రైలు ప్రమాదం ఇలా జరిగింది...
ఇండియానాపాలిస్: మిత్రుడి పుట్టినరోజునాడు మిత్రులంతా కలసి పార్టీ చేసుకునేందుకు అతి విలాసవంతమైన ‘లిమౌజిన్’ కారులో బయల్దేరారు. సరిగ్గా కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలపైకి కారు ఎక్కగానే ముందు చక్రాలు, వెనక చక్రాలు ఒక్కసారిగా గాలిలోకి లేచాయి. అంతే పట్టాలపైన కారు ఆగిపోయింది. అదే సమయంలో అటువైపుగా వేగంగా గూడ్సు రైలు దూసుకరావడాన్ని వ్యాన్‌లోవున్న మిత్రులు గమనించారు. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి వారంతా దిగిపోయారు. రైలు ఆపాలంటూ గోల చేశారు. కారును ఎలాగైనా రక్షించేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించి విఫలమైన డ్రైవర్ కూడా చివరి నిమిషంలో కారు నుంచి దూకేశారు. క్రమంగా వేగం తగ్గుతూ వచ్చిన రైలు కారును ఢీకొని, దాన్ని వంద అడుగుల దూరం వరకు లాక్కెళ్లింది.
అదే కారులో అనుకోకుండా ప్రయాణిస్తున్న స్థానిక ఫొటోగ్రాఫర్ నార్మన్ నోయి రైలుకు ఎదురుగా వెళ్లి రైలుతోపాటు పరుగెత్తుకొస్తూ యాక్సిడెంట్ సీన్‌ను తన వీడియోలో బంధించారు. ఏమయ్యా! అంతగోల చేస్తుంటే రైలును ఎందుకాపలేదని రైలు డ్రైవర్‌ను ప్రశ్నిస్తే....‘బ్రేక్ వేయగానే ఆగడానికి ఇదేమన్నా కారా? పదివేల టన్నుల బరువును మోసుకొస్తున్నా, అంత బరువును ఆపడం ఎలా సాధ్యం’ ఆ డ్రైవర్ సమాధానం ఇచ్చారు. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్టు చేసిన ఫొటోగ్రాఫర్ నార్మన్ నోయి ప్రమాదానికి సంబంధించి ఇంతకన్నా వివరాలు వెల్లడించలేదు. ఇండియానా పాలిస్ లో ఇటీవల ఈ ప్రమాదం జరిగింది.