బంజారాహిల్స్: బెదిరింపులతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ -14లోని నందినగర్‌కు చెందిన సాయి గాయత్రి(17) స్థానిక హిల్‌మెన్ పబ్లిక్ స్కూల్‌లో ఎస్‌ఎస్‌సీ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఈ నెల 17వ తేదీన స్వగ్రామానికి వెళ్లారు. ఈ నెల 18వ తేదీన సాయి గాయత్రి ఇంటికి అదే గల్లీలో నివసిస్తున్న ఓ యువకుడు వచ్చి ఆమెను బెదిరించాడు. అయితే ఎందుకు బెదిరించాడన్నది తెలియకుండా ఉంది.
ఆ తెల్లవారే సదరు యువకుడి తల్లి కూడా వచ్చి గాయత్రిని తీవ్రంగా హెచ్చరించింది. ఇది తట్టుకోలేక గాయత్రి ఫ్యాన్‌కు ఉరేసుకొంది. తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతుండటంతో వెంటనే ఆమెను కిందికి దించి ఆస్పత్రికి తరలించారు. ఏం జరిగిందని తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తెలియజేసింది. రెండు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున చనిపోయింది. ఈ మేరకు మృతురాలి తండ్రి యానాదిబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను బెదిరించిన యువకుడితో పాటు ఆయన తల్లిని విచారించనున్నారు.
తల్లీకొడుకు బెదిరించారని ఆత్మహత్య!
Published Wed, Sep 21 2016 7:03 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
Advertisement
Advertisement