడంతోపాటు వారి ప్రధాన సంపద అయిన గోవులను దొంగిలింపకుండా కాపాడటం. దీని కోసం గూఢచారులను నియమించేవారు. ఇంకా పురోహితుడు, సేనాపతి, ప్రజాపతి మొదలైన వారు రాజుకు సహాయకులుగా ఉండేవారు.

‘ప్రజాపతి’ ముఖ్య విధి గడ్డి మైదానాల పర్యవేక్షణ. రుగ్వేద కాలంలో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ప్రసిద్ధి చెందిన పురోహితులు. దశరాజ యుద్ధానికి వీరు పరోక్ష కారకులు. రుగ్వేద కాలంలో కుటుంబాన్ని ‘కుల’ అన్నారు. కుటుంబ పెద్దను ‘కులప’ అని పిలిచేవారు. కొన్ని కులాల కలయికతో ఏర్పడేదే గ్రామం. దీనికి ‘గ్రామణి’ అధిపతిగా ఉండేవాడు. కొన్ని గ్రామాల సమూహాన్ని ‘విస్’ అనేవారు. దీనికి విస్పతి అధిపతిగా ఉండేవాడు. ఇలాంటి విస్‌ల సముదాయంతో ‘జన’ లేదా ‘తెగ’ ఏర్పడుతుంది.

దీని నాయకుడే ‘రాజన్’. అయితే రుగ్వేద కాలంలో రాజన్ అధికారం అపరిమితమైంది కాదు. సభ, సమితి, విధాత, గణ అనే ప్రజా సభలు రాజన్ అధికారాన్ని నియంత్రించేవి. రుగ్వేదంలో బలి, భాగ అనే పన్నుల ప్రస్తావన ఉంది. ఇవి వాస్తవంగా పన్నులు కావు. ‘బలి’ అనేది ప్రజలు రాజుకు ఇచ్చే కానుకలు. ‘భాగ’ అనేది యుద్ధంలో కొల్లగొట్టిన సంపదలో రాజు వాటా.
 
మలివేద కాలానికి ఆర్యులు స్థిర జీవనానికి అలవాటు పడ్డారు. కాబట్టి రుగ్వేద కాలం నాటి తెగల ఆధారిత పాలనా వ్యవస్థ స్థానంలో ప్రదేశం ఆధారిత పాలనా వ్యవస్థ ఏర్పడింది. వీటినే ‘జనపదాలు’ అంటారు. ఈ కాలంలో రాజన్ కేవలం గోవులను రక్షించే గోపతి మాత్రమే కాదు.. సుశిక్షిత సైన్యాన్ని కలిగి ఉండి పక్క రాజ్యాలను ఆక్రమించే స్థాయికి ఎదిగాడు. దీనికోసం రాజసూయ, అశ్వమేధ, వాజపేయ వంటి యజ్ఞ, యాగాలూ ప్రారంభమయ్యాయి. రాజుపై నియంత్రణాధికారమున్న సభలు క్షీణించి సభ, సమితులు మాత్రమే మిగిలాయి.

అవి కూడా నామమాత్రపు సలహా మండళ్లుగా మారిపోయాయి. దీనివల్ల సభలతో ఎంపికయ్యే రాజన్ పదవి వంశపారంపర్య పదవిగా మారిపోయింది. ఈ కాలంలో రాజుకు సహాయ సహకారాలు అందించేందుకు ‘ద్వాదశ రత్నిన్’ అనే మంత్రి మండలి ఏర్పడింది. వీరిలో ప్రధాన పురోహితుడు, పట్టమహిషి, సేనాని, సూత, సంగ్రహిత్రి, భాగదుఘ, అక్షావాప, గోవికర్తన, గ్రామణి మొదలైనవారు సభ్యులుగా ఉండేవారు. బలి, భాగ అనేవి పూర్తిస్థాయి పన్నులుగా మారాయి. వాటి వసూలుకు బాగదుఘ అనే అధికారి ఉండేవాడు. అయినప్పటికీ ఈ కాలానికి పూర్తిస్థాయి అధికార యంత్రాంగం మాత్రం ఏర్పడలేదు.
 
