* పంట రుణాలపై ఆర్‌బీఐకి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
* కరువు, వరద మండలాల్లో రీ షెడ్యూల్ అయ్యే రుణాల విలువ ఐదు వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరువు, వరద మండలాల జాబితాలో అదనంగా మరో 78 మండలాలను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాను కోరనుంది. ఈ మేరకు ఆర్‌బీఐకి తాజాగా లేఖ రాయాలని నిర్ణయించింది. ఆర్‌బీఐ కేవలం ఖరీఫ్ పంట రుణాలు మాత్రమే రీ షెడ్యూల్ చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తూ, రుణాలు తిరిగి చెల్లించడానికి మూడేళ్ల గడువు పెట్టిన సంగతి విదితమే.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన లేఖను పరిశీలించిన ఆర్థిక శాఖవర్గాలు రీ షెడ్యూల్ చేయనున్నట్లు భావిస్తున్న మండలాల్లో ఖరీఫ్ రుణాలు కేవలం ఐదువేల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నట్లు అంచనా వేశాయి.రుణాలు తిరిగి చెల్లించే గడువును పొడిగించాలని కూడా ప్రభుత్వం ఆర్‌బీఐని కోరనుంది.
ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు గతేడాది రుణాల రెన్యూవల్ కోసం బ్యాంకుల్లో సంతకాలు చేయకపోవడం వల్ల బకాయిలు, బంగారు తాకట్టు రుణాలు కలసి దాదాపు 12,337 కోట్ల రూపాయలున్నాయని అధికారవర్గాలు వివరించాయి.
రబీ సీజన్‌లోనూ పంటలు అకాల వర్షాలు, వడగళ్లతో పూర్తిగా దెబ్బతిన్నాయని, ఆ మండలాలను కూడా రీ షెడ్యూల్ జాబితాలో చేర్చడానికి అన్ని ప్రక్రియలు పూర్తయినప్పటికీ ఉత్తర్వులు ఇవ్వడంలో ఆలస్యం జరగడం వల్ల అవి వరద మండలాల జాబితాలో చేరలేదని అధికారవర్గాలు వివరించాయి. తాజాగా ఈ మండలాలను, కరువు మండలాలను చేర్చడం ద్వారా వీటి సంఖ్య 415కు చేరుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేయాలనుకున్న రుణాల మొత్తం రూ. 17,337 కోట్లు ఉండగా, అందులో ప్రస్తుతం ఐదు వేల కోట్ల రూపాయలు రీ షెడ్యూల్ కాగా.. మిగిలిన 12,337 కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే దీనిని నాలుగైదు వాయిదాల్లో బ్యాంకులకు చెల్లించే విధంగా రిజర్వ్‌బ్యాంకును ఒప్పించడానికి ప్రయత్నిస్తామని ఓ అధికారి తెలిపారు. రైతులు డబ్బు కట్టకుండా.. ప్రభుత్వమే ఆ మొత్తాన్ని సమకూరుస్తుందని వివరించారు.
మరో 78 మండలాల్లో రీ షెడ్యూల్ చేయండి
Published Fri, Jul 18 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM
Advertisement
Advertisement