మౌనం ఎందుకు..?
దేశంలో పెచ్చుమీరుతున్న హిందూ మతోన్మాద శక్తుల అరాచకాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోరు మెదపడం లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. దేశంలో రచయితలు, మైనారిటీలు, దళితులపై దాడులు జరుగుతున్నా, ప్రధాని కనీసం వాటిని ఖండించడం లేదని అన్నారు. గురువారం ఆయన ముగ్ధూంభవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
దాద్రీ హింసాకాండపై ప్రధాని ఇప్పటి వరకు నోరు విప్పకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రచయితలు సాహిత్య పురస్కారాలను ప్రభుత్వానికి తిప్పి పంపి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఈ తరహా నిర్లక్ష్యం భారత సెక్యులర్ భావాలకు నష్టం కలిగిస్తుందన్నారు.
ఐక్యరాజ్యసమితిలో భారత్‌తో పాటు జపాన్, జర్మనీలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ప్రధాని కోరడాన్ని సురవరం తప్పుపట్టారు. దీనివల్ల అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. సరిహద్దు దేశాలతో కూడా భారత్ సఖ్యత పాటించడం లేదని విమర్శించారు.
ఆయన స్థాయికి తగదు..
బీహార్ ఎన్నికల్లో మోదీ చేస్తున్న ప్రసంగాలు ఆయన స్థాయిని దిగజారుస్తున్నాయని, ప్రతిపక్ష నాయకులను 'త్రీ ఇడియట్స్'గా అభివర్ణించడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొనానరు. బీహార్‌లో వామపక్షాలు అన్ని స్థానాల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో వామపక్షపార్టీల ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపడం శుభసూచనమని అన్నారు.
కేసీఆర్ పై భ్రమలు లేవు
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలకు ఎలాంటి భ్రమలు లేవన్నారు. అవసరానికి ఇతర పార్టీలను వాడుకొని తరువాత వదిలేయడం కేసీఆర్‌కు అలవాటేనని, మహా చండీయాగం పేరుతో కేసీఆర్ ప్రజాధనాన్ని ఖర్చు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కార్మికశాఖ మంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానిని కలవనున్నట్లు చెప్పారు.
వార్షికోత్సవానికి అంతర్జాతీయ ప్రతినిధులు
సీపీఐ 90వ వార్షికోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 28,29 తేదీల్లో ఆసియా ఖండం స్థాయిలో ఢిల్లీలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో చైనా, వియత్నాం, నేపాల్, పాకిస్తాన్ దేశాల ప్రతినిధులతో పాటు ఆరు వామపక్ష పార్టీల నేతలు కూడా పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ పాల్గొన్నారు.