మత వ్యవస్థ: రుగ్వేద కాలపు ఆర్యులు ప్రకృతి శక్తులను అర్థం చేసుకోలేకపోవడంతో వాటికి దైవత్వాన్ని ఆపాదించారు. మానవ రూపమిచ్చి పూజించారు. రుగ్వేదంలో మొత్తం 33 మంది దేవతల ప్రస్తావన ఉంది. వీరందరిలో అతిముఖ్య దైవం ఇంద్రుడు లేదా పురంధరుడు. ఇతడు యుద్ధ దేవత. రెండో ముఖ్య దైవం అగ్ని. ఇతడిని మానవులకు, దేవతలకు మధ్య వారధిగా భావించారు.

వరుణుడు ప్రకృతిని క్రమబద్ధీకరించే దేవత. ఇంకా సోమ, ఉషస్, అదితి, పృథ్వీ, అరణ్యాని మొదలైన దేవతల ప్రస్తావన ఉంది. వీరి పూజా విధానంలో భక్తికి ప్రాధాన్యముండేది. భక్తి శ్లోకాలను ఆలపించడం, కానుకలను సమర్పించడం ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. తమకు ప్రీతిపాత్రమైన సోమ, సుర అనే పానీయాల్ని నైవేద్యంగా సమర్పించేవారు. వీరు ప్రధానంగా సంతానం, పశు సంపద కోసం దేవతలను ప్రార్థించారు.
 
మలివేద కాలానికి రుగ్వేదపు ప్రధాన దేవతల ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇంద్రుడు, అగ్ని వంటి దేవతల స్థానాన్ని త్రిమూర్తులు ఆక్రమించారు. రుగ్వేదపు ప్రధాన దేవతలు అష్టదిక్పాలకులుగా మారిపోయారు. సృష్టికర్త అయిన ప్రజాపతి ప్రధాన దేవతగా, రుద్రుడు, విష్ణువు మొదలైనవారు ఇతర ముఖ్య దేవతలుగా అవతరించారు. ఈ కాలంలో వచ్చిన మరొక ముఖ్యమైన మార్పు వర్ణాల వారీగా దేవతలు ఏర్పడటం.

ఈ విధంగా ఏర్పడిన దేవతే ‘పుషాన్’ అనే శూద్రుల దేవత. ఆర్యుల పూజా విధానంలోనూ మార్పులు సంభవించాయి. భక్తి ప్రాధాన్యత తగ్గి యజ్ఞ యాగాలు, బలిదానాలకు ప్రాధాన్యత పెరిగింది. విపరీతమైన జంతు బలుల వల్ల పశు సంపదకు పెద్ద నష్టం వాటిల్లింది. మోక్ష మార్గం సంక్లిష్టం, వ్యయభరితం అవడమే కాకుండా శూద్రులు, స్త్రీలు వంటి కొన్ని వర్గాలకు మోక్ష మార్గాన్ని నిరాకరించారు. మలివేద కాలంలోని మత వ్యవస్థలో చోటు చేసుకున్న ఈ పరిణామాలన్నీ కలిసి వైదిక యుగం చివరినాటికి అంటే క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి వైదిక మతంపై తిరుగుబాటుగా అనేక మత ఉద్యమాలు రావడానికి కారణమయ్యాయి.


 మాదిరి ప్రశ్నలు
     1.    వేద కాలం నాటి ‘పాణిలు’ అంటే?
         1) నాణేలు    2) సైనిక వర్గం
         3) వ్యాపారులు   4)పశువుల దొంగలు
     2.    రుగ్వేదంలో వ్యవసాయదారుడిని ఏ పేరు తో సూచించారు?
         1) కినాస    2) శూద్ర
         3) క్షేత్రక    4) కర్షక
     3.    తప్పుగా జతపర్చిన దాన్ని గుర్తించండి?
         1) గోఘన - అతిథి
         2) దౌహిత్రి - కూతురు
         3) గోప - పశుకాపరి
         4) గవిష్టి - యుద్ధం
     4.    వీరిలో పురోహితుల దైవం?
         1) ఇంద్రుడు    2) అగ్ని
         3) వరుణుడు    4) సూర్యుడు
     5.    వైదిక యుగంలోని ఏ సభలను ప్రజాపతి (బ్రహ్మ) పుత్రికలుగా భావిస్తారు?
         1) సభ, సమితి    2) సమితి, విధాత
         3) విధాత, గణ    4) గణ, పరిషత్
 
 సమాధానాలు
 1) 4;     2) 1;     3) 3;    4) 2;    5) 1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement