టంపా: ప్రమాదకరమైన తాచుపాము నుంచి ఏడేళ్ల అమ్మాయిని రక్షించి జర్మన్ షెపర్డ్ జాతి కుక్క 'హాస్' సూపర్ హీరోగా మారింది. బాలికను కాపాడేక్రమంలో పాముతో పోరాడి గాయపడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ కుక్క కోలుకోవాలని ఎంతోమంది కోరుకుంటున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్లో టంపా నగరంలో ఈ ఘటన జరిగింది.
టంపాలో ఆడమ్ డిలుకా ఇంటి పెరట్లో ఏడేళ్ల బాలిక ఆడుకుంటోంది. ఇంతలో ఓ తాచుపాము ఆ అమ్మాయి దగ్గరకు వచ్చింది. కుక్క అమ్మాయిని కాపాడేందుకు వెంటనే ముందుకు దూకింది. తాచుపాము నుంచి అమ్మాయి ప్రాణాలు కాపాడేందుకు పోరాడింది. పాము మూడుసార్లు కాటేసిన కుక్క వెనక్కితగ్గలేదు. చివరకు కుక్క దెబ్బకు పాము అక్కడి నుంచి వెళ్లిపోయంది. బాలికను సురక్షితంగా కాపాడింది కానీ పాముతో పోరాడే క్రమంలో కుక్క తీవ్రంగా గాయపడింది. ఇంటిపైన ఉన్న బాలిక నానమ్మ మోలీ డిలుకా కుక్క అరుపులు విని కిందికు వచ్చింది. కుక్కకు రక్తస్రావంకావడాన్ని గమనించింది. కుక్కకాలిపై ఉన్న గాయాలను పరిశీలించిన మోలీ అవి పాముకాట్లుగా గుర్తించింది.
టంపా ఎమర్జెన్సీ వెటర్నరీ, స్పెషాల్టీ ఆస్పత్రి ఐసీయూలో ప్రస్తుతం కుక్క చికిత్స పొందుతోంది. పాము కాటు వల్ల కుక్క కిడ్నీ పాడైంది. కుక్కకు ప్రాణాపాయం తప్పినా చికిత్సకు భారీగా ఖర్చు అవుతోంది. రోజుకు 67 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతోంది. కుక్కను ఆదుకునేందుకు డిలుకా ఫ్యామిలీ ఫ్రెండ్ విరాళాలు కోరగా వందలాదిమంది స్పందించారు. కుక్క వైద్యానికి మొత్తం 10 లక్షల రూపాయలు అవసరం అవుతుందని భావించగా, దాదాపు 24 లక్షల రూపాయలు పోగయ్యాయి. వైద్యానికి అయ్యే డబ్బు పోను మిగిలినదాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకు అందజేయనున్నారు. కుక్క పూర్తిగా కోలుకుంటుందని వైద్యులు చెప్పారు. డిలుకా కుటుంబం ఈ ప్రమాదం జరగడానికి నెల రోజుల ముందే ఈ కుక్కను తీసుకున్నారు. ఇది తమ కుటుంబాన్ని కాపాడిందని డిలుకా ప్రశంసించాడు.
పాముతో పోరాడి బాలికను కాపాడిన కుక్క
Published Sat, May 14 2016 8:30 PM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM
Advertisement
Advertisement