టాటా.. తెలంగాణ సేవల కోట
'తెలుగు కళల తోట.. తెలంగాణ సేవల కోట' నినాదంతో ఏర్పాటయిన టాటా (తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ తెలుగు ఇన్ అమెరికా) ఇటు అమెరికాలోనే కాకుండా అటు తెలంగాణలో తనదైన శైలిలో అనేక కార్యక్రమాలతో దూసుకుపోతోంది. 2015, ఏప్రిల్ 5న ఈ తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రారంభోత్సవానికి యూఎస్ లోని వివిధ రాష్ట్రాలనుంచి మూడు వేలమంది తెలంగాణ ఎన్నారైలు హాజరైనట్లు ఫోరం అధ్యక్షుడు పైళ్ల మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై తెలంగాణ ఫోరం ఆవశ్యకతను మరోసారి గుర్తుచేసి, శుభాభినందనలు తెలియజేశారు.
టాటా వ్యవస్థాపకుడు పైళ్ల మల్లారెడ్డి అధ్యక్షత వహిస్తున్న కమిటీలో మహేందర్ ముసుగు, శ్రీనివాస్ అనుగు, డాక్టర్ సాంబ రెడ్డి, డాక్టర్ మోహన్ పటలోళ్ల, బల్వంత్ రెడ్డి, రమేశ్ చంద్ర, సంతోశ్ పాతూరి, భరత్ మదాడి, విక్రం జంగం, గౌతం గోలి, అనిల్ అర్రెబెల్లి సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా టాటా చేపడుతున్న, చేపట్టబోయే కార్యక్రమాలను అసోసియేషన్ అధ్యక్షుడు పైళ్ల మల్లారెడ్డి వివరించారు. చెరువుల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మిషన్ కాకతీయకు తనవంతుగా రూ. 40 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.
వరంగల్ కు చెందిన సుధాకర్ విదియాల రూ. 10 లక్షలు, టాటా ద్వారా మరో రూఏ.10 లక్షలు.. మొత్తం రూ.60 లక్షల విరాళాన్ని మిషన్ కాకతీయకు అందించనున్నట్లు చెప్పారు. ప్రముఖ కవి గోరటి వెంకన్న, హాస్య నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి, మిమిక్రీ రమేశ్, రేవంత్, లిప్సిక, అనుదీప్, ఆదర్శిణి, హనిష్క, యాంకర్లు అనసూయ, రవి తదితరులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.