టైటిల్ : ఆనందో బ్రహ్మా
జానర్ : కామెడీ హర్రర్
తారాగణం : తాప్సీ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్
సంగీతం : కృష్ణ కుమార్
దర్శకత్వం : మహి.వి. రాఘవ్
నిర్మాత : శశి దేవిరెడ్డి, విజయ్ చిల్లా, సందీప్ రెడ్డి, సృజన్ ఎఱబ్రోలు
ఒకప్పుడు తెలుగు తెర మీద సక్సెస్ ఫార్ములాగా ఓ వెలుగు వెలిగిన హర్రర్ కామెడీలు తరువాత ఆడియన్స్ కు బోర్ కొట్టేశాయి. దీంతో ఆ జానర్ సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చింది. తాజాగా అదే జానర్ లో ప్రేక్షకుల ముందు వచ్చిన మరో సినిమా ఆనందో బ్రహ్మా. అయితే రెగ్యులర్ హర్రర్ కామెడీలకు భిన్నంగా దెయ్యాలే మనుషులని చూసి భయపడే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది..? ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శల పాలైన తాప్సీని తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరించారు..?
కథ :
తల్లిదండ్రులను కోల్పోయిన.. ఎన్నారై రాము (రాజీవ్ కనకాల) వారికి జ్ఞాపకాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో వారి నివసించిన ఇంటిని అమ్మకాని పెడతాడు. అయితే అప్పటికే ఆ ఇంట్లో దెయ్యాలు నివసిస్తుంటాయి. ఇళ్లు కొనటానికి ముందుకు వచ్చినవారందరూ దెయ్యాల దెబ్బకు భయపడి పారిపోతారు. దీంతో ఇంట్లో దెయ్యాలున్నాయన్న నమ్మకాన్ని చెరిపేసేందుకు ఇంటిని అద్దెకివ్వాలని నిర్ణయించుకున్నాడు రాము. ఇంట్లో మూడు రోజులు ఉండి దెయ్యాలు లేవని చెప్తే కోటీ రూపాయిలు ఇస్తాననటంతో సిద్ధూ (శ్రీనివాస్ రెడ్డి) ఇంట్లో ఉండేందుకు ముందుకు వస్తాడు.
తనతో పాటు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులకు తలా పది లక్షలు ఇస్తానన్న ఒప్పందతో ఇంట్లోకి తీసుకువస్తాడు. అలా దెయ్యాలు నివసించే ఇంట్లోకి వచ్చిన శ్రీనివాస్ రెడ్డి, ఫ్లూట్ రాజు (వెన్నెల కిశోర్), బాబు (షకలక శంకర్), తులసి (తాగుబోతు రమేష్) ఎలాంటి ఇబ్బందులు పడ్డారు..? అసలు అలాంటి ఇంట్లో ఉండేందుకు వారు ఎందుకు అంగీకరించారు..? ఆ ఇంట్లో ఉంటున్న దెయ్యాలు ఎవరు..? రాము ఆ ఇంటిని ఎందుకు అమ్మాలనుకుంటున్నాడు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
మొదటి నుంచి ఇది తాప్సీ సినిమా అన్నట్టుగా ప్రమోట్ చేసినా సినిమాలో ఆమె పాత్ర ఆ స్థాయిలో లేదు. ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా లుక్స్ పరంగా తాప్సీకి ఫుల్ మార్క్స్ పడ్డాయి. కీలకమైన పాత్రలో రాజీవ్ కనకాల మరోసారి మెప్పించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ లో రాజీవ్ నటన ఆకట్టుకుంటుంది. నటుడు కావాలనుకొని నష్టపోయిన పాత్రలో షకలక శంకర్ ఒదిగిపోయాడు. శంకర్ చేసిన ఇమిటేషన్ కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. తాగుబోతుగా రమేష్ మరోసారి తన మార్క్ చూపించాడు. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్ లు తమదైన టైమింగ్తో నవ్వించే ప్రయత్నం చేశారు.
సాంకేతిక నిపుణులు :
పాటశాల సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మహి వి రాఘవ్, రెండో ప్రయత్నంగా డిఫరెంట్ ను కాన్సెప్ట్ ను ఎంచుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే హర్రర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాను ఆద్యంతం ఆకట్టుకునేలా నడిపించటంలో తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయానికి కేటాయించిన దర్శకుడు, ఇంటర్వెల్ బ్యాంగ్ ను ఆసక్తికరంగా మలిచి ద్వితియార్థం కోసం ఎదురుచూసేలా చేశాడు. సెకండాఫ్ స్టార్టింగ్ లో కాస్త బోర్ కొట్టినా.. తరువాత వరుసగా కామెడీ సీన్స్ తో అలరించాడు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అంత కన్వెన్సింగ్ గా అనిపించకపోవటం నిరాశ కలిగిస్తుంది. హర్రర్ జానర్ లో తెరకెక్కిన సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సంగీత దర్శకుడు కృష్ణ కుమార్ మంచి నేపథ్య సంగీతంతో సీన్స్ ను మరింత థ్రిల్లింగ్ గా మార్చాడు. కామెడీ సన్నివేశాల్లోనూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
లీడ్ యాక్టర్స్ కామెడీ
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్ :
కన్విన్సింగ్ గా లేని క్లైమాక్స్
బోర్ కొట్టించే కొన్ని సీన్స్
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్