పీవోకే విముక్తికి ప్రచారం చేపట్టండి..!
రోఠక్ః పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విముక్తికోసం భారీ ఎత్తున ప్రచారం చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. యోగాగురు రామ్ దేవ్ బాబా విన్నవించారు. ఎన్నికల్లో ఐఎస్ ఐ రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తూ స్థానికుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో పీవోకే విముక్తికోసం ప్రయత్నించాలని రామ్ దేవ్ ప్రధానిని కోరారు. పాకిస్తాన్ లాంటి దేశమే కశ్మీర్ ను ఆక్రమించగల్గినప్పుడు గొప్ప దేశమైన భారత్ ఎందుకు చూస్తూ ఊరుకోవాలని బాబా ప్రశ్నించారు.
జూలై లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ స్థానికులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగా గురు రామ్ దేవ్ స్పందించారు. పీవోకే విముక్తికోసం ప్రయత్నించేందుకు వెంటనే ప్రచారం చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కశ్మీర్ ఎలాగైనా తమ సొంతమేననడానికి నవాజ్ షరీఫ్ కు ఎన్నిగుండెలంటూ ప్రశ్నించారు. కశ్మీర్ లోని మన ప్రజలు కేవలం చెప్పుకోడానికేనన్నట్లుందని, పాకిస్తాన్ వారిని ఇప్పటికే ఆక్రమించేంసిందని అన్నారు. గొప్పదేశమైన భారత్ లోని భూభాగాన్ని పాక్ ఆక్రమిస్తుంటే చూస్తూ నెమ్మదిగా ఊరుకునేది లేదన్నారు.
పీవోకే ఎలక్షన్లలో రిగ్గింగ్ జరిగిందంటూ ఆగ్రహించిన నీలం వ్యాలీ ప్రాంతంలోని స్థానికులు ఏకంగా పాకిస్తానీ జెండాను సైతం తగులబెట్టి, ఆందోళనలు చేపట్టిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో స్థానికులకు సహకరించి, ఆక్రమిత కశ్మీర్ విముక్తికి ప్రచారం చేపట్టాలని రామ్ దేవ్ బాబా ప్రధానిని కోరారు.