గాగుల్స్ పెట్టుకుందని.. సస్పెండ్ చేసేశారు!
ఆమె ఒక టీవీ జర్నలిస్టు. విధి నిర్వహణలో భాగంగా బయటకు వెళ్లినప్పుడు ఎండ ఎక్కువగా ఉందని గాగుల్స్ పెట్టుకుని, గొడుగు వేసుకుని ఇంటర్వ్యూ చేస్తోంది. అలా ఉండగా ఆమె ఫొటోలు బయటకు వచ్చాయి.. అంతే, ఆమె ఉద్యోగం నుంచి సస్పెండ్ అయింది!! మెరాంటీ టైఫూన్ నుంచి కోలుకుంటున్న షియామెన్ నగరం పరిస్థితి గురించి చెప్పేందుకు ఆమె ఒక ఇంటర్వ్యూ చేస్తోంది. అయితే ఆ సందర్భానికి, ఆమె ఆహార్యానికి సంబంధం లేదని సదరు అధికారులు భావించారు. ఆమె ఇంటర్వ్యూ చేస్తున్న వలంటీర్లు.. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె వేసుకున్న దుస్తులు, పెట్టుకున్న గాగుల్స్, పట్టుకున్న గొడుగు.. ఇవన్నీ వృత్తిధర్మాన్ని పాటించేలా లేవని అన్నారు. ఆమె ఫొటో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తమ జర్నలిస్టులలో ఒకరు తమ నిబంధనలను పాటించలేదని, సక్రమంగా ఇంటర్వ్యూ చేయడంలో విఫలమైందని షియామెన్ టీవీ స్టేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఆమె గాగుల్స్ పెట్టుకున్న సందర్భాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని షాంఘైకి చెందిన మరో మహిళా జర్నలిస్టు యిజింగ్ లిన్ అన్నారు. అయితే సస్పెండయిన జర్నలిస్టు ఉద్యోగం ఉందా.. పూర్తిగా తీసేశారా అన్న విషయం మాత్రం తెలియలేదు.