గ్రేటర్‌లో ‘చెత్త’పన్ను! | The bulk of the sector to prepare the charges garbeji | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో ‘చెత్త’పన్ను!

Published Tue, Jan 3 2017 12:36 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM

గ్రేటర్‌లో ‘చెత్త’పన్ను!

గ్రేటర్‌లో ‘చెత్త’పన్ను!

బల్క్‌ గార్బేజీ చార్జీలకు రంగం సిద్ధం
స్టాండింగ్‌ కమిటీ ఆమోదమే తరువాయి.. వాణిజ్య సంస్థలే లక్ష్యం..
రోజుకు క్వింటాల్‌ చెత్త మించితే రూ.225
సంవత్సరానికి రూ.81,000 చార్జి


సిటీబ్యూరో: స్వచ్ఛ హైదరాబాద్‌ అమలులో భాగంగా జీహెచ్‌ఎంసీ బల్క్‌ గార్బేజీ పన్ను వసూలు చేయనుంది. ఇప్పటికే ఇంటి నుంచి చెత్తను ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ వరకు తరలించేందుకు స్వచ్ఛ కార్మికులకు నెలకు రూ.50 వసూలు చేసుకునే అధికారం కల్పించింది. ఇప్పుడు వాణిజ్య సముదాయాల నుంచీ చెత్త తరలింపు చార్జీలను వసూలు చేయనుంది. నిత్యం వందకిలోల (క్వింటాల్‌) కన్నా ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేసే వాణిజ్య సంస్థల నుంచి కిలోకు రూ.2.25 చొప్పున బల్క్‌ గార్బేజీ చార్జీగా వసూలు చేసేందుకు ప్రతిపాదలను సిద్ధం చేసింది. వీటిని స్టాండింగ్‌ కమిటీ ముందుంచి, ఆమోదం పొందగానే అమలు చేయనుంది. ప్రస్తుతం గ్రేటర్‌లో రోజుకు 4 వేల టన్నుల చెత్తను ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. దీనికి లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. బల్క్‌ గార్బేజీ పన్ను వసూలు చేసినట్టయితే జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం చెత్త తరలింపునకు చేస్తున్న ఖర్చు గణనీయంగా తగ్గనుంది. అయితే, గ్రేటర్‌లో దాదాపు 1.60 లక్షల వాణిజ్య సంస్థలు ఉండగా, వాటిలో ఎన్నింటి నుంచి రోజుకు వంద కిలోల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి అవుతుందో జీహెచ్‌ఎంసీ వద్ద వివరాల్లేవు. ఇప్పటికిప్పుడు ఎవరిపై ఈ చార్జీలు విధించాలో అర్థం కాక ‘సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌’ను తెరపైకి తెచ్చారు. భవిష్యత్తులో సర్వే చేసి గుర్తించిన సంస్థల నుంచి ఈ చార్జీలు వసూలు చేయనున్నారు. వాస్తవానికి రోజుకు పది కిలోలు మించి చెత్తను వెలువరించే వాణిజ్య సంస్థలన్నింటి నుంచి ఈ గార్బేజీ చార్జీలను వసూలు చేయాలని అధికారులు భావించారు. కానీ మున్సిపల్‌ సాలిడ్‌వేస్ట్‌ రూల్స్‌–2016 ప్రకారం రోజుకు వందకిలోల కంటే తక్కువ చెత్త వెలువరించే సంస్థలు బల్క్‌ వేస్ట్‌ జనరేటర్‌గా పరిగణనలోకి రావు. దీంతో న్యాయనిపుణుల సలహా మేరకు ఆ ఆలోచన విరమించుకున్నట్తు తెలుస్తోంది.

గ్రేటర్‌లోని వ్యాపార సంస్థలు:
1.64 లక్షలు వీటిలో రోజుకు 100 కిలోల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేస్తున్న వాటి నుంచి కిలోకు రూ.2.25 వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. వ్యాపార సంస్థ నుంచి చెత్తను ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ వరకు తరలించేందుకు జీహెచ్‌ఎంసీ చేస్తున్న ఖర్చు ఆధారంగా ఈ ధరను నిర్ణయించారు. ఆ వివరాలిలా ఉన్నాయి..
► టన్ను చెత్త తరలించేందుకు జీహెచ్‌ఎంసీ చేస్తున్న ఖర్చు రూ.1820. కిలోకు రూ.1.82. దీనిపై 2 పైసలు తగ్గించి రూ.1.80గా ధర నిర్ణయించారు.

► దీనికి మరో 25 శాతం (0.45 పై) కలిపి బల్క్‌  గార్బేజీ చార్జీలుగా కిలోకు 2.25 వసూలు చేయనున్నారు.

►వాణిజ్య సంస్థ ఆవరణలోనే కంపోస్ట్‌ ఎరువు తయారీకి ఏర్పాట్లు ఉన్నవారికి, బయో మెథనైజేషన్‌ ఏర్పాటు చేసేవారికి ప్రోత్సాహకంగా 0.45 పైసలు తగ్గించి వారినుంచి రూ.1.80 మాత్రమే వసూలు చేయనున్నారు.

ఎన్ని సంస్థలో వివరాల్లేవ్‌..
జీహెచ్‌ఎంసీలో 1.60 లక్షల వ్యాపార సంస్థలున్నప్పటికీ, వాటిలో 100 కిలోల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి అవుతున్న వాటి సమాచారం జీహెచ్‌ఎంసీ వద్ద లేదు. ఇందుకుగాను తొలిదశలో వ్యాపార సంస్థలే సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌తో డిక్లరేషన్‌ ఇవ్వాలని కోరనున్నారు. ఈ చార్జీల వసూలుకు చట్టబద్ధ అధికారాల కోసం ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. స్టాండింగ్‌ కమిటీ, ప్రభుత్వ ఆమోదం అనంతరం వీటిని వసూలు చేయనున్నారు.

ఆది నుంచి వివాదాలే..
బల్క్‌ గార్బేజీ తరలింపుపై ఎప్పుడూ వివాదాలే ఉంటున్నాయి. గతంలో బల్క్‌ గార్బేజ్‌ చార్జీలను ట్రేడ్‌లైసెన్స్‌ ఫీజులో కలిపి వసూలు చేసేవారు. ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేసే హోటళ్లు , ఫంక్షన్‌ హాళ్లకు, తక్కువ చెత్త మాత్రమే వెలువడే సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు సైతం ఒకే విధంగా ఈ చార్జీలు ఉండటంతో వాటిని సవరించారు. ఆయా సంస్థలు వెలువరించే  చెత్తను పరిగణనలోకి తీసుకొని ట్రేడ్‌ల ఆధారంగా బల్క్‌ గార్బేజీ ధరలు నిర్ణయించారు. ఆ తర్వాత దుకాణాలు ఉన్న ప్రదేశాలను (ప్రధాన మార్గాలు,  జంక్షన్లు, ఇంటర్నల్‌ మార్గాలు) బట్టి ట్రేడ్‌ లైసెన్సు ఫీజులను నిర్ణయించారు. ఈ విధానంపై కొందరు కోర్టుకు వెళ్లడం.. స్టే ఇవ్వడంతో బల్క్‌ గార్బేజీ చార్జీలు నిలిపి వేశారు. తిరిగి తాజాగా ఈ చార్జీలకు సిద్ధమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement