కదిలే ప్రకటనలకూ పన్ను కట్టాల్సిందే
కొత్త ప్రకటనల విధానం
జీహెచ్‌ఎంసీ ముసాయిదా విడుదల
అభ్యంతరాలు, సూచనలకు వారం గడువు
సిటీబ్యూరో: ఇప్పటి వరకు హోర్డింగులు, గ్లోసైన్ బోర్డులు, ఫ్లెక్సీబోర్డులపై మాత్రమే ప్రకటనల పన్ను వసూలు చేస్తున్న జీహెచ్‌ఎంసీ.. త్వరలోనే బస్సులు, వ్యాన్లు, క్యాబ్స్, ఆటోలపై ఏర్పాటు చేసే ప్రకటనలతో పాటు సినిమాహాళ్లలో వేసే స్లైడ్స్, షార్ట్ ఫిల్మ్స్, గోడలపై రాతలకు సైతం ప్రకటనల పన్నును వసూలు చేయనుంది.
జీహెచ్‌ఎంసీ చట్టం.. నిబంధనల మేరకు ఏ రూపేణా (కరపత్రం, క్యారీబ్యాగులు, సినిమా స్లైడ్, బస్సులు, ఇ తరత్రా వాహనాలపై )ప్రచారం నిర్వహించినప్పటికీ ప్ర కటనల పన్ను వసూలు చేయవచ్చు. ఈ అంశాన్ని ఇంతవరకు పెద్దగా పట్టించుకోని అధికారులు ఇప్పుడు వీటినుంచీ గణనీయంగా ఆదాయం రాబట్టుకోవచ్చునని అంచనా వేశారు. అందుకనుగుణంగా జీహెచ్‌ఎంసీ ప్రకటనలపై కొత్త విధానాన్ని అమలులోకి తేనుంది. ఈ నేపథ్యంలో పాత విధానంలో మార్పులు చేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ ముసాయిదాను విడుదల చేశారు. ఈ మేరకు గురువా రం నుంచి ముసాయిదాను జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్(డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. జీహెచ్‌ఎంసీ.జీఓవీ.ఐఎన్)లో అందుబాటులో ఉంచుతూ ప్రజలు, ప్రకటనల ఏజెన్సీ లు, స్వచ్ఛందసంస్థల అభిప్రాయాలను ఆహ్వానించింది.
ముసాయిదాలోని ముఖ్యాంశాలు..
ఇకపై భవనాలు, గోడలపైనే కాక భూ ఉపరితలంపై ఎలాంటి ప్రకటన ల బోర్డులు ఏర్పాటు చేయాలన్నా, ప్రద ర్శించాలన్నా జీహెచ్‌ఎంసీ కమిషనర్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. {పజల భద్రత, రోడ్డు భద్రత, ఆయా ప్రాంతాల చారిత్రక ప్రాధాన్యత, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని హోర్డింగ్‌లు, సైనేజీలకు అనుమతినిస్తారు. హోర్డింగ్‌లు,సైనేజీలపై ఎల్‌ఈడీ, ఫ్లాష్‌లైట్లు, హాలోజెన్ లైటింగ్ ఏర్పాట్లకు పోలీసు విభాగం నుంచి అనుమతి తప్పనిసరి.
చారిత్రక, పురావస్తు, వారసత్వ ప్రాధాన్యత కలిగిన భవనాలు, వాటి సమీపంలో ప్రకటనలకు అనుమతించరు. నాలాలు, చెరువులు, శిఖంభూముల్లోనూ ప్రకటనల హోర్డింగులను అనుమతించరు. రోడ్ల జంక్షన్లు, బ్రిడ్జిలు, రైల్వేక్రాసింగ్స్ వంటి ప్రదేశాల్లో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ప్రజలకు ఇబ్బంది లేదని భావిస్తేనే అనుమతిస్తారు. కుల, మత విభేదాలు రెచ్చగొట్టే అంశాలు, జంతువులపై క్రూరత్వం ప్రదర్శించేఅంశాలు, హింసను ప్రేరేపించడం, మహిళలు, పిల్లలను వంచించేవిధంగా ఉండే ప్రకటనలు అనుమతించబోరు.మాదకద్రవ్యాలు, మద్యపానం, సిగరెట్లకు సంబంధించిన ప్రకటనలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన ప్రకటనలను సైతం అనుమతించరు.
హోర్డింగ్‌లు ఏర్పాటు చేసే వారు తాము అనుమతి పొందిన గడువు(సమయం)లో పది శాతం సమయాన్ని ప్రభుత్వం, స్థానికసంస్థలు అమలుచేసే పథకాలు, సామాజిక సందేశాలు ప్రద ర్శించేందుకు ఉచితంగా కేటాయించాల్సి ఉంటుంది. హోర్డింగులకు రాత్రి 7 నుంచి 10 గంటల వరకు మాత్రమే లైటింగ్ ఏర్పాటు చేయాలి. ఎల్‌ఈడీ లైట్లు కాకుండా వేరేవి వాడితే అడ్వర్టయిజ్‌మెంట్ ఫీజులో 20 శాతాన్ని అదనంగా చెల్లించాలి. నగరంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రకటనల విధానాన్ని , ఇతర మెట్రోనగరాల్లో అమలులో ఉన్న ప్రకటనల విధానాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ఈ ముసాయిదాను రూపొందించినట్లు కమిషనర్ తెలిపారు. ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు వారం రోజుల్లోగా అదనపు కమిషనర్(ప్రకటనలు)కు తెలియజేయాలని పేర్కొన్నారు.
హోర్డింగులు, గ్లోసైన్ బోర్డులు, ఫ్లెక్సీబోర్డులపై మాత్రమే కాకుండా బస్సులు, వ్యాన్లు, క్యాబ్స్, ఆటోలపై ప్రదర్శించే ప్రకటనలతో పాటు సినిమాహాళ్లలో వేసే స్లైడ్స్, షార్ట్ ఫిల్మ్స్, గోడలపై రాతలు, ఫ్రేమ్‌లు, కియోస్క్‌లు, ట్రీగార్డులపై ప్రకటనలకుఅడ్వర్టయిజ్‌మెంట్ ట్యాక్స్‌కట్టాల్సిందే. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారికి కనిపించే (చలన, చలనరహిత ) ప్రకటనలన్నింటికీ ఫీజు తప్పనిసరి.
కేటగిరీల వారీగా..
ఆయాప్రాంతాల్లోని డిమాండ్‌బట్టి నగరాన్ని మూడు కేటగిరీలుగా విభజించారు. కేటగిరీని బట్టి ప్రకటనల ఫీజులుంటాయి.
ఎస్ కేటగిరీ: అన్ని మెట్రో కారిడార్లు, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఔటర్‌రింగ్‌రోడ్డు ఏ కేటగిరీ: ఎస్ కేటగిరీలో లేని , రహదారుల వెడల్పు 60 అడుగులు, అంతకుమించి ఉన్న ప్రాంతాల్లో బీ కేటగిరీ: ఎస్, ఏ కేటగిరీల్లో లేని జీహెచ్‌ఎంసీ పరిధిలోని 60 అడుగుల కంటే తక్కువ వెడల్పు రోడ్డున్న ప్రాంతాలు.