తప్పు ఒప్పుకున్న కంపెనీ...విస్తృత దాడులు
టోక్యో: జర్మనీకి చెందిన కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కుంభకోణం తరహాలో మరో కార్ల కంపెనీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో జపాన్ కు చెందిన మిత్సుబిషి మోటార్స్ కంపెనీ ఫ్యుయల్ ఎకానమీ డాటా విడుదలలో అక్రమాలకు పాల్పడినట్టు ఒప్పుకుంది. తప్పుడు నివేదికలు అందించినట్లు ఆ కంపెనీ అంగీకరించింది. ఈ వ్యవహారంపై స్పందించిన జపాన్ అధికారులు దాడులు నిర్వహించారు. ఒకజాకి నగరంలో ఉన్న ఆ కంపెనీ ప్రధాన ప్లాంట్‌లో గురువారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
వాహన మైలేజ్ అంశంలో డేటాను తమ ఉద్యోగులు మార్చినట్లు మిత్సుబిషి సంస్థ అంగీకరించింది. సుమారు 60వేల వాహనాలకు అలా చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రమైన కేసుగా పరిగణిస్తున్నామని ప్రభుత్వాధికారులు తెలిపారు. మైలేజ్ టెస్టింగ్‌లో చూపించిన తప్పుడు రిపోర్టులకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని కంపెనీని సూచించారు.
ఏప్రిల్ 27వ తేదీలోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అయితే సోదాల ద్వారా వెల్లడైన వాస్తవాలను పరిశీలించిన తర్వాత మొత్తం ఎన్ని వాహనాలకు తప్పుడు నివేదికలు ఇచ్చారో స్పష్టం చేయనున్నట్లు ఆ దేశ క్యాబినెట్ సెక్రటరీ తెలిపారు. కార్ల భద్రత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.