బురఖా స్విమ్‌సూట్లపై నిషేధం ఎందుకు? | French mayors face anger over ban of burkinis | Sakshi
Sakshi News home page

బురఖా స్విమ్‌సూట్లపై నిషేధం ఎందుకు?

Published Fri, Aug 26 2016 1:52 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

బురఖా స్విమ్‌సూట్లపై నిషేధం ఎందుకు?

బురఖా స్విమ్‌సూట్లపై నిషేధం ఎందుకు?

బురఖా తరహాలో ఉండే స్విమ్‌సూట్లను నిషేధించడంతో ఫ్రెంచి మేయర్లపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముస్లిం మహిళలు ఈత పోటీలలో పాల్గొనేందుకు వీలుగా బురఖా తరహాలో ఉండే స్విమ్ సూట్లను రూపొందించారు. వీటిని బుర్కినీలు అంటున్నారు. దాదాపు దశాబ్దం క్రితమే లెబనీస్ జాతికి చెందిన ఆస్ట్రేలియన్ మహిళ ఒకరు ముస్లింలు ధరించేందుకు వీలుగా స్విమ్‌సూట్లను రూపొందించారు. దాన్నే బుర్కినీ లేదా బుర్ఖినీ అంటున్నారు. ఇవి తల నుంచి పాదాల వరకు మొత్తం ఉంటాయి. ఫ్రాన్స్‌లో ఇవి అంతగా కనిపించేవి కావు. సాధారణంగా అక్కడ సన్‌బాత్ కోసం మహిళలు అర్ధనగ్నంగా బీచ్‌లలో విశ్రాంతి తీసుకుంటారు.

ఇప్పుడు బుర్ఖినీలు ధరించినంత మాత్రాన తాము హింసను ప్రోత్సహిస్తున్నట్లు ఏమీ కాదని బుర్కినీని సమర్థించేవాళ్లు చెబుతున్నారు. కానీ వీళ్లు ఇలాంటి దుస్తులు ధరించి బీచ్‌లకు వెళ్లడం వల్ల ఇతరులు కోపానికి లేదా భయానికి గురవుతారని మేయర్లు వాదిస్తున్నారు. పురుషులు బ్యాగీలు ధరించి స్విమ్మింగ్ పూల్స్‌లోకి వెళ్లకూడదని గతంలో చెప్పిన ఫ్రాన్సు.. ఇప్పుడు మహిళలు ధరించే ఈత దుస్తుల వల్ల కూడా ప్రజారోగ్యానికి భంగం వాటిల్లకుండా ఉండాలని చెబుతోంది.

బహిరంగ ప్రదేశాల్లో లౌకిక వాదానికి కట్టుబడి ఉండాలన్నది ఎన్నో శతాబ్దాల నుంచి ఫ్రాన్సులో అమలులో ఉందని, ఫ్రెంచి రాజ్యాంగంలోని మొదటి అధికరణంలోనే ఈ సూత్రం ఉందని అంటున్నారు. ప్రపంచంలోనే మత విశ్వాసాలు తక్కువగా ఉన్న దేశాల్లో ఫ్రాన్సు ఒకటని సర్వేలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